కన్నడ వచనం
ಎಂತಹವನಾದಡೇನು, ಲಿಂಗವ ಮುಟ್ಟದವನೆ ಕೀಳುಜಾತಿ.
ಕುಲವಹುದು ತಪ್ಪದು ಲಿಂಗ ಮುಟ್ಟಲೊಡನೆ,
ಹೊನ್ನಹುದು ತಪ್ಪದು ಪರುಷ ಮುಟ್ಟಲೊಡನೆ.
ಕೂಡಲಸಂಗಮದೇವನೊಲ್ಲ ಸರ್ವಸಂದೇಹಿಗಳ
తెలుగు లిపిలో
ఎంతహవనాదడేను, లింగవ ముట్టదవన కీళుజాతి
కులవహుదు తప్పదు లింగ ముట్టలోడనె ,
హొన్నహుదు తప్పదు పరుష ముట్టలోడనె.
కూడలసంగమదేవనొల్ల సర్వ సందేహిగళ!!
తెలుగు వచనం
ఎంతవాడైతేనేమి, లింగము ముట్టనివానిది హీనజాతి
కులవంతుడగును తప్పదు లింగము ముట్టగనె
బంగారమగును తప్పదు పరుషము ముట్టగనె
కూడలసంగమదేవుడొల్లడు సర్వసందేహులను!!
అర్థం
ఎంతటివాడైనా లింగవంతుడు కాకపొతే వాడు హీనుడే. లింగవంతుడైన వాడే ఉత్తమ కులవంతుడు. దీనిపై సందేహ పడితే శివునికి నచ్చదు.
విశ్లేషణ
వీరశైవుల కులవిచారణ చేయవలసి వస్తే వారిని ఎలా గ్రహిస్తారో తెలిపే ఒక వచనం ఇది.
ఉచ్చనీచములు ఎంచుతూ ఉండెడి వారు మనకు ఈనాటికి తారసపడుతూ ఉంటారు. కొందరు వీరశైవులను, మీరు యజ్ఞోపవీతము (జంధ్యము) ధరించరు కాబట్టి శూద్రులతో సమానమని అభిప్రాయపడే వారు కూడా తారస పడ్డారు. అయితే అటువంటి వారికి సమాధానమే ఈ వచనం.
సాధారణ హైందవ సాంప్రదాయములో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అంత్యజులనే వ్యవహారము మనము నిత్యమూ చూసేదే. వీరిలో బ్రాహ్మణులు అందరికీ పూజ్యులని వైదిక ధర్మాన్ని పాటించేవారు నమ్ముతారు.
వీరశైవులు పాటించేది శరణ సాంప్రదాయం. ఇది శివునిచే చేయబడిన వ్యవస్థ. లింగధారులైన వారు ఎవరైనా సరే, వారు శివలింగ సంపర్కము చేత పూర్వసంస్కారమును విడిచి శివగణములలో భాగమవుతారు. భక్తిగల వారు ఎవ్వరైనా స్వీకరించ గలిగే ధర్మము ఇది. అటువంటి వారికి పూర్వపు జాతిభేదములు అంటవు. గురుబోధ, దీక్షా సంబంధము చేత, లింగము తాకిన వెంటనే వీరి పూర్వ జాతి బేధము విడిపోతుంది. వీరు విశుద్ధులై అత్యాశ్రమ ధర్మము వారవుతారు. అంటే కులాతీతులు, అంటూ-ముట్టు వంటి దోషములకు అతీతులు. వీళ్ళు ప్రత్యేకంగా యజ్ఞోపవీతం ధరించరు - లింగమే వీరికి యజ్ఞోపవీతం. లింగధారణమువలన వీరు నిత్య శుచిర్భూతులు అవుతారు. ఉదాహరణకు వీళ్ళు గర్భగుడిలోకి ప్రవేశించి శివలింగాన్ని స్పృశించ వచ్చు. స్మశానంలో తిరిగినా దోషము ఉండదు.
==========
సిద్ధాంత శిఖామణి, 10వ పరిచ్ఛేదములోని శ్లోకాలను మళ్ళీ ఒక్కసారి చూద్దాము:
34
విశుద్ధాః ప్రాకృతాశ్చేతి ద్వివిధా మానుషాః స్మృతాః
శివసంస్కారిణః శుద్ధాః ప్రాకృతా ఇతరే మతాః ||
విశుద్ధులు, ప్రకృతులు అని మనుషులను రెండు విధములుగా స్మృతులు విభజించాయి. శివసంస్కారము పొందిన వారు విశుద్ధులు. ఇతరులు ప్రాకృత మతస్తులు. వీరి సాంప్రదాయాలు వేరేగా ఉంటాయి అని గ్రహించాలి. శివదీక్ష స్వీకరించిన శరణులంతా విశుద్ధులుగా మారినవారు.
