Saturday, April 25, 2015

20. Asattenalasidenendare Manadu & 21. Suka Bandade Punyada Phalavennanu - Basavanna

కన్నడ వచనం 

ಆಸತ್ತೆನಲಸಿದೆನೆಂದರೆ ಮಾಣದು,
ಬೇಸತ್ತೆ ಬೆಂಬಿದ್ದೆನೆಂದರೆ ಮಾಣದು,
ಏವೆನೇವೆನೆಂದರೆ ಮಾಣದು
ಕಾಯದ ಕರ್ಮದ ಫಲಭೋಗವು
ಕೂಡಲಸಂಗನ ಶರಣರು ಬಂದು
"ಹೋ ಹೋ ಅಂಜದಿರಂಜದಿರು" ಎಂದರಾನು ಬದುಕುವೆನು


తెలుగు లిపిలో 

ఆసత్తెనలసిదెనెందరె మాణదు 
బేసత్తె బెంబిద్దెనెందరె మాణదు
ఏవెనేవెనెందరె మాణదు
కాయద కర్మద ఫలభోగవు కూడలసంగమ శరణరు బందు  
"హో హో అంజదిరంజదిరు" ఎందరాను బదుకువెను 

తెలుగు వచనం 

అలసిసొలసితినన్న మానదు 
వేగి వేడుకొందునన్న మానదు
ఏంచేతునేంచేతునన్న మానదు
కాయపు కర్మపు ఫలభోగము కూడలసంగముని శరణులు వచ్చి 
"హో హో భయపడకుభయపడకు"మన్న నేను బతికెదను 

వచన కర్త ఆంతర్యం  

కర్మానుభవములు తప్పించుకోవలెనన్న నాకు స్వయంగా సాధ్యంకాదు. శరణుల సాంగత్యము  వారి అభయ వాక్యములు అవసరము. 


కన్నడ వచనం 
ಸುಖ ಬಂದಡೆ ಪುಣ್ಯದ ಫಲವೆನ್ನೆನು
ದುಃಖ ಬಂದಡೆ ಪಾಪದ ಫಲವೆನ್ನೆನು
ನೀ ಮಾಡಿದಡಾಯಿತ್ತೆಂದೆನ್ನೆನು
ಕರ್ಮಕ್ಕೆ ಕರ್ತುವೇ ಕಡೆ ಎಂದೆನ್ನೆನು
ಉದಾಸೀನವಿಡಿದು ಶರಣೆನ್ನೆನು
ಕೂಡಲಸಂಗಮದೇವ ನೀ ಮಾಡಿದುಪದೇಶವು ಎನಗೀ ಪರಿಯಲ್ಲಿ
ಸಂಸಾರ ಸವೆಯೆ ಬಳಸುವೆನು


తెలుగు లిపిలో 

సుఖ బందడె పుణ్యద ఫలవెన్నెను, 
దుఃఖ బందడె పాపద ఫలవెన్నెను
నీ మాడిదడాయిత్తెందెన్నెను, 
కర్మక్కె కర్తువే కడె ఎందెన్నెను  
ఉదాసీనవిడిదు శరణెన్నెను 
కూడలసంగమదేవ నీ మాడిదుపదేశవు ఎనగీ పరియల్లి 
సంసార సవెయె బళసువెను  

తెలుగు వచనం 
సుఖమోచ్చిన పుణ్యపు ఫలమని యెన్నను 
దుఃఖమొచ్చిన పాపపు ఫలమని యెన్నను 
నీ చేతలవల్లే  కలిగినవన్నయెన్నను 
కర్మకు కర్తయే కారణమన్నయెన్నను 
ఉదాసీనమునువిడిచి శరణనను  
కూడలసంగమ దేవ నీ ఉపదేశము నాకీవిధముగ 
సంసారము తృంచుటకు మలిచితిని   

వచన కర్త ఆంతర్యం  
సంసార చక్రమునుండి బయటపడవలె నన్న, సుఖ దుఃఖములను పాపపుణ్యఫల హేతువులుగా కాక సమంగా స్వీకరిస్తాను. నా కర్మల గొప్పదనం వల్ల సుఖములు కలిగాయని గర్వపడను. నా పాపముల వల్ల  దుఃఖము కలిగినదని అధైర్యపడను. నాచేతిలో ఏముందని నిరుత్సాహపడను. కర్మలన్నింటికి నా ప్రారబ్దమే కారణము, వాటినుండి తప్పించుకొను ఉపాయము లేదని నీ పై నమ్మకము విడువను.  ధైర్యాన్ని విడిచి ఓటమిని ఒప్పుకోను. నీవు చేసిన ఉపదేశము ఈ కర్మలంపటముతో నిండిన సంసారమును తెంచుటకు వాడుతాను. 

