Saturday, April 25, 2015

20. Asattenalasidenendare Manadu & 21. Suka Bandade Punyada Phalavennanu - Basavanna

కన్నడ వచనం 

ಆಸತ್ತೆನಲಸಿದೆನೆಂದರೆ ಮಾಣದು,
ಬೇಸತ್ತೆ ಬೆಂಬಿದ್ದೆನೆಂದರೆ ಮಾಣದು,
ಏವೆನೇವೆನೆಂದರೆ ಮಾಣದು
ಕಾಯದ ಕರ್ಮದ ಫಲಭೋಗವು
ಕೂಡಲಸಂಗನ ಶರಣರು ಬಂದು
"ಹೋ ಹೋ ಅಂಜದಿರಂಜದಿರು" ಎಂದರಾನು ಬದುಕುವೆನು


తెలుగు లిపిలో 

ఆసత్తెనలసిదెనెందరె మాణదు 
బేసత్తె బెంబిద్దెనెందరె మాణదు
ఏవెనేవెనెందరె మాణదు
కాయద కర్మద ఫలభోగవు కూడలసంగమ శరణరు బందు  
"హో హో అంజదిరంజదిరు" ఎందరాను బదుకువెను 

తెలుగు వచనం 

అలసిసొలసితినన్న మానదు 
వేగి వేడుకొందునన్న మానదు
ఏంచేతునేంచేతునన్న మానదు
కాయపు కర్మపు ఫలభోగము కూడలసంగముని శరణులు వచ్చి 
"హో హో భయపడకుభయపడకు"మన్న నేను బతికెదను 

వచన కర్త ఆంతర్యం  

కర్మానుభవములు తప్పించుకోవలెనన్న నాకు స్వయంగా సాధ్యంకాదు. శరణుల సాంగత్యము  వారి అభయ వాక్యములు అవసరము. 


కన్నడ వచనం 
ಸುಖ ಬಂದಡೆ ಪುಣ್ಯದ ಫಲವೆನ್ನೆನು
ದುಃಖ ಬಂದಡೆ ಪಾಪದ ಫಲವೆನ್ನೆನು
ನೀ ಮಾಡಿದಡಾಯಿತ್ತೆಂದೆನ್ನೆನು
ಕರ್ಮಕ್ಕೆ ಕರ್ತುವೇ ಕಡೆ ಎಂದೆನ್ನೆನು
ಉದಾಸೀನವಿಡಿದು ಶರಣೆನ್ನೆನು
ಕೂಡಲಸಂಗಮದೇವ ನೀ ಮಾಡಿದುಪದೇಶವು ಎನಗೀ ಪರಿಯಲ್ಲಿ
ಸಂಸಾರ ಸವೆಯೆ ಬಳಸುವೆನು


తెలుగు లిపిలో 

సుఖ బందడె పుణ్యద ఫలవెన్నెను, 
దుఃఖ బందడె పాపద ఫలవెన్నెను
నీ మాడిదడాయిత్తెందెన్నెను, 
కర్మక్కె కర్తువే కడె ఎందెన్నెను  
ఉదాసీనవిడిదు శరణెన్నెను 
కూడలసంగమదేవ నీ మాడిదుపదేశవు ఎనగీ పరియల్లి 
సంసార సవెయె బళసువెను  

తెలుగు వచనం 
సుఖమోచ్చిన పుణ్యపు ఫలమని యెన్నను 
దుఃఖమొచ్చిన పాపపు ఫలమని యెన్నను 
నీ చేతలవల్లే  కలిగినవన్నయెన్నను 
కర్మకు కర్తయే కారణమన్నయెన్నను 
ఉదాసీనమునువిడిచి శరణనను  
కూడలసంగమ దేవ నీ ఉపదేశము నాకీవిధముగ 
సంసారము తృంచుటకు మలిచితిని   

వచన కర్త ఆంతర్యం  
సంసార చక్రమునుండి బయటపడవలె నన్న, సుఖ దుఃఖములను పాపపుణ్యఫల హేతువులుగా కాక సమంగా స్వీకరిస్తాను. నా కర్మల గొప్పదనం వల్ల సుఖములు కలిగాయని గర్వపడను. నా పాపముల వల్ల  దుఃఖము కలిగినదని అధైర్యపడను. నాచేతిలో ఏముందని నిరుత్సాహపడను. కర్మలన్నింటికి నా ప్రారబ్దమే కారణము, వాటినుండి తప్పించుకొను ఉపాయము లేదని నీ పై నమ్మకము విడువను.  ధైర్యాన్ని విడిచి ఓటమిని ఒప్పుకోను. నీవు చేసిన ఉపదేశము ఈ కర్మలంపటముతో నిండిన సంసారమును తెంచుటకు వాడుతాను. 


