Sunday, June 28, 2015

26. Ura Sirege Asaga Badivadedante - Basavanna



కన్నడ వచనం

ಊರ ಸೀರೆಗೆ ಅಸಗ ಬಡಿವಡೆದಂತೆ
ಹೊನ್ನೆನ್ನದು, ಹೆಣ್ಣೆನ್ನದು, ಮಣ್ಣೆನ್ನದು, ಎಂದು ಮರುಳಾದೆ
ನಿಮ್ಮನರಿಯದ ಕಾರಣ, ಕೆಮ್ಮನೆ ಕೆಟ್ಟೆ ಕೂಡಲಸಂಗಮದೇವ.

తెలుగు లిపిలో 

ఊర సీరెగె అసగ బడివడెదంతె 
హొన్నన్నదు, హెణ్ణెన్నదు, మణ్ణెన్నదు, ఎందు మరుళాద 
నిమ్మ నరియద కారణ, కెమ్మనె కెట్టె కూడలసంగమదేవ 

తెలుగు వచనం 

ఊరి చీరలు చాకలుతికిన తీరు 
నగలనుచు, మగువనుచు, మన్ననుచు, మరులుగొని మూఢున్నైతి
నిన్ను తెలియని కారణమున చెల్లక చెడితి కూడలసంగమ దేవ

వచనకర్త ఆంతర్యం
 శివా, నిన్ను తెలుసుకోవలసిన పనిని మరచి ఇతర విషయాలపై మనసు నిలిపి చెడిపోతున్నాను. నా ఆత్మనుశుద్ధి పై ఉండవలసిన ధ్యాసను నాకుపయోగ పడని విషయాలపై బెట్టి ఇతరుల బట్టలుతికే చాకలివలే మారిపోయాను.  

విశ్లేషణ 

మనిషిగా జన్మనెత్తినవాడు భాగవత్భక్తి అనే మార్గాన్ని పట్టుకొని ఆత్మజ్ఞానాన్ని సాధించే ప్రయత్నం చేయాలని పెద్దలంటారు. శివశివా అని పలుక వలసిన వాక్కు, ధ్యానంతో శివ జ్ఞానాన్ని అలోచించగలిగే బుద్ధి,  కుండళినిశక్తిని  ప్రేరేపించి సహస్రారంలో శివున్ని చేర్చగలిగే శరీరములోని మేరుదండము (వెన్నెముక) వంటివి మనిషి స్వంతము. ఇతర జీవులకు లేని ఈ సదుపాయాలు, అలోచనా శక్తి మనుషికి ఉన్నాయి. 

అయితే అజ్ఞానము సరైన మార్గదర్శనము లేని వాళ్ళు ధనార్జన, ఆస్తులని, బంగారమని, కామవాంఛని, పదవని, దేశవిదేశ సంచారమని రకరకాలైన విషయవాసనలకు అలవాటై పోతారు. అవే తమ లోకంగా మారిపోతాయి. జీవితమంతా వీటిని సాధించడానికే చచ్చేవరకూ విపరీత ప్రయత్నాలు చేస్తారు. వీటిలో ఏ ఒక్కటీ కూడా తనతో రాదని, తనకి (అంటే ఆత్మకి) ఉపయోగపడదని తెలుసుకోజాలరు. ఆర్జించిన సంపద అంతా పిల్లలు పంచుకుంటారేమో - దానికోసం వారిలో వారికి తగవులు!  అనుకూలించకపోతే దొంగల పాలు. అంతే గాని తనతో పాటు రాదు. అలాంటి మన పరిస్థితిని తన స్వవిషయాన్ని పట్టించుకోక ఇతరుల బట్టలుతికే చాకలితో పోల్చారు బసవన్న. 
ఉదాహరణకు ఒక సంఘటన. ఈ మధ్య కొంత మంది స్నేహితులతో మాట్లాడుతున్నపుడు కాకతాళీయంగా ఒక ప్రశ్న వచ్చింది - పదివీవిరమణ (retirement) తరువాత ఏమిచేయాలి దానికి ముందునుంచే ప్రణాళిక చేసుకోవాలని. అందరి ఆలోచనలన్ని ఏ ఏ దేశాలు తిరగవచ్చు, ఏ ఆటలు (sports/games) అలవాటు చేసుకోవాలి మొదలైన భౌతికవాద(materialistic) కోరికలేగాని ఆత్మవిచారణ గురించి ఎవ్వరు సూచించలేదు. 