Saturday, April 18, 2015

19. Devaloka Martyaloka Berilla Kaniro! - Basavanna

కన్నడ వచనం 
ದೇವಲೋಕ ಮರ್ತ್ಯಲೋಕವೆಂಬುದು ಬೇರಿಲ್ಲ ಕಾಣಿರೋ ! 
ಸತ್ಯವ ನುಡಿವಿದೇ ದೇವಲೋಕ, ಮಿಥ್ಯವ ನುಡಿವುದೇ ಮರ್ತ್ಯಲೋಕ. 
ಆಚಾರವೇ ಸ್ವರ್ಗ, ಅನಾಚಾರವೇ ನರಕ. 
ಕೂಡಲಸಂಗಮದೇವಾ, ನೀವೆ ಪ್ರಮಾಣ.

తెలుగు లిపిలో 
దేవలోక మర్త్యలోకవెంబుదు బేరిల్ల కాణిరో!
సత్యవ నుడివుదే దేవలోక, మిథ్యవ నుడివుదే మర్త్యలోక 
ఆచారవే స్వర్గ, అనాచారవే నరక 
కూడలసంగమదేవా, నీవే ప్రమాణ!

తెలుగు వచనం 
దేవలోకము మర్త్యలోకములనునవి వెరెక్కడలేవు చూడరో!
సత్యము పలుకుటే దేవలోకము, మిథ్యము పలుకుటే మర్త్యలోకము 
ఆచారమే స్వర్గము, అనాచారమే నరకము 
కూడలసంగమ దేవా, నీవే ప్రమాణము!

వచనకర్త ఆంతర్యము 
అసత్యము, అన్యాయములు ఉండు చోట నరకము ఉంటుంది. వేరే వెతకక్కరలేదు.

విశ్లేషణ 

మనిషి తన ప్రవర్తన ద్వారా తన పరిసరాలను స్వర్గంగానో, నరకంగానో మార్చుకోగలడని బసవన్న ఉవాచ. 

దేవలోకంలో దేవతలు ఉంటారని, మర్త్యలోకంలో మానవులు ఉంటారని, పుణ్యములు చేస్తే స్వర్గానికి వెళ్తామని, పాపములు చేస్తే నరకమునకు వెళతామని నమ్ముతాము. స్వర్గంలో అంతా  సుఖమే. నరకంలో సూదులతో పొడుస్తారు, పురుగులతో, పాములతో కరిపిస్తారు, నూనెలో దేవుతారు వగైరా. కర్మకాండలను ఆచరించే వారైతే స్వర్గప్రాప్తికై తపనతో యజ్ఞయాగాదులు నిర్వహిస్తుంటారు. నూరు యజ్ఞములకు యజమాని అయినవాడు ఇంద్రపదవిని పొందుతాడని అంటారు. కేవలం పరలోక సుఖముల కోసం ఇలాంటి కర్మలను చేసేవారు చాలామంది ఉంటారు. అయితే ఈ కర్మలలో మునిగి, ఈనాటి పరిస్థితులను విస్మరిస్తూ ఉంటారు. ఇక కొన్ని మతాలవారైతే చచ్చింతరువాత వారికి లభించే సుఖాలను ఆశించి, అపోహతో ఇక్కడ తీవ్రవాదాన్ని, మారణ హోమాన్ని సృష్టిస్తున్నారు. దేవలోకమనేది చచ్చిన తరువాత చూసేది కాదు ఇక్కడే సృష్టించవచ్చు అంటున్నారు బసవన్న.  