విశ్లేషణ 

పైన చెప్పిన వచనములు రెండింటిని కూడి విశ్లేషించదలిచాను. ఎందుకంటే చాలామంది రెండవ వచనాన్ని చదివి వీరశైవులు కర్మని నమ్మరని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాని మొదటి వచనంతో అనుసంధానిస్తే, కర్మ సిద్ధాంతంపై బసవన్న అభిప్రాయం అర్థమవుతుందని నా ఉద్దేశ్యము. ఇది తర్కించదగ్గ విషయం కాబట్టి చదివిన పెద్దలు ఈ విశ్లేషణను నిశితంగా పరిశీలించి తమ అభిప్రాయం తెలియజేయవలెనని విజ్ఞప్తి. 

అసలు కర్మ సిద్దాంతం ఎలా పనిచేస్తుంది? 
ప్రతీ జీవి ఎప్పుడూ ఎదో ఒక కర్మ (అంటే పని) చేస్తూనే ఉంటాడు. అయితే ఆ కర్మలలో ఇతర జీవులకు, సమాజానికి, వాతావరణానికి, హాని కలిగేలా కేవలం తన స్వార్థం కోసం చేస్తే అది పాపకర్మ అవుతుంది. సాధ్యమైనంతవరకు ఎవరికీ హాని కలగకుండా, తనతో పాటు ఇతర జీవులకు ఉపయోగపడే కార్యము చేస్తే అది పుణ్య కర్మ అవుతుంది. ఇలా ప్రతీ పనీ పుణ్యమో పాపమో అయి జీవుని ఖాతాలో పేరుకుంటాయి. ఇలా పేరుకున్న కర్మలు మరణించిన తరువాత కూడా జీవునితో పాటు (సూక్ష్మ శరీరంతో తోడైన కారణ శరీరమై) వెళతాయి. ఇలా పేరుకు పోయిన వాటిని సంచితములు అంటారు.  అయితే పూర్వపు కర్మలను అనుసరించి జీవితంలో కష్టములు, సుఖములు కలుగుతాయి.  పాపములు చేసిన జీవుడు కష్టములను అనుభవించి పాపకర్మలను తగ్గించుకోవాలి. వీటిని ప్రారబ్ధములు అంటారు. పుణ్యములు చేసినవాడు సుఖమనుభవించి పుణ్యములు వాడుకోవాలి. కర్మ ఫలాలను అనుభవిస్తూనే మళ్లీ కర్మలు చేస్తుంటాడు. ఇవి మళ్లి సంచితములకు చేరుతాయి. ఇలా కర్మ ఫలాలను అనుభవించడానికే జీవుడు మరల మరల పుడుతూ-ఛస్తూ ఉంటాడు. ఇది ఒక చక్రంగా మారి కర్మచక్రమని, సంసారచక్రమని వ్యవహరింపబడుతుంది. 

ఆయితే బసవన్న, ఆది శంకరులు వంటి వారందరూ కర్మవాదాన్ని ఖండించారు అని అంటారు. అంటే వాళ్ళు ఈ పైన చెప్పిన సిద్ధంతాన్ని, కర్మ ఎలాంటి ప్రతిఫలమూ ఉండదని నమ్మేవారా? అనే ప్రశ్న తలెత్తుతుంది. 

అద్వైతులు (అంటే నేటి స్మార్త బ్రాహ్మణులు) ఆది శంకరుడు కర్మవాదాన్ని ఖండించినా కూడా కర్మకాండలు చేస్తారు. వాళ్ళ ఉద్దేశ్యంలో కేవలం సన్యాసులు మాత్రమే కర్మలను వదిలి పెడతారు. మరి సన్యాసులు ఏ కర్మలను వదులుతారు? యజ్ఞము చేయరు. అగ్ని వెలిగించరు. వండుకోరు. ఇతరులు ఇచ్చిన భిక్షతో జీవిస్తారు. 