ఆత్మవిచారణ ("నేను ఎవరు? నా లక్ష్యం ఏమిటి?" అనే ఆలోచన) కలగాలంటే ముఖ్యంగా నిత్యపూజ, లేదా ధ్యానము అవసరమని అర్థమైంది. అది లేనివారికి కనీసం పది నిముషాలు కూడా ఏ భౌతికపరమైన ఆలోచనలు చేయకుండా మనస్సును నిలిపే అవకాశం చాలా తక్కువ. ఇక వారు తమ సమయాన్నాంతా కోర్కెలు తీర్చుకునే ప్రయత్నంలోనే ఉంచుతారు - ఇతరత్రా లక్ష్యమేమి ఉండదు. దీనినే ఆధ్యాత్మిక భాషలో పశుప్రవుత్తి అంటారు. అంటే కోరికలు తీర్చుకునే లంపటంలో కూరుకు పోయి పాశాలలో లేదా బంధాలలో చిక్కడం అన్నమాట. ఈ స్థితి నుండి విడగొట్టడానికే వీరశైవులకు అష్టావరణాలు, పంచాచారాలున్నూ! ఈ అచారాలన్ని నిత్యఇష్టలింగపూజ చుట్టూ కట్టబడి ఉన్నాయి. వీటిని పాటించేవారికి జీవిత లక్ష్యాన్ని ప్రశ్నించుకొనే అవకాశం, ఆలోచన ఆ శివుడే కలిగిస్తూ ఉంటాడు. అందుకే ఈ పశు బంధాలను తృంచే శివుడు "పశుపతి" అనబడ్డాడు; ఆ పాశుపత దీక్షే వీరశైవమైంది.            

ముఖ్యంగా వీరశైవ దీక్షలో ఉండేవారు, ఆత్మపరిశోధనను మరచి, శివ ధ్యాసను మరచి ఇతర విషయాలపై అపేక్ష ఉంచడం వల్ల సాధించ గలిగేది ఏమీ ఉండదని, చెడిపోతామని బసవన్న ఒక భక్తుని స్థానంలో తనని ఉంచుకొని చెబుతున్నారు. 

శరణు శరణార్థి!! 






  




  

Saturday, June 20, 2015

25. Vachanadalli Naamaamruta Tumbi - Basavanna

కన్నడ వచనం 

ವಚನದಲ್ಲಿ ನಾಮಾಮೃತ ತುಮ್ಬಿ 
ನಯನದಲ್ಲಿ ನಿಮ್ಮ ಮೂರುತಿ ತುಮ್ಬಿ 
ಮನದಲ್ಲಿ ನಿಮ್ಮ ನೆನಹು ತುಮ್ಬಿ 
ಕಿವಿಯಲ್ಲಿ ನಿಮ್ಮ ಕೀರುತಿ ತುಮ್ಬಿ 
ಕೂಡಲ ಸಂಗಮ ದೆವಾ ನಿಮ್ಮ ಚರಣಕಮಲದೊಳಗಾನು ತುಮ್ಬಿ

తెలుగు లిపిలో 

వచనదల్లి నామామృత తుంబి 
నయనదల్లి నిమ్మ మూరుతి తుంబి 
మనదల్లి నిమ్మ నెనహు తుంబి 
కివియల్లి నిమ్మ కీరుతి తుంబి 
కూడలసంగమ దేవా నిమ్మ చరణకమలదొళగాను తుంబి

తెలుగు వచనం 

వచనమందు నామామృతము నింపి 
నయనములందు నీ మూర్తిని నింపి 
మనమందు నీ తలపు నింపి 
చెవులందు నీ కీర్తిని నింపి 
కూడలసంగమ దేవా నీ చరణకమలములలో తుమ్మెదనై నిండెద 