ఈనాటి సమాజంలో ఏ సమస్యలను పరిశీలించినా అసత్యము, మోసములు స్వార్థముతో కూడడంవల్ల కల్గుతున్నయనడంలో సందేహం లేదు. ఇవి చిన్న చిన్న అవినీతితో మొదలుకొని పెద్ద కుంభకోణాలు, కుట్రలు వరకు రకరకాల రూపాలలో ఉంటాయి. వీటికి జాతి మతములతో ప్రమేయం లేదు. అందరూ భాగస్వాములే. చేసేవి చిన్న చిన్న తప్పులైనా అన్నీ కలసిననాడు వాటి ప్రభావం సంఘటితంగా చాలా పెద్దదై నరకప్రాయమే అవుతుంది.  ఉదాహరణకు స్వార్థంతో నియమాలను అతిక్రమించి కట్టడాలకు అనుమతులు ఇచ్చేస్తారు. నీరు సరిపోతుందో లేదో ఆలోచించకుండా అనుమతులు. రహదారులు వేయడంలో మోసంతో పద్దతులను అతిక్రమించి వేస్తారు. అనుమతులు ఉల్లంఘించి చేసే చిన్న చిన్న తప్పులు ఇంకొన్ని.  దాంతో దారుల్లో రద్దీ పెరిగి నడవడానికి కూడా వీలులేనంత నరకప్రాయమైపోతాయి, కావలసిన నీరు లేక, పరిశుభ్రత లోపించి, కాలుష్యం పెరిగి, రోగాలు వంటివాటితో స్వర్గంలా ఉండవలసిన నగరాలు, నరకాలవుతాయి. అంటే నరకాన్ని మనం చుట్టూ సృష్టించుకున్నామా లేదా? అదే విధంగా అసత్యము, మోసము పాళ్ళు తక్కువ ఉండే చోట ఇలాంటి సమస్యలు లేక స్వర్గంలా ఉండే నగరులను కూడా చూస్తున్నాము. అంటే మన ప్రవర్తన, నియమావళిని బట్టి పరిసరాలు మారిపోతాయి.

ఇంకో ఉదాహరణ. ప్రయాణంలో ఉన్నాము. ఆకలేస్తోంది. చూసిచూసి మంచి శుభ్రంగా కనబడే చోట ఆగాము. మంచి పరిసరాలు. ప్రక్కన్నే ఒక కొలను. చల్లనిగాలి, పచ్చని చెట్ల సువాసన. పిల్లలకు బాగా నచ్చింది. చక్కగా గడ్డిలో దొర్లి మరీ ఆడుకున్నారు. దుప్పటి పరచి కూర్చొని తిన్నాము. మిగిలిపోయిన పొట్లాలను, తిను పదార్థాలను అక్కడే పారేసి వెళ్ళిపోయాము. మరి మనపని అయిపోయింది కదా! అలానే ఇంకొంతమంది చేసుంటారు ఆరోజు! మరునాడు తిరుగు ప్రయాణంలో అక్కడే ఆగాలని చూసాము. ఈసారి చక్కగా ఉన్నచోట ఇప్పుడు కుక్కలు చేరాయి. కుళ్ళిపోయిన వాసన. తిని పారేసిన ప్లాస్టిక్ కాగితాలు, పేపరు గిన్నలు. ఎక్కడ చూసినా చీమలు కుడుతున్నాయి. పిల్లలు ఏడుస్తున్నారు. దోమలు, పురుగులు, వాటిని తినడానికి వచ్చిన పామొకటి కనబడింది. ఛఛ..  అంటూ వెళ్ళిపోయాము. 
ఒకే చోటు నిన్న స్వర్గమైతే, ఈరోజు నరకమైంది. అలా మార్చింది ఎవరో కాదు మన ప్రవర్తన.  

అంతే గాదు. అసత్యాన్ని చాలా తేలికగా తీసుకోవడం అలవాటైపాయింది. చాలా మందికి తప్పనిపించడం లేదు.  ఈనాడు సంకేతిక విద్యను, విజ్ఞానాన్నికూడా దురుపయోగపరచి అసత్యాలను ప్రసారంచేస్తున్నారు. హనుమంతుని గద దొరికిందని, ఘటోత్కచుని కళేబరం దొరికిందని రకరకాల అసత్యాలను చిత్ర వక్రీకరణతో (morphing) సృష్టించి తామేదో మతావిశ్వాసాలకు పాటుపడుతున్నట్లు భావిస్తారు. అసత్యంవల్ల కేవలం దుష్ప్రయోజనమే  ఉంటుందని గ్రహించాలి; అసత్యంవల్ల రాబోయే తరాలవారికి ఇంకా నమ్మకాలు తగ్గుతాయి - ఉన్న నమ్మకలను కూడా పాడు చేస్తారు.  

ఇక రెండవది ఆచారము. మంచి నడవడిక నేర్పేది ఆచారం. ఆచారంవల్ల మనకేగాక చుట్టూ ఉండే వారికి కూడా ఇబ్బందులు కలగకుండా ఉంటుంది.  "ఆచార హీనః పురుషౌ, లోకే భవతి నిందితః" - ఆచారము పాటించని వారు లోకంలో నిందకు గురవుతారు అని అన్నారు.  ఉదాహరణకు ప్రొద్దున్నే లేచి, దంతాలను శుభ్రపరచుకొని స్నానం చేయడం ఆచారం. బడికి వెళ్ళినా, పనికి వెళ్ళినా శుభ్రంగా వెళ్ళడం ఆచారం. అలా కాకుండా నిద్రలేచి ముఖం కూడా కడుక్కోకుండా వెళితే, వాళ్ళ పక్కన కూర్చునే వారు ఇబ్బంది పడతారు. అప్పుడు అక్కడే నరకమౌతుంది. 