వీరశైవులు కర్మవాదాన్ని ఖండిస్తారు. వాళ్ళు యజ్ఞ యాగాదుల జోలికి వెళ్ళరు - సన్యాసులవలే అగ్నిష్టోమాది క్రతువులు, పిండ ప్రధానము మొదలైనవి చేయరు.  

అయితే ఈ క్రతువులకు పైన చెప్పిన కర్మ  సిద్ధంతానికి ఏమిటి సంబంధం? అసలు వీళ్ళందరు ఖండించే కర్మవాదం ఏమిటి? ఈ కర్మవాదం, కర్మసిద్దాంతం రెండూ ఒకటేనా?  
అంటే "కర్మ మీమాంస" గురించి తెలుసుకోవాలి. 

ఈ విషయంలో నాకు తెలిసినది చాలా తక్కువ. తెలిసినంత వివరిస్తాను. వేదంలో కర్మకాండ, జ్ఞానకాండ రెండు భాగాలు.  
కర్మ-మీమాంస: దీన్ని పూర్వ మీమాంస అని కూడా అంటారు. వేదంలో ఉండే శ్లోకాలు కర్మకాండకు ఉపయోగించేవి. వేద మంత్రాలను ఉపయోగించి యజ్ఞయాగాదులు చేసేది కర్మకాండ. ప్రతీ యజ్ఞాన్నీ ఒక ప్రతిఫలం ఆశించి చేస్తారు. కర్మ మీమాంసను నమ్మే వారు కేవలం యజ్ఞ యాగాదుల పైనే విశ్వసించేవారు. కేవలం క్రతువులు చేస్తే ప్రతిఫలం లభిస్తుందని, కనుక కర్మలే తమకు సుఖాన్ని కలిగిస్తాయని నమ్మేవారు. వారికి భగవంతుని ప్రమేయముపై విశ్వాసము ఉండేది కాదు. కేవలం కర్మకాండలతో తమ జీవనాన్ని, పరాన్ని, వచ్చే జన్మనీ నిర్ణయించుకోగలమనే అభిప్రాయము. వేదంలో చెప్పిన దాని ప్రకారం నడుచుకోవడం, క్రతువులు చేయడం ,యజ్ఞాలలో బలి మొదలైనవి వీరి సామాన్య అలవాట్లు.  వీరికి జ్ఞానకాండ పై నమ్మకం ఉండేది కాదు - ఆత్మజ్ఞానం పై కోరిక ఉండదు. 

జ్ఞాన-మీమాంస:  దీన్ని ఉత్తర మీమాంస అని కూడా అంటారు. ప్రతి వేదభాగము చివరలో ఉండే ఉపనిషత్తులు జ్ఞానకాండలోకి వస్తాయి. ఈ వేదాంతలను, లేక ఉపనిషత్తులను నమ్మేది ఈ జ్ఞాన మీమాంస. వీళ్ళు క్రతువులను కాక, బ్రహ్మజ్ఞానాన్ని నమ్ముతారు. ఆత్మ విచారణ చేసి జీవాత్మని బ్రహ్మములో ఐక్యము చేయడం, మోక్షము వీరి ఉద్దేశ్యం. వీరు ఒక తంతులా కర్మలు చేయకుండా, జ్ఞానము ద్వారా శివున్ని తెలుసుకొనే ప్రయత్నం చేస్తారు. 

ఆనాడు కర్మమీమాంస ఎక్కువగా వ్యాప్తి చెంది సమాజంలో ద్వేష భావం కూడా పెరిగింది. తమ పూర్వ పుణ్య ఫలంవల్ల తమకు మంచి జన్మ కలిగిందని, ఇతరులు తమకన్నా నీచమైన స్థాయికి చెందిన వారనే విశ్వాసం కొంతమందికి ప్రబలంగా ఉండేది. పాండిత్యం తమ స్వంతమని ఇతరులు వినరాదని, చదవరాదని వెలివేయడం జరిగేది. ప్రొద్దున్నే సన్యాసి ముఖం చూడొద్దు, విధవ ముఖం చూడొద్దు, అలాంటి కర్మలవల్ల  ఆ రోజు కీడు కల్గుతుంది వంటి మూఢ విశ్వాసాలు ప్రబలిపోయాయి. ఇలాంటి విషయాలు మనకు బసవన్న చరిత్రలో బాల్యంలో కోకొల్లలు. 