వచనకర్త ఆంతర్యం 

పరమేశ్వరా, ఎప్పుడూ నీకు సంబందించిన పలుకులు మాత్రమే పలుకుతాను, నీ మూర్తిని దర్శించుటకే ఇష్టపడతాను, నీ తలపులే మనస్సులో నింపుకుంటాను, నీ కీర్తినే చెవులతో వినుటకు తహతహలాడతాను, నీ పాదముల చుట్టూ పద్మము చుట్టూ తుమ్మెద తిరిగినట్టుగా ఎప్పుడూ తిరుగుతుంటాను. నీకు సంబందించిన విషయములు తప్ప ఇతరాత్రములేవీ నాకు సరిపడవు. 

విశ్లేషణ

కన్నడలో తుంబి అనే పదానికి రెండర్థాలున్నాయి - ఒకటి "నింపి" అని, ఇంకొంకటి "తుమ్మెద" అని. ఈ పదాలు కుదరక తెలుగు వచనమ్లో "నిండెద"ననే మరో పదం వాడాస్లి వచ్చింది. తెలుగు బాగా తెలిసిన వారు తెలుగు వచనాన్ని ఇంకో విధంగా ఇంకా చక్కగా చెప్పగలరు. పదాలలో మార్పులు తడితే సూచించండి. 

ఈ వచన ప్రభావం తెలుగు వాంగ్మయంపై కూడా ఉందనడానికి సాక్షమే పోతన వ్రాసిన "కమలాక్షునర్చించు కరములు కరములు" అనే పద్యం. ఇదే తాత్పర్యంతో తన పద్యంలో శివుని బదులు హరిని వాడారు పోతన. 

ఒక నిజభక్తుని మనో భావాన్ని ఆవిష్కరించే వచనమిది. తన్మయత్వము అనే పదానికి నిర్వచనము ఈ వచనం. తత్+మయ = తన్మయం, అంటే నేను-నీవవవడం. భక్తుని ఆలోచనలన్నీ శివుని చుట్టే. చూపులు శివలింగమో, విగ్రహమో కనిపిస్తే అక్కడే చూస్తూ నిలిచిపోతాయి. ఎవరైనా శివుని గురించి మాట్లాడుతుంటే అవే వింటూ ఉండిపోతాడు; మిగిలిన పనులు మరచి పోతాడు. దగ్గొచ్చినా, తుమ్మోచ్చినా, మంచి చూసినా, చెడు చూసినా, ఆశ్చర్యమైన, భయమైనా, సంతోషమైన, దుఃఖమైనా, కూర్చుంటూ, లేచి నిలబడుతూ ఏ పని చేసినా "శివ శివా" అంటూ నోటిలో నుంచి దొర్లేది శివనామమే. "మహాదేవేతి సంకీర్తనం సామీప్యే" అని శివానందలహరిలో అన్నట్టు, ప్రతీ చేష్టలో శివుడున్నప్పుడు అతడు శివునికి సమీపంగా ఉన్నట్టే - సామీప్యముక్తి పొందుతుంటాడు భక్తుడు! 

తుమ్మెద పువ్వు చుట్టూ తిరుగుతుంది. కొంచెం మధువు ఆస్వాదిస్తుంది. ఎందుకో పక్కకి వెళ్తుంది. మళ్లి మధువు గుర్తొచ్చి తిరిగి వస్తుంది. అలా దినమంతా పువ్వుచుట్టూ తిరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడూ మనసు చెదిరినా, తిరిగి వచ్చినట్టు భక్తుడుకూడా ఎన్ని పనులున్నా, కొన్నిసార్లు ధ్యాస వేరే వాటిపైకి పోయినా కూడా గుర్తు తెచ్చుకుంటూ శివుని పాదాలచుట్టూ ధ్యానంలో తిరిగుతూ ఉంటాడు. "భజమనః శివమేవ నిరంతరం" అని మనస్సెపూడూ శివున్నే తలచు కుంటూ ఉంటుంది. 
"ధ్యానే భవానీపతే సాయుజ్యం" అన్నట్టు, ఇక్కడ తత్ అయిన శివుడిని అనునిత్యం ధ్యానంలో అనుభవించే మయ (అంటే తానైన భక్తుడు), ఆ శివునిలోనే చేరిపోయి శివసాయుజ్యం పొందుతాడు. ఇదే "లింగైక్య స్థితి". వీరశైవులు లింగైక్యం పొందటం అంటే ఇలాంటి స్థితిలో ఉండటం.  
ఈ లింగైక్య స్థితిని చూపు, వినికిడి, పలుకు, మనస్సు ఎలా అనుభవిస్తాయో విడివిడిగా వివరించారు బసవన్న.    