ఆచారాలు రకరకాలుగా ఉంటాయి. తినేముందు, తిన్న తరువాత చేయి కడుక్కోవడం, ఇంట్లో చెప్పులు వేసుకోకపోవడం, గుడిలోకి వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కోవడం వంటి సామాన్య ఆచారాలు అందరూ పాటిస్తారు. తమ విశ్వాసాలను బట్టి ధర్మపరమైన ఆచారాలు ఇంకో రకం. లింగాచార, సదాచార, శివాచార, గణాచార, భృత్యాచారములనే పంచాచారములను వీరశైవులు పాటిస్తారు.  వీటిని విస్తృతంగా తెలుసుకుంటే మనము నిత్యమూ ఆచరించే నిత్య లింగార్చన, సత్ప్రవర్తన, కష్టపడి సంపాదించడం, వంచనకు దూరంగా ఉండడం, అభక్ష్య భక్షణాలకు (అంటే మాంసము వంటివి), అపేయ పానాలకు (అంటే మద్యము వంటివి) దూరంగా ఉండడం, మంచి వారితో- శివశరణులతో స్నేహం, భక్తులను నిత్యం సేవించుకోవడం మొదలైన లక్షణాలు ఉంటాయి. కొన్ని మాత్రమే ఇక్కడ ఉదాహరించాను. వీటివల్ల తమధర్మపాలనే కాకుండా సమాజంలో సమతుల్యత, కీర్తి కలుగుతాయి. అదే బసవన్న చెప్పే"ఆచారమే  స్వర్గం" అంటే . 
ఆచారములను మరచి చరించే వారు, కావాలని వాటిని అతిక్రమించే వారు తమ జీవితంలోనే కష్టాలు తెచ్చుకుంటారు. సమాజంలోనూ  సమతుల్యం చెడుపుతారు. ఉదాహరణకు మద్యానికి దూరంగా ఉండటం సదాచారాలలో ఒకటి. కొందరు ఈ దురలవాటును ఈ మధ్య నేర్చుకుంటున్నారు. ముందు ఇటువంటి వాటివల్ల తమ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటారు. పైగా తప్పని ఒప్పుకోరు - ఆ దేశంలోనోఅధ్యయనం చేసారంట రోజు త్రాగితే ఆరోగ్యకరమని. ఈ ధర్మాతిక్రమణకు ఏవో కుంటిసాకులు చెబుతారు. ఇంట్లో వాతావరణం చెడగొడతారు.  భావి తరాలైన తమపిల్లలకు ఈ చెడు అలవాట్లను వాళ్ళకి తెలియకుండానే నేర్పుతారు. ఉపాసనకు దూరమై భ్రష్టులవుతారు - తమ చుట్టూ ఉండే వారిని కూడా భ్రష్టులను చేస్తారు.  వారికి ఇక శివసాయుజ్యము, శివజ్ఞానము వంటివి ఎక్కడినుండి కల్గుతాయి? ఎలా అర్థమవుతాయి? ఇదే బసవన్న చెప్పే "అనాచారమే నరకం" అంటే

అయితే ఇలాంటి తప్పొప్పులకు  ప్రమాణం ఎవరు? ప్రతీ విషయాన్నీ ప్రభుత్వమో, రక్షణ వ్యవస్థో, లేక పక్కనున్న  వారో నిత్యం పరిశీలిస్తూ చెప్పడం కుదరదు. మనలో ఉంటూ మనకి నిత్యం ఇది తప్పు అని చెబుతూ అంతరంగంలో ఉండే ఆ కూడల సంగమేశ్వరుడు హెచ్చరిస్తూ ఉంటాడు. కనుక అతడే ప్రమాణము!   




