Saturday, June 20, 2015

25. Vachanadalli Naamaamruta Tumbi - Basavanna

కన్నడ వచనం 

ವಚನದಲ್ಲಿ ನಾಮಾಮೃತ ತುಮ್ಬಿ 
ನಯನದಲ್ಲಿ ನಿಮ್ಮ ಮೂರುತಿ ತುಮ್ಬಿ 
ಮನದಲ್ಲಿ ನಿಮ್ಮ ನೆನಹು ತುಮ್ಬಿ 
ಕಿವಿಯಲ್ಲಿ ನಿಮ್ಮ ಕೀರುತಿ ತುಮ್ಬಿ 
ಕೂಡಲ ಸಂಗಮ ದೆವಾ ನಿಮ್ಮ ಚರಣಕಮಲದೊಳಗಾನು ತುಮ್ಬಿ

తెలుగు లిపిలో 

వచనదల్లి నామామృత తుంబి 
నయనదల్లి నిమ్మ మూరుతి తుంబి 
మనదల్లి నిమ్మ నెనహు తుంబి 
కివియల్లి నిమ్మ కీరుతి తుంబి 
కూడలసంగమ దేవా నిమ్మ చరణకమలదొళగాను తుంబి

తెలుగు వచనం 

వచనమందు నామామృతము నింపి 
నయనములందు నీ మూర్తిని నింపి 
మనమందు నీ తలపు నింపి 
చెవులందు నీ కీర్తిని నింపి 
కూడలసంగమ దేవా నీ చరణకమలములలో తుమ్మెదనై నిండెద 

వచనకర్త ఆంతర్యం 

పరమేశ్వరా, ఎప్పుడూ నీకు సంబందించిన పలుకులు మాత్రమే పలుకుతాను, నీ మూర్తిని దర్శించుటకే ఇష్టపడతాను, నీ తలపులే మనస్సులో నింపుకుంటాను, నీ కీర్తినే చెవులతో వినుటకు తహతహలాడతాను, నీ పాదముల చుట్టూ పద్మము చుట్టూ తుమ్మెద తిరిగినట్టుగా ఎప్పుడూ తిరుగుతుంటాను. నీకు సంబందించిన విషయములు తప్ప ఇతరాత్రములేవీ నాకు సరిపడవు. 

విశ్లేషణ

కన్నడలో తుంబి అనే పదానికి రెండర్థాలున్నాయి - ఒకటి "నింపి" అని, ఇంకొంకటి "తుమ్మెద" అని. ఈ పదాలు కుదరక తెలుగు వచనమ్లో "నిండెద"ననే మరో పదం వాడాస్లి వచ్చింది. తెలుగు బాగా తెలిసిన వారు తెలుగు వచనాన్ని ఇంకో విధంగా ఇంకా చక్కగా చెప్పగలరు. పదాలలో మార్పులు తడితే సూచించండి. 

ఈ వచన ప్రభావం తెలుగు వాంగ్మయంపై కూడా ఉందనడానికి సాక్షమే పోతన వ్రాసిన "కమలాక్షునర్చించు కరములు కరములు" అనే పద్యం. ఇదే తాత్పర్యంతో తన పద్యంలో శివుని బదులు హరిని వాడారు పోతన. 

ఒక నిజభక్తుని మనో భావాన్ని ఆవిష్కరించే వచనమిది. తన్మయత్వము అనే పదానికి నిర్వచనము ఈ వచనం. తత్+మయ = తన్మయం, అంటే నేను-నీవవవడం. భక్తుని ఆలోచనలన్నీ శివుని చుట్టే. చూపులు శివలింగమో, విగ్రహమో కనిపిస్తే అక్కడే చూస్తూ నిలిచిపోతాయి. ఎవరైనా శివుని గురించి మాట్లాడుతుంటే అవే వింటూ ఉండిపోతాడు; మిగిలిన పనులు మరచి పోతాడు. దగ్గొచ్చినా, తుమ్మోచ్చినా, మంచి చూసినా, చెడు చూసినా, ఆశ్చర్యమైన, భయమైనా, సంతోషమైన, దుఃఖమైనా, కూర్చుంటూ, లేచి నిలబడుతూ ఏ పని చేసినా "శివ శివా" అంటూ నోటిలో నుంచి దొర్లేది శివనామమే. "మహాదేవేతి సంకీర్తనం సామీప్యే" అని శివానందలహరిలో అన్నట్టు, ప్రతీ చేష్టలో శివుడున్నప్పుడు అతడు శివునికి సమీపంగా ఉన్నట్టే - సామీప్యముక్తి పొందుతుంటాడు భక్తుడు! 

తుమ్మెద పువ్వు చుట్టూ తిరుగుతుంది. కొంచెం మధువు ఆస్వాదిస్తుంది. ఎందుకో పక్కకి వెళ్తుంది. మళ్లి మధువు గుర్తొచ్చి తిరిగి వస్తుంది. అలా దినమంతా పువ్వుచుట్టూ తిరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడూ మనసు చెదిరినా, తిరిగి వచ్చినట్టు భక్తుడుకూడా ఎన్ని పనులున్నా, కొన్నిసార్లు ధ్యాస వేరే వాటిపైకి పోయినా కూడా గుర్తు తెచ్చుకుంటూ శివుని పాదాలచుట్టూ ధ్యానంలో తిరిగుతూ ఉంటాడు. "భజమనః శివమేవ నిరంతరం" అని మనస్సెపూడూ శివున్నే తలచు కుంటూ ఉంటుంది. 
"ధ్యానే భవానీపతే సాయుజ్యం" అన్నట్టు, ఇక్కడ తత్ అయిన శివుడిని అనునిత్యం ధ్యానంలో అనుభవించే మయ (అంటే తానైన భక్తుడు), ఆ శివునిలోనే చేరిపోయి శివసాయుజ్యం పొందుతాడు. ఇదే "లింగైక్య స్థితి". వీరశైవులు లింగైక్యం పొందటం అంటే ఇలాంటి స్థితిలో ఉండటం.  
ఈ లింగైక్య స్థితిని చూపు, వినికిడి, పలుకు, మనస్సు ఎలా అనుభవిస్తాయో విడివిడిగా వివరించారు బసవన్న.    

మరి ఆ స్థితికి ఎలా చేరుకుంటారు అంటే - చూపులో శివున్ని ఉంచడానికి ఇష్ట లింగాన్ని, వినికిడిలో శివున్ని ప్రేరేపించడానికి గురుజంగమల బోధలను, పలుకు స్వచ్చత కోసం తీర్థ ప్రసాదాలను, మనస్సు-ధ్యానం కోసం మంత్రాన్ని మొత్తంగా మనిషిని శివునిగా మార్చడం కోసమే అష్టావరణాలను (గురులింగజంగమభస్మపాదోదకప్రసాదమంత్రరుద్రాక్షలను) ఏర్పాటు చేసారని నా అభిప్రాయము. కాబట్టి ఎత్తి పరిస్తితుల్లోను వీటిని వీడవద్దని ప్రార్థన.

శరణు శరణార్థి!!
  











No comments:

Post a Comment