కన్నడ వచనం:
ಜ್ಞಾನದ ಬಲದಿಂದ ಅಜ್ಞಾನದ ಕೇಡು ನೋಡಯ್ಯ.
ಜ್ಯೋತಿಯ ಬಲದಿಂದ ತಮಂಧದ ಕೇಡು ನೋಡಯ್ಯ.
ಸತ್ಯದ ಬಲದಿಂದ ಅಸತ್ಯದ ಕೇಡು ನೋಡಯ್ಯ.
ಪರುಷದ ಬಲದಿಂದ ಅವಲೋಹದ ಕೇಡು ನೋಡಯ್ಯ.
ಕೂಡಲಸಂಗನ ಶರಣರನುಭಾವದಿಂದ
ಎನ್ನ ಭವದ ಕೇಡು ನೋಡಯ್ಯ.
తెలుగు లిపిలో :
జ్ఞానద బలదింద అజ్ఞానద కేడు నోడయ్య
జ్యోతియ బలదింద తమంతద కేడు నోడయ్య
సత్యద బలదింద అసత్యద కేడు నోడయ్య
పరుషద బలదింద అవలోహద కేడు నోడయ్య
కూడలసంగన శరణరనుభావదింద ఎన్న భవద కేడు నోడయ్య
తెలుగు వచనం:
జ్ఞానము బలముచే అజ్ఞానము విడును చూడయ్య
జ్యోతి బలముచే చీకటి విడును చూడయ్య
సత్యపు బలముచే అసత్యము విడును చూడయ్య
పరుషపు బలముచే అవలోహము విడును చూడయ్య
కూడలసంగని శరణుల అనుభావముచే, మన భవము విడును చూడయ్య!!
వచనకర్త ఆంతర్యం :
ఎలాగైతే జ్ఞానము ఉన్న చోట అజ్ఞానము నిలవదో, దీపమున్నచోట చీకటి నిలువదో, సత్యము వ్యక్తమైన చోట అసత్యము నిలువదో, పరుశవేదిచే లోహముపై పరుషము తరగబడునో, అదే విధంగా శివశరణుల సాంగత్యముచే, వారి అనుభావముతో భవము నశించి జీవన్ముక్తి తప్పక లభిస్తుంది.
విశ్లేషణ:
వీరశైవుల పంచాచారాలలో ఆచరమైన గణాచారము యొక్క గొప్పదనాన్ని, ప్రయోజనాన్ని ఈ వచనం చక్కగా వర్ణిస్తుంది. గణాచారమంటే శివశరణుల సాంగత్యములో జీవనాన్ని గడపడం, వారితోనే స్నేహం చేయడం, వారి సలహాలనే పాటించడం వగైరా. దీనివల్ల ఉపయోగం ఏమిటి? భవము అంటే విషయ వాంఛ (materialism) నశిస్తుందని అంటున్నారు... ఎలా?
"ఆరునెలలు సహవాసం చేస్తే వీరు వారవుతారు" అనే వినికిడి మనకు తెలిసిందే. మనము చేసే సాంగత్యాన్ని బట్టి మన నడవడిక ఏర్పడుతుంది. అందుకే మంచి వారితో స్నేహం చేయమంటారు పెద్దలు.
లోకంలో చాలా విషయాలను మనస్సు జ్ఙానేంద్రియాల ద్వారా, అంటే చూపు, వినికిడి, రుచి, వాసన, స్పర్శల వల్ల గ్రహించి, వాటితో ఇష్ట- అయిష్టాలను ఏర్పరచుకుంటుంది. ఉదాహరణకు ఒక పదేళ్ళ ప్రాయందాకా ఒక పిల్లాడు తినని పుల్లారెడ్డి నేతి మిఠాయి ఒక రోజు తిన్నాడనుకుందాం. రుచి బాగా నచ్చి మనస్సుకి అప్పటినుంచి అది కావాలనిపిస్తుంది. పదేళ్ళ వరకు మనస్సుకు తెలియనిది ఇప్పుడు కొత్తగా తెలిసి మరీ నచ్చింది. అప్పటి నుండి వాడు అదే కావాలని అడుగుతాడు. దీనినే మనస్సుకు పట్టిన "వాసన" అంటారు. ఇక కొన్ని అలవాట్లు హద్దు మీరితే అవి వ్యసనాలుగా మారతాయి.