Saturday, April 11, 2015

18. Neera Kandalli Muluguvarayya - Basavanna

కన్నడ వచనం 

ನೀರ ಕಂಡಲ್ಲಿ ಮುಳುಗುವರಯ್ಯ!
ಮರನ ಕಂಡಲ್ಲಿ ಸುತ್ತುವರಯ್ಯ!
ಬತ್ತುವ ಜಲವನೊಣಗುವ ಮರನ
ಮೆಚ್ಚಿದವರು ನಿಮ್ಮನೆತ್ತ ಬಲ್ಲರು
ಕೂಡಲಸಂಗಮದೇವ



తెలుగు లిపిలో 

నీర కండల్లి ముళుగువరయ్య!
మరన కండల్లి సుత్తువరయ్య!
బత్తువ జలవనూణగువ మరన  
మెచ్చిదవరు నిమ్మనెత్త బల్లరు
కూడలసంగమ దేవ 

తెలుగు వచనం 

నీరు కనబడిన మునిగెదరయ్య! 
చెట్టు కనబడిన చుట్టెదరయ్య !
ఎండెడు జలమును, వాడెడు చెట్లను మెచ్చువారు, 
మిమ్ములనెట్లుజొచ్చెదరు  కూడలసంగమదేవ?

వచనకర్త ఆంతర్యం 
తరిగే అశాశ్వత వస్తువులపై నమ్మకముంచి, శాశ్వతుడైన పరమేశ్వరుని మరిచెడివారు ఆ శివున్ని చేరలేరు, తెలుసుకోలేరు.   

విశ్లేషణ 

వీరశైవధర్మము శివభక్తిని ఎంత గట్టిగా ప్రోత్సహించిందో అంటే గట్టిగా మూఢవిశ్వాసాలను నిరసించింది. యుగయుగాలలో పంచాచార్యులచే ప్రతీష్టింపబడి, పన్నెండవ శతాబ్దిలో బసవన్నచే పునర్వ్యవస్తీపరింపబడిన వీరశైవధర్మము మూఢవిశ్వాసాలను ఏనాడో ఖండించింది. కానీ మానసిక దౌర్బల్యాలవల్ల మనం ఇప్పటికీ కొన్ని పిచ్చినమ్మకాలను దూరం చేసుకోలేక పోతున్నాము. వీరశైవధర్మమును సరిగ్గా అర్థం చేసుకుంటే ఈనాటికి కూడా ఎంత ప్రగతిశీలదాయకమైనదో తెలుస్తుంది. ఒకవైపు భక్తిమార్గాన్ని ఆత్మజ్ఞానాన్ని నేర్పుతూ, ఇంకోవైపు మూఢవిశ్వాసాలతో జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా చూసుకునే ఉత్కృష్ట ధర్మమిది. హైందవ ధర్మములన్నింటిలో తలమాణికము.    

వీరశైవునికి భక్తి అనేది శాశ్వతుడు, నిత్యుడు, సర్వకారణుడు అయిన శివునిపై ఉంచుతారు; అల్ప ప్రయోజనాలను కలిగించే ఇతర వస్తువులపై, ఇతర దేవతలపై కాదు. శివదీక్షను పొందిన వారు ఇతర నమ్మకాలన్ని విడిచి కేవలం శివున్నే ఆశ్రయించాలి. తమ సంపూర్ణ నమ్మకాన్ని కేవలం శివభక్తిపై, గురుణాదత్తమైన ఇష్టలింగార్చనపైన మాత్రమే ఉంచాలి. ధరించిన శివలింగానికి పూజ మరిచి అల్పములైన వస్తువులపై నమ్మకములు, వంద గుళ్ళ చుట్టూ తిరిగినా, తీర్థాలలో మునిగినా, తమ స్వధర్మాన్ని విడిచి పరధర్మాన్ని ఆశ్రయించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.  