మరి ఆ స్థితికి ఎలా చేరుకుంటారు అంటే - చూపులో శివున్ని ఉంచడానికి ఇష్ట లింగాన్ని, వినికిడిలో శివున్ని ప్రేరేపించడానికి గురుజంగమల బోధలను, పలుకు స్వచ్చత కోసం తీర్థ ప్రసాదాలను, మనస్సు-ధ్యానం కోసం మంత్రాన్ని మొత్తంగా మనిషిని శివునిగా మార్చడం కోసమే అష్టావరణాలను (గురులింగజంగమభస్మపాదోదకప్రసాదమంత్రరుద్రాక్షలను) ఏర్పాటు చేసారని నా అభిప్రాయము. కాబట్టి ఎత్తి పరిస్తితుల్లోను వీటిని వీడవద్దని ప్రార్థన.

శరణు శరణార్థి!!
  











Sunday, June 14, 2015

24. Ivanaarava Ivanaarava - Basavanna

కన్నడ వచనం 

ಇವನಾರವ ಇವನಾರವ ಇವನಾರವನೆಂದು ಎನಿಸದಿರಯ್ಯ. 
ಇವ ನಮ್ಮವ ಇವ ನಮ್ಮವ, ಇವ ನಮ್ಮವನೆಂದು ಎನಿಸಯ್ಯ. 
ಕೂಡಲ ಸಂಗಮದೇವಾ ನಿಮ್ಮ ಮನೆಯ ಮಗನೆಂದು ಎನಿಸಯ್ಯ.

తెలుగు లిపిలో 

ఇవనారవ? ఇవనారవ? ఇవనారవనెందు ఎనిసదిరయ్య 
ఇవ నమ్మవ,  ఇవ నమ్మవ,  ఇవ నమ్మవనెందు ఎనిసయ్య 
కూడల సంగమ దేవా నిమ్మ మానెయ మగనెందు ఎనిసయ్య!

తెలుగు వచనం 

ఇతనెవరో? ఇతనెవరో? ఇతనెవరోయని తలపింపకుమయ్య 
ఇతను మావాడే, ఇతను మావాడే, ఇతను మావాడేయని తలపింపుమయ్య 
కూడల సంగమదేవా, మీ ఇంటి పుత్రుడని తలపింపుమయ్య!

వచన కర్త ఆంతర్యం 
నా మనస్సులో పరులనే భావన కలుగకుండు గాక. అందరూ నావారే, శివుని సంతానమనే నెనుపు ఎల్లపుడు ఉండబడుగాక!

విశ్లేషణ
చిన్న వచనమైనా, చాలా గంభీరమైన విషయాన్ని ప్రతిపాదించే వచనమిది. 

"మనము" అన్న భావన మరచి "నేను" అనే స్వార్థం పెరుగుతున్న నేటి సమాజానికి ఈ వచనం చాలా అవసరమని నా అభిప్రాయము.  ఒక తరం క్రితం నుండి ఉమ్మడి కుటుంబాలు పోయి, చిన్న కుటుంబాలు వచ్చాయి - నేను, నా భార్యాపిల్లలు అని. ఈ తరంలో చిన్న కుటుంబ వ్యవస్థ కూడా  బీటలు వారుతుంది; నేను మాత్రమే మిగులుతోంది. ఇలాంటి సందర్భంలో ఈ వచనం చాలా దూరం ఆలోచింపజేస్తుంది.

మన మనస్సు ఎలా పనిచేస్తుందని కొంచెం పరిశీలిస్తే - ఎవరినైనా చూడగానే మనస్సు మొదటగా ప్రశ్నించుకుంటుంది. 'వీరు నావారా?' లేదా 'ఈ జీవి నాకు సంబందించిందా కాదా?' అని.  ఆ ప్రశ్నకి సమాధానం ప్రకారం ఇష్టాయిష్టాలను, వారితో ప్రవర్తించే స్వభావాన్ని మనసు నిర్ణయించుకుంటుంది. తనవారనిపిస్తే వారిని కులుపుకుపోయే విధంగా, తనవారు కారనిపిస్తే వెంటనే స్వార్థ పూరితమైన నిర్ణయాలు చేస్తుంది.  అంటే ఇతరులతో మన వ్యవహారమంతా మనకు తెలియకుండానే మనస్సు యొక్క "నా వారా, లేక పరులా?" అనే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఇది ప్రతీక్షణం లోలోన జరిగే వ్యవహారం. కానీ పరిణామాలు మాత్రం తీవ్రం. ఉదాహరణకు ఇంటికి వస్తున్నారు, ఒక పదేళ్ళ కుర్రాడు-బిచ్చగాడు వాహనం నిలిచిన చోటికి వచ్చాడు. కాళ్ళకి చెప్పులు లేవు ఎండలో అలానే నడుస్తున్నాడు. మీకు చూసి జాలేసింది. ఒక పది రూపాయలు ఇచ్చారు. ఇంటికొచ్చిన తరువాత పదేళ్ళ మీ స్వంత కొడుకు, రాయి తగిలి చెప్పు తెగింది. కాలికి చిన్న గాయమైంది. వెంటనే దుకాణానికి తెసుకుపోయి రెండువందల రూపాయలతో క్రొత్త చెప్పుల జతకొన్నారు. అంటే తనవాడని అనిపించినందుకు మీ పుత్రునికి కొత్త చెప్పులజత. తనవాడు కాడనిపించినందువల్ల ఇంకో కుర్రానికి పది రూపాయలు. ఇలా ఉంటుంది మనసు నిర్ణయం. తప్పని కాదు; కాని అలా ఆలోచిస్తుంది అని చెప్పడం.     

ఇక్కడ బసవన్న కోరుకుంటున్నది అలాంటి అనునిత్యం సాగే కీలకమైన నిర్ణయాన్ని మార్చమని, ఎవరిని చూసినా "తనవార"ని మనసు తలవాలని. అంటే అందరూ తనవారైతే, అందరూ ఆ పరమేశ్వరుని సంతానమని సతతం తలిస్తే, మనకు వారిపట్ల వ్యవహరించే ధృక్పదం సంపూర్ణంగా మారి స్వార్థం నశిస్తుంది అని. అందరూ శివుని వారమే, మనదంతా ఒకే కుటుంబం, శివభక్తులంతా నా బంధువులే, పరులెవ్వరూ లేరు, అనే భావనే ఏంతో ధైర్యాన్నిస్తుంది. నేను అనే భావన తగ్గి మనము అనే భావన పెరగుతుంది. ఇలా అందరూ ఆలోచిస్తే పరస్పరం సహకరించు కుంటూ వసుధైకకుటుంబమే ఏర్పడదా? 

మతాచ పార్వతీదేవి, పితా దేవో మహేశ్వరః 
భాందవం శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం॥ 

అన్న శ్లోకంలో ఉండే తాత్పర్యాన్నే ఇక్కడ బసవన్న మనకి మనోనిర్ణయాలతో జతజేసి చెప్పారు. 