మనస్సు తనకి అలవాటైన వాటిని ఇష్టపడి వాటినే కోరుకుంటుంది - దీనికి సహవాసాలు (అంటే మనము ఇతరులతో గడిపే కాలం, చేసే స్నేహం) ప్రభావం చూపుతూ ఉంటాయి. ఉదాహరణకు ఎప్పుడు సంగీతం పాడే వాళ్లతో సహవాసం చేస్తే తెలియకుండానే సంగీతంలోని రాగాలు అలవాటై పోతాయి - పది సార్లు ఒక పాట వింటే ఆ పాట నోటికి వచ్చినట్టు. మంచి అలవాటు అనుకుందాం. అలాగే ఎప్పుడూ దురదర్శనంలో ధారావాహికలకు అలవాటు పడినవారికి, ఈ లోకం పట్టక, ఆ సమయంలో అదే చేయాలనిపిస్తుంది. వాళ్ళు అందులోనే మమేకమై అందరితో అవే ముచ్చట్లు చర్చిస్తారు. మనం వాళ్ళింటికి నాలుగు రోజులు సాయంత్రం వెళ్ళామనుకుందాం. వాళ్లతో బాటు తప్పనిసరై ఆ ధారావాహికం చూస్తే, ఇక ఆ తరువాత రోజు నుండి మనింట్లో కూడా అదే పని మొదలవుతుంది. లేని పోని కుతూహలం. అంటే లేని అలవాటుని మనస్సుకి తెచ్చిపెట్టాం - మంచిదో చెడ్డదో ఆలోచనకు వదిలేద్దాం!
అంతేగాక కొన్ని పనులు రోజు చేస్తే మనస్సు నేర్చేసుకొని, బుద్ధి యొక్క అవసరం లేకుండానే చేయడం మొదలెడుతుంది. ఉదాహరణకి మొదటిసారి వాహనం నడిపేటప్పుడు ప్రతీ చిన్న పని అలోచించి తెలిసి చేస్తాం. ఇప్పుడు వేగం తగ్గించాలి, కాబట్టి బ్రేకు వెయ్యాలి, ఇప్పుడు గేరు మార్చాలి అని ఆలోచించి చేయాల్సి వస్తుంది. కాని కొన్నాళ్ళైన తరువాత బుద్ధి ప్రమేయం లేకుండానే స్వయంచాలకంగా (automaticగా) అన్ని జరిగిపోతాయి. అంటే మనస్సుకి అలవాటై పోయి కొన్ని నిర్ణయాలు తీసేసుకుంటుంది.
అందుకే మనస్సుకి మనం ఇచ్చే అనుభావం (exposure) ముఖ్యం. మనం మనస్సుకి నిత్యం అలవాటు పడేలా ఇంద్రియాల ద్వారా లోపలికి ఏమి పంపుతున్నాం? -అనే విషయం పరిశీలించాలి. మంచి విషయాలు పంపితే అవే అలవాటు పడతాయి. చెడు పంపితే అవీ అలవాటుపడతాయి! కొందరంటారు మేము పిల్లలకు అన్ని రకాల సినిమాలను చూపుతాము. మంచి చెడులు వాళ్ళు నిర్ణయించుకోగలరు. అంత కట్టడి చేయాల్సిన అవసరం లేదు అని. ఎప్పుడో ఒకసారి ఐతే అది సరే. నిత్యం అవే చూపితే? మనస్సుకి అవి తప్పని తెలిసినా - "ఆ ఎప్పుడో ఒకసారి తప్పు చేస్తే ఫరవాలేదులే" అనే అభిప్రాయం ఏర్పడకుండా ఉంటుందని భరోసా ఇవ్వగలరా? ఉదాహరణకు గత పది సంవత్సారాలలో మనం చూసే సినిమాలవల్ల ఇప్పుడు ఒక వంద మందిని నరికేస్తే మనవాళ్ళకి తప్పు అనిపించడం లేదు.
అందుకే "చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు కనవద్దు" అన్నారు మన జాతి పిత.
ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. శివశరణులతో నిత్యం సాంగత్యం చేస్తే వారు మనకు భక్తి తత్పరత నేర్పుతారు. వాళ్ళకి నిత్యం శివారాధన పూజ, శివభక్తి, వాటిపై చర్చలు, సమాజ హితం, లోక హితం కోసం చేసే పనులు, అనుభవాలు పంచు కోవడం తప్ప ఇతరమైన విషయవాంఛలు ఉండవు. వారి అనుభావములు (experiences) మనతో పంచుకుంటారు.