మనకు దీక్షాభంగము చేయడానికి సందుకో సన్యాసి దొరుకుతాడు. వాస్తు దోషాలని, గ్రహ దోషాలని, జాతక దోషాలని, దయ్యం పట్టిందని, రకరకాల కారణాలను చూపి భయపెడతారు. వాళ్ళు ధనాప్రయోజనాన్ని, పీడా విముక్తిని లేదా, ఇతర ప్రయోజనాలను చూపించి, ఏ చెట్టు చుట్టూ తిరగమనో, ఏ నదిలోనో, నీటిలో మునగమనో, ఏ తంత్ర పూజ చేయమనో, ఏ తాయత్తు ధరించమనో, ఏ జపం చేయమనో, ఏ రత్నం ధరించమనో ప్రోత్సహిస్తారు; చేయని పక్షంలో కలిగే నష్టాలను వివరిస్తూ భయపెడతారు. ఇలాంటివి ఆచరించడం ద్వారా కోరికలు, విషయవాంఛలు అల్పములైనవి తీరవచ్చునేమో! కానీ శివజ్ఞానం దూరమై వాటిచుట్టు తిరుగుతారు. సరైన గురువు సహాయం లేని వారు ఇలాంటి వాటికి  లోబడి నష్టపోతారు - ఆర్థికంగా కాదు, శివజ్ఞానపరంగా. ఇటువంటివి ఈ మధ్య మరీ ఎక్కువయ్యాయి. ఒక్కసారి దూరదర్శనాన్ని(TV) ప్రారంభిస్తే అందలో జ్ఞానసంబంధమైన విషయములకన్నా ఇటువంటి ముఢత్వాన్ని ప్రేరేపించే కార్యక్రమాలే ఎక్కువగా కనబడతాయి. అయితే కొందరు చదువుకున్న యువకులు కూడ ఇలాంటి మూఢవిశ్వాసాలకు దెగ్గరవుతున్నారు. మిగితావారు ధర్మమంటే  ఇలాంటి మూఢవిశ్వాసాలనే అపోహతో నాస్తికులై  భగవధ్భక్తి విశ్వాసాలకు దూరమవుతున్నారు.  ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేవారు భాగవత్భక్తి-శివజ్ఞానానికి, మూఢవిశ్వాసాలకు తేడా తెలియకుండా చేస్తారు. దానివల్ల అస్తికత్వమంటే ఇలాంటివి నమ్మడమని అపోహ కలిగుతుంది. దీనిని ఆసరాగా తీసుకొని నాస్తికులు కూడా చెలరేగిపోతారు - వారికి కూడ మూఢనమ్మకాలకు, భాగవత్భక్తికి మధ్య తేడా తెలియదు. ఇలా సగం తెలిసిన జ్ఞానంతో ఒకరితో ఒకరు వాదనలు -గందరగోళం!       

వీరశైవదీక్షలో ఉండే వారికి ఇటువంటి అన్యవిశ్వాసాలు నిషిద్ధము. కేవలం శివజ్ఞానము, శివసాయుజ్యములు మాత్రమే వారి లక్ష్యములు. నిత్య శివలింగార్చన చేసేవారిని, అష్టావరణములచేత సంరక్షిపబడేవారికి ఎటువంటి అంటూ, ముట్టు, గ్రహదోష, వాస్తుదోష, జాతకదోషములు అంటవు. ఇష్టలింగాన్ని అనునిత్యం ధరించిన వారిని, నిత్య శివమయులైన వారిని ఎటువంటి దోషములు అంటుకోవని వీరశైవ ధర్మము నొక్కి చెబుతోంది. అంతేగాక వీరశైవులు జ్యోతిష్యము, అపశకునాలు, రాహుకాలములు వంటివి పాటించరు. కాలకాలుడైన శివుని వారలము మనము; మనని కాలదోషములు ఏంచేస్తాయి? వీరశైవులకు భూత, పిశాచ బాధలు కూడా ఉండవు; సకల భూతనాథున్ని తమ హృదయంపై ధరించే వానిని ఏ భూతాలు పీడిస్తాయి? కాబట్టి వాళ్ళు వాటి ఉపశమన మార్గాల జోలికి కూడా వెళ్ళరు. జీవితం అందించే కష్టసుఖాలను సమంగా, శివ ప్రసాదములుగా భావించి స్వీకరిస్తారే తప్పవాటిని తప్పించుకోడానికి చిల్లర దైవాలకు, కర్మకాండలకు దూరంగా ఉంటారు.                 

చెట్లచుట్టు తిరగడం, నీళ్ళల్లో మునగడంవల్ల చిన్న ప్రయోజనాలు ఉండవచ్చుగాక! కాని అలాంటి  
వాటివల్ల కలిగే చిన్న ప్రయోజనాలను ఆశించి వాటిని ఆశ్రయించడం వంటివి వీరశైవము వ్యతిరేకిస్తుంది. గురు పాదోదకమును, ఇష్టలింగార్చన చేసిన ఉదకమును మించిన తీర్థము ఏ నదీ, ఏ తీర్థము అందించలేదు. ఇష్టలింగార్పితమైన నైవేద్యమును మించిన ప్రసాదము ఈ గుడిలోను దొరకదు. శివస్మరణతో ధరించిన భస్మాన్ని మించిన రక్షణ ఏ రత్నమో, రాయో, ఏ చెట్టో కలిగించలేదు. రుద్రాక్షను మించిన తాయత్తు ఏ జగములలోనూ లేదు. అన్నీ మన నిత్య ఆచారములైన అష్టవరణాలలో నిక్షిప్తమై ఉండగా ఇతరుల మాటలు విశ్వసించి మన ధర్మానికి దూరమవ్వడం అవివేకం కాదా? చిన్న ప్రయోజనాలను ఆశిస్తే చిన్న ప్రతిఫలములు లభించవచ్చునేమో! కాని శాశ్వత శివసాయుజ్యమనే మన లక్ష్యానికి దూరమవుతామని, అంటే శివున్ని తెలియజాలమని, ఇక్కడ బసవన్న చెబుతున్నారు. 