అయితే ఇంకొరరికి భోదించడం కాకుండా ఎవరికి వారు తమ మనస్సుని చక్కబరచుకోవడం ఇక్కడ ప్రతిపాదన. చెప్పడమే కాదు బసవన్న అలా వ్యవహరించారు కూడా. చౌర్యానికి దొంగలు ఇంటికి వస్తే, వారిని సైనికులు పట్టుకున్నా కూడా వారికి కావలసినవి తీసిచ్చి వారిని మార్చారు బసవన్న. 

లోకంలో అందరూ ఆత్మ పరిశీలన చేసుకుంటూ తమ ప్రవర్తనను మార్చుకుంటే, ఈ మూడు భువనాలలో అందరూ మన చుట్టాలే!!
  
శరణు శరణార్థి!!
  

Saturday, June 6, 2015

23. Kumbalakayege Kabuunada Katta Kottade - Basavanna


కన్నడ వచనం 
ಕುಂಬಳಕಾಯಿಗೆ ಕಬ್ಬುನದ ಕಟ್ಟ ಕೊಟ್ಟಡೆ
ಕೊಳೆವುದಲ್ಲದೆ ಬಲುಹಾಗಬಲ್ಲುದೆ
ಅಳಿಮನದಂಗೆ ಶಿವ ದೀಕ್ಷೆಯ ಕೊಟ್ಟಡೆ
ಭಕ್ತಿಯಂತಹುದು? ಮುನ್ನಿನಂತೆ!
ಕೂಡಲ ಸಂಗಯ್ಯಾ,
ಮನಹೀನನ ಮೀಸಲ ಕಾಯ್ದಿರಿಸಿದಂತೆ!

తెలుగు లిపిలో 
కుంబళకాయిగె కబ్బునద కట్ట కొట్టడె 
కొళెవుదల్లదె బలుహాగబల్లుదె 
అళిమనదంగె శివ దీక్షెయ కొట్టడె 
భక్తియంతహుదు? మున్నినంతె
కూడల సంగయ్య, మనహీనన మీసల కాయ్దిరిసిదంతె!   

తెలుగు వచనం 
గుమ్మడికాయకు ఇనప కట్ట కట్టిన
కుళ్ళకమానునే? బలమిపొందదుగదా?   
బలహీన మనునికి శివదీక్షనిచ్చిన 
భక్తియెట్లగును మునుపటివలె?
కూడలసంగయ్య, మనహీనుని నైవేద్యమునకు కాపుంచినట్లు!

వచనకర్త ఆంతర్యం 
శివదీక్ష అర్హత లేనివారికి ఇచ్చినా ఫలించదు! మనస్సులో శివభక్తిలేనివారికి శివదీక్షవల్ల  ఉపయోగముండదు. 

విశ్లేషణ 
గురువు దీక్ష ఇచ్చేముందు భక్తుణ్ణి పరికించి ఇవ్వాలన్నది ఇక్కడ ప్రస్తావన. 

వీరశైవమనేది ప్రయత్నపూర్వకంగా తపించి భక్తితో తీసుకోవలసిన శివదీక్ష. ఇతరులను మతమార్పిడి చేయడానికి చేసే తంతు కాదు. ఈనాడు కొన్ని మతాలవారు తమ బలగం పెంచుకోవడానికి ఇతరులని తమ మతంలో కలుపుకుంటున్నారు. వాళ్ళ మార్పిడివల్ల  జీవుడు ఉద్దరింపబడే అవకాశంలేదు; కేవలం స్వార్థ ప్రయోజనాలు మాత్రమే. ఇక మిగిలిన వారిలో చాలా మంది మతం పేరుతో సభలు, సమావేశాలు, రాజకీయాలు చేస్తారు కాని తనలోని జీవున్ని ఉద్దరించుకొనే ప్రయత్నం చేయడం గాని,  దీక్షలో నిలబడే వారు గాని చాలా తక్కువ. వాళ్ల ప్రయోజనం కేవలం ఒక సంఘానికి అధ్యక్షునిగానో, ఉపాధ్యక్షుని గానో పదవిని పొందడం, దానివల్ల ప్రయోజనాలేమైనా ఉంటే అనుభవించడం. ఇది భక్తి అనబడదు. 