35.
వర్ణాశ్రమాది ధర్మాణాం వ్యవస్థా హి ద్విధా మాతా|
ఏకా శివేన నిర్దిష్టా, బ్రహ్మణా కథితా పరా ||
వర్ణాశ్రమ ధర్మముల వ్యవస్థ రెండు రకాలు. మొదటిది శివునిచేత నిర్దిష్ఠమైనది - ఇది విశుద్ధులు పాటించేది.
రెండవది బ్రహ్మ చేత చెప్పబడినది - అది సాధారణంగా మనకు కనబడే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అంత్యజుల వ్యవస్థ. విశుద్ధులు దీన్ని పాటించరు.వాళ్ళు శివుని మార్గంలోనే ఉంటారు.
==================
ఈ సాంప్రదాయము ప్రకారము, లింగధారి కాని వాడు బ్రాహ్మణుడైనా సరే, అతడు గణవ్యవస్థలో ఉన్న లింగవంతునితో పోలిస్తే తక్కువ వాడిగానే పరిగణింపబడతాడు. భక్తి పూర్వకముగా శివదీక్షాపరుడై శివలింగ ధారణ చేసిన వాడు పూర్వ జాతితో సంబంధము లేకుండా వెంటనే ఉత్తమ కులజుడవుతాడు అని ఆగములు చెబుతున్నాయి. పరుషము తగిలినప్పుడు లోహము బంగారము కాక తప్పదు - అదే విధంగా భక్తి పూర్వకముగా లింగము ధరించినవాడు ఉత్తమకులజుడు కాక తప్పదు. ఇందులో ఎటువంటి సందేహము లేదని గ్రహించాలి. సందేహపడితే శివుడు అనుగ్రహించడని బసవన్న చెబుతున్నారు.
శాస్త్రము తెలిసిన వారు అందరూ శివాచారులైన లింగధారులను పూజిస్తారు. లింగధారులు మాత్రము కేవలం లింగధారులకే శరణార్థులు. లింగధారికాని వ్యక్తి బ్రాహ్మణుడైనా అతని పాదాలను ముట్టుకుంటే, ఆ బ్రాహ్మణునికి దోషము - కాబట్టి లింగధారులు, లింగవంతులు కానివారిని పూజించరు. బ్రాహ్మణులే లింగధారులను పూజిస్తారు.
అయితే ఈనాటి వీరశైవులకు ఒక గమనిక. ఇక్కడ చెప్పే గొప్పతనము భక్తితో కూడిన దీక్షవల్ల కలిగేది. కేవలం ఒక వీరశైవుని ఇంట్లో పుట్టినందుకు ఉచితంగా లభించేది కాదు. ఇలా దీక్షను స్వీకరించిన వారు తమ అహంకారాన్ని వదిలి శివోహ భావనతో, నిత్య శివస్మరణలో, త్రిసంధ్యలలో శివారాధనలో, లింగాంగ సామరస్యంతో ఉంటారు. అటువంటి వారికి వర్తించేది ఈ శివగణత్వము. కాబట్టి పైన చెప్పిన దాన్ని అపార్ధం చేసుకొని గొప్పదానానికి పోకూడదని విజ్ఞప్తి.
ఇక్కడ చెప్పినది ఊరికే మేము లింగాయతులమని గర్వపడడానికి కాదు, రెండు కారణాల వల్ల:
మొదటిది, బసవన్న చెప్పినట్లు ఎటువంటి సందేహమునకు తావులేకుండా, శివునిపై అపారమైన నమ్మకమును ఏర్పరచుకొని లింగవంతులు తాము ఎవరికన్నా తక్కువవారము కాదనే ధీమాతో బ్రతకాలి. ఇతరులను తక్కువగా చూడకూడదు; అలాగని తాము తక్కువవారము కాదన్న విశ్వాసము కలిగి, ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానము చెప్పగలిగే శాస్త్ర జ్ఞానము కలిగి ఉండాలని.
రెండవది, "శరణసాంప్రదాయం ఇంత గొప్పదా?" అన్న కుతూహలాన్ని పెంచడానికి. ఇటువంటి గొప్పదనమును పొందాలంటే ఈ శరణ సాంప్రదాయంలోని నియమాలను తెలుసుకొని పాటించాలనే కోరిక కలగవచ్చు. పేరుకు లింగధారులము అనుకుంటే సరిపోదు, తెలుసుకోవలసింది చాలా ఉంది అనే భావన కలిగితే అన్వేషణ ప్రారంభమవుతుంది.
శరణార్థులై ఉంటే ఉత్తమత్వము, గౌరవము అప్రయత్నంగానే వచ్చి చేరతాయి.
శరణు శరణార్థి!!
No comments:
Post a Comment