  

Friday, April 3, 2015

17. Madakeya Maduvade - Basavanna

కన్నడ వచనం 
ಮಡಕೆಯ ಮಾಡುವಡೆ ಮಣ್ಣೇ ಮೊದಲು,
ತೊಡಿಗೆಯ ಮಾಡುವಡೆ ಹೊನ್ನೇ ಮೊದಲು,
ಶಿವಪಥವನರಿವಡೆ ಗುರುಪಥವೇ ಮೊದಲು
ಕೂಡಲಸಂಗಮದೇವನರಿವಡೆ ಶರಣರ ಸಂಗವೇ ಮೊದಲು


తెలుగు లిపిలో 

మడకెయ మాడువడె మణ్ణే మొదలు
తొడిగెయ మాడువడె హొన్నే మొదలు 
శివపథవనరివడె గురుపథవే మొదలు 
కూడలసంగమదేవనరివడె శరణర సంగవే మొదలు 

తెలుగు వచనం 
మట్టికుండ చేయవలెనన్న మన్నే మొదలు 
పెట్టుతొడుగు చేయవలెనన్న స్వర్ణమే మొదలు 
శివపథము తెలియవలెనన్న గురుపథమే మొదలు 
కూడలసంగముదేవుని తెలియవలెనన్న శరణుల సంగమే మొదలు 

వచనకర్త ఆంతర్యం:
శివున్ని చేరవలెనన్న సద్గురుబోధ వల్ల, శివశరణుల సాంగత్యమువల్ల  మార్గము అవగతమవుతుంది. ఎలాగైతే వస్తువులు చేయటానికి ముడిపదార్థములు ఉంటాయో, శివ జ్ఞానము కలగడానికి గురువు, శరణులే ముడిపదార్థములు.   

విశ్లేషణ:
గురువు, శరణ సాంగత్యముల యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పే వచనమిది. 

గురు, లింగ, జంగమలను వీరశైవులకు ముఖ్యంగా ప్రతిపాదిస్తూ వాటిలో గురువుని మొదటి స్థానంలో ఉంచారు. "గురు సాక్షాత్పరబ్రహ్మ తస్మైస్రిగురవే నమః" అన్నట్టు, గురువు సాక్షాత్ పరశివబ్రహ్మమే.  ఒక తల్లి, తండ్రి పుత్రునికి  నడవడం ఎలా నేర్పిస్తారో, శిష్యునికి గురువు శివమార్గంలో నడవడం అంతే శ్రద్ధతో, ఉత్సాహంతో, జాగ్రత్తతో నేర్పిస్తాడు. బాలుడు నడుస్తూ క్రింద పడితే ఎత్తి మరీ మళ్లీ నడవడానికి ప్రోత్సహించినట్టు శివమార్గమ్లో కలిగే అంతరాయలను ఎప్పటికప్పుడు నివారిస్తూ చేయిపట్టుకు నిడిపించేవాడే గురువు. 

సంసారిక జీవితంలో ఉంటూనే ఆత్మజ్ఞానాన్ని, శివైక్యాన్ని సాధించే మార్గం వీరశైవులది. ఇతర మార్గాలవారు వర్ణాశ్రమ ధర్మము ప్రకారము వానప్రస్తము, సన్యాసములోగాని ఇలాంటి ఉపాసన చేయరు. వారికి సన్యాసాశ్రమము స్వీకరించేటప్పుడు అలాంటి దీక్షా ఇవ్వబడుతుంది. కానీ వీరశైవులు శివదీక్షను చిన్నతనంలోనే గురువు ద్వారా పొంది జీవితాంతం ఉపాసించవలసి ఉంటుంది. అందుకే ప్రతీ కుటుంబానికి గురువులను ఏర్పరచి గురుపరంపరను ప్రోత్సహించింది వీరశైవం. ప్రతీ  విషయములో గురువు సలహాను తీసుకోవాలని నిర్దేశించింది. అంటే దైనందిన జీవితంలో ఉంటూ శివదీక్షా మార్గాన్ని దారి తప్పకుండా చూసుకునే వాడు గురువు. అతనే మన మంచి చెడుల నిర్ణయించే సలహాదారు (consultant), జీవన మార్గనిర్దేశకుడు(guide), సమస్యలను తీర్చే మానసిక శాస్త్రవేత్త (psychiatrist). 