వీరశైవదీక్ష జీవున్ని జననమరణచక్రమునుంచి ముక్తున్ని గావించి, మనిషిని శివునిగా మార్చే సర్వోత్క్రష్ట దీక్ష. ముక్తి కోసం కొందరు సన్యాసం తీసుకొని సంసారానికి, సంసారులకు దూరంగా ఉంటారు. కొందరు కాశిలో మరణించాలంటారు. కొందరు అరుణాచలం దర్శించాలంటారు. ఇలా సనాతన ధర్మంలో ఎన్నో మార్గాలను సూచించినా, ఉన్నచోటే ఉంటూ, నిత్య జీవనాన్ని గడుపుతూ, లింగాంగ సామరస్యమువల్ల  శివైక్యము, జీవన్ముక్తి  కలిగించగలిగే ఒకేఒక్క దీక్ష వీరశైవదీక్ష - ఇలాంటిది లోకంలో ఇంకొక్కటి లేదు.   

అయితే చిత్తచాంచల్యము గలవారు ఈ దీక్షలో నిలబడడం కష్టం. దీనర్థం 'మాతో కాదులే' అని వదిలి పెట్టుకోమని కాదు. దీక్షలోకి దిగే ముందు కొన్ని మౌళిక విషయాలను గ్రహించి అనుసరించడానికి సిద్దపడాలి. ఇది ఎంత సులువైనదైనా కూడా నిత్యసాధన, ఆచారపాలన, అన్నింటిని మించి శివభక్తి మూలముగా గలది.  భక్తిలేని వానికి దీక్ష ఎంత గొప్పదైనా దండగే. ఉదాహరణకి ఒక చిన్న పాపకి తను ఏంతో కాలం అడగగా, అడగగా ఒక చిలుక బొమ్మ కొనిచ్కామనుకోండి. ఆ బొమ్మని ఎంత ప్రేమగా చూసుకుంటుంది? ఎక్కడికి వెళ్ళినా ఆ బొమ్మ తనతో పాటే. తింటున్నపుడు బొమ్మ ప్రక్కనే ఉండాలి. దానికీ తినిపిస్తుంది. రాత్రి పడుకునేటప్పుడు కూడా పట్టుకొని పడుకుంటుంది. మధ్యలో నిద్ర లేస్తే అది కనబడాలి - లేకపోతే ఏడుపు. ఆ పాప ఉద్దేశ్యంలో అది బొమ్మ కాదు, చిలుకే. ఒక వీరశైవునికి శివుని గురించిన తపన ఇదే విధంగా ఉంటుంది. వీరశైవునికి ఇష్టలింగము ఒక వస్తువు కాదు, శివుడే. అలాంటి  భక్తి ఉన్న వానికి శివదీక్ష ఒప్పుతుంది. భక్తిలో ఉన్న వానికి లింగాధారణ వల్ల అది రెట్టింపవుతుంది. ఆ పాపలా తన దీక్షలో తన్మయముచెంది శివానందంలో మునిగి తేలుతూ తద్వారా శివైక్యాన్ని పొందుతాడు.  

ఇక బలహీన మనస్సు గలవానికి, కేవలం విషయ వాంఛలు (లౌకిక సుఖాల మీది ఆశ) కలవానికి, భక్తి కరువైనవానికి, ఈ ఆచారాలు, పూజాది కర్మలు తంతులుగా మారతాయి. ఇతరులకు తమ డంబచారం చూపించ వచ్చునేమో గాని అది భక్తిగాదు, శివైక్యము పొందనేరడు. ఇటువంటి వారికి లింగాధారణ చేయడంవల్ల  ప్రయోజనం ఉండదని బసవన్న ప్రస్తావన. గుమ్మడి కాయకు ఇనప కంచె (frame) కట్టిన ఉపయోగమేమిటి- అది కుళ్ళకుండా ఉంటుందా? మంచి రుచికరమైన నైవేద్యం వండి, బలహీన మనస్కున్ని కాపలాగా పెడితే తట్టుకోగలడా? 

శరణు శరణార్థి!!