అయితే అలాంటివాళ్ళు ఇప్పుడెక్కడున్నారండి? చెప్పడానికి బానే ఉంది అంటారేమో! మన చుట్టూ ఉన్న వీరశైవులలో శివభక్తి దాగి లేదా? వారితో సహవాసము చేయలేమా? ఒక వ్యక్తి స్వయంగా చేసే పనికన్నా సామూహికంగా చేసే పనికి ఎక్కువ ఫలితం లభిస్తుంది. ఒకరిని చూసి ఒకరికి భక్తిభావం పెరిగి, భావోద్వేగంతో, తనూ ఏదో చేయాలన్న ఉత్సాహం సమూహంలో ఉండడంవల్ల కలుగుతుంది. అందుకే మనకు అనుభవగోష్ఠులు, భజనలు, ప్రవచన సభలు మొదలైన సామూహిక వేదికలు ఏర్పరచారు. అంతేగాక ఎలాంటి కార్యం (పెళ్లి,బారసాల వంటివి) చేసినా వీరశైవులు వాటిని భగవత్సంబంధమైన కార్యంగానే చేస్తారు. భక్తిహీనులైతే తినడానికి, తాగడానికి, ఎగరడానికి చేస్తారు- అది మనకూ పాశ్చాత్యులకూ ఉండే తేడా! ప్రతీ కార్యంలో శివభక్తే. అంటే శివశరణులు ఒకటైనప్పుడు కేవలం శివనామస్మరణ, శివాచారాలతో గడపడం మన సామూహిక జీవన విధానంగా పెద్దలు ఏర్పరచారు. అక్కడ అందరూ సమానులే, అందరు శివభక్తులే. ఉచ్చనీచాలకు తావులేదు - బీదా-గొప్పా తేడ లేదు. అహంకరించడానికి అంతకన్నా తావులేదు. ఇది కూడా శివశరణుల సాంగత్యము, గణాచారమేగదా? ఇలాంటి సామూహిక శివశరణ కార్యాలను చులకనగా చూడడం తప్పు. వాటిలో పాల్గొనక పోవడం వీరశైవులకు అపరాధమే అవుతుంది.
శివశరణులతో నిత్యం సహవాసం చేసినప్పుడు మనకు శైవీ విషయాల పైనే మక్కువ ఏర్పడుతుంది. ఇప్పుడు మన మనస్సులోకి శివసంబంధమైన విషయాలనే పంపుతున్నాము; శరణుల సాంగత్యంలో శివమయమైన జీవనాన్ని మనస్సుకు ప్రయత్నపూర్వకంగా అలవాటు చేస్తున్నాము. కొన్నాళ్ళకు మనస్సుకు అప్రమేయంగా (automatic) శివభక్తి అలవాటవుతుంది. శివపూజ చేయమని చెప్పాల్సిన పనిలేదు; తెలియకుండానే చేసేస్తారు. పాటలువినాలనిపిస్తుంది - కాని శివస్థుతులు మాత్రమే. మంచి పదార్థము తినాలనిపిస్తుంది - శివునికి అర్పించిన తరువాత మాత్రమే. చాన్నాలైంది శ్రీశైలంలో శివున్ని చూడాలనిపిస్తుంది. దూరదర్శనం చూడాలనిపిస్తుంది -భక్తి కార్యక్రమాలు, శివుని గురించిన ఉపన్యాసాలు. ఇతరములు రుచించవు.
శివశరణుల కరుణవల్ల మనస్సులో శివజ్ఞానము కలిగినవెంటనే పనికి మాలిన విషయములపై ఆసక్తి అనే అజ్ఞానము నశించదా? శివజ్యోతి అన్న దీపము ప్రతిష్టించబడి మనస్సులోవ్యర్థాలోచనల చీకటి పారిపోదా? శివానందమనే సత్యం తెలిసిన వెంటనే ప్రాపంచిక సుఖాల అసత్యము పటాపంచలు కాదా? శరణుల నిత్యసావాసమనే పరుషపు(File used to sharpen knives) రాపిడిచేత మనస్సుకు పట్టిన చెడు అలవాట్ల అవలోహము/తుప్పు తరగి పోదా? ఇలాంటి అలవాట్లు ఐన తరువాత - నిత్యం శివధ్యానంలో గడిపే వానికి, విషయ వాంఛలకి దూరమైన వానికి, శివసాయుజ్యమూ, భవముల నుండి ముక్తి ఎందుకు లభించదు?
శరణు శరణార్థి!!