ఇలాంటి గురుపరంపర, గురుమార్గనిర్ధేశణ వంటి వాటిపై నమ్మకాలు తొలగినందువల్ల నేడు మన సమాజంలో కూడా రకరకాల కుటుంబ సమస్యలు, మానసిక ఇబ్బందులు మొదలయ్యాయని నా అభిప్రాయం. మనస్సు శివకార్య నిమగ్నమై, ప్రశాంత చిత్తంతోఉంటూ శివజ్ఞానానికి ఉదాహరణగా పొగడబడిన వీరశైవులు, ఈనాడు సాధారణ బాధలైన కుటుంబ కలహాలు, ఇతరులతో పేచీలు వంటి చిల్లర సమస్యలతో సతమతమవుతూ మంచి చెడుల విచక్షణ కోల్పోయి తమ పారమార్థిక ఉద్దేశ్యాన్ని మరచిపోతున్నారు. నిత్యం శివున్ని గురించి ఆలోచించే వారికి ఈ చిల్లర సమస్యలు పడతాయా? దైవచింతన నింపవలసిన మనస్సులో చింతలు, రాజకీయాలు, మాత్సర్యము నిండుతోంది. ఒక తరమువారు బయటి వాళ్లతో జగడాలు తెస్తే, ఇంకో తరంవాళ్ళు ఇంట్లోనే జగడాలతో ఆఖరుకి ఆలుమగల సంసారాలు కూడా పట్టుమని పది రోజులు నిలవటంలేదు. ఈ దుస్థితికి కారణం? తరాలుగాలేని ఈ సమస్యలు ఈమధ్య  ఎందుకు పెరిగిపోతున్నాయి? 
ఇక్కడ నా అభిప్రాయం ఎవరినీ ఉద్దేశించినది కాదు. కొంత కాలంగా కేవలం భుక్తికోసం, ధనార్జన కోసం చదువులు, అని నమ్మి, మిగితావన్ని నిరుపయోగమని తలచి అలానే తమ పిల్లలను పెంచడం ప్రారంభించాము. వాళ్ళకి చదువు చెప్పించడంపై చూపిన శ్రద్ధ మన పారంపరిక భక్తివిశ్వాసాలపై పెట్టకపోవడం సాగింది.  అలా పెరిగిన వారికి శివజ్ఞానం, శివభక్తి పై నమ్మకం నామమాత్రం. ఇక వారి తరువాతి తరంవారైతే ఏమి చేసినా చెల్లు; వారికి అసలే తెలియదు.  శివచింతన లేని హృదయం, శివున్ని తమ జీవితలక్ష్యంగా పరిగణించడం మానేయడంతో ప్రతీ విషయంలో స్వార్థం పెరిగి "మనము" అనే అలోచన మాని "నేను, నాది" అనే అలోచన ఎక్కువైంది. వ్యక్తుల మధ్య విభేదాలు పెరిగాయి. దానికి తోడు గురువుపై విశ్వాసము పోయి మార్గనిర్దేశణ పూర్తిగా లోపించింది. దాని అనుసంగ ప్రభావమే (side effect) నేటి సమస్యలు అని నా అభిప్రాయము. 

ఇక గురువుతో పాటు శరణసాంగత్యాన్ని కూడా మరల ప్రస్తావిస్తోంది ఈ వచనం.శరణులు నిత్య హితులుగా స్నేహితులుగా ఉంటూ శివచింతన-అన్యనిరసనలో తోడ్పడుతూ ఉంటారు.  ఈ విషయాన్నీ ఇప్పటికే   13. Gnanada Baladinda Agnanada Kedu - Basavanna14. Maramara Mathanadindagni Hutti - Basavanna వంటి వచనాలలో విశ్లేషించాము. 

కుండలు చేయటానికి మన్ను ఎంత ముఖ్యమో అంటే మన్ను లేని కుండ లేనట్లుగా, ఆభరణాలు చేయటానికి బంగారము ఎంత ముఖ్యమో అంటే బంగారము లేక ఆభరణము లేనట్లుగా, శివదీక్ష శివున్ని చేరే మార్గంలో నడవాలంటే గురువు, శివజ్ఞానము కలగాలంటే  శరణులు అవసరమని ఇక్కడ బసవన్న బోధ.