కర్మకాండను సంపూర్ణంగా విశ్వసించేవారు పాపపుణ్యాల ఖాతాలలో వాటిని నింపుకునే ఆలోచనలో చిక్కుకొని, సంసారచక్రంలో పరిభ్రమిస్తూ జన్మలెత్తుతూ ఉంటారు. వీరికి మోక్షము ఎన్నటికీ లభించదు. దక్షునికి-నందీశ్వరునికి జరిగిన వాగ్వివాదంలో, బసవన్న దక్షున్ని-కర్మవాదులని ఈ విషయంలోనే శపించాడు. "వేదాలు కర్మలు అని పరిభ్రమిస్తున్నమీరు ఎన్నడూ జ్ఞానానికి-మోక్షానికి దెగ్గరకాలేరు" అని. 

బసవన్న నాటి కాలానికి ఆనాటి బ్రాహ్మణులు వేదాన్ని చాలామట్టుకు కర్మ మీమాంసను అనుసరించి కర్మ కాండలకు ఉపయోగించేవారని గోచరిస్తుంది. వీరశైవులు వ్యతిరేకించింది అలాంటి నాస్తికవాదమైన కర్మవాదమని అర్థమవుతుంది; కాని ముందు చెప్పిన మౌలికమైన కర్మ సిద్దాంతాన్ని కాదు. 

ఆది శంకరుని వృతాంతం చదివితే అతడు కూడా కర్మ మీమాంస ప్రభోదించే మండలమిశ్రతో తర్కించి కర్మవాదాన్ని ఖండించి, ఓడించి, అతనిని తన శిష్యునిగా సురేశ్వరాచార్యునిగా చేసుకోన్నాడని తెలుస్తుంది. అయితే ఆధునిక బ్రాహ్మణులు క్రతువులను, జ్ఞానాన్ని సమంగా చూస్తూ రెండింటిని అనుసంధానపరిచారని తెలుస్తోంది. వారు కర్మకాండను ఎక్కువగా పాటించినా, అది వారిని జ్ఞాన మార్గానికి దెగ్గర చేస్తుందని నమ్ముతారు; కేవలం కర్మవల్ల మోక్షం కుదరదని కూడా అంగీకరిస్తారు.  
వీరశైవులు మాత్రం అలా చేయలేదనిపిస్తుంది - వారు సిద్దాంత శిఖామణిని అనుసరించి కర్మకాండకు దూరంగా ఉన్నారు; భక్తి మార్గాన్ని, జ్ఞానమార్గాన్ని మాత్రమే అంగీకరించారు. భక్తికి ఎంతవసరమో అంత కర్మ మాత్రమే నిత్య జీవితంలో పొందుపరిచారు. ఉదాహరణకు శివ పూజ కర్మే అయినా భక్తి మార్గానికి తోడ్పడుతుంది కాబట్టి అది చేస్తారు. 

ఇప్పుడు వచనాలకు వద్దాం. 

మొదటి వచనం-
కర్మ ఫలం తప్పించుకోవడం చాలా కష్టమని బసవన్న ఉద్దేశ్యము. ఎంత అలసిపోయినా కష్టాలు కర్మఫలంగా వస్తే ఆగవు. వేగిపోయాను, ఇక తట్టుకోలేను అని మొరపెట్టుకున్నా ఆగవు. అయ్యో ఎన్ని కష్టాలు ఏంచేయాలి అని వాపోయినా రాకుండా మానవు. కాని కర్మవల్ల కలిగే కష్టాలు శివశరణుల ఉద్బోధతో తొలగిపోతాయి. ఎందుకంటే శివ శరణులు జ్ఞానబోధచేస్తారు. కష్టాలను సుఖాలను సమంగా చూడడం నేర్పుతారు.  కర్మ చేయడం మానలేము. కాని కర్మలను శివార్పణా భావంతో చేయడం నేర్పుతారు. అంటే ప్రతిఫలం ఆశించకుండా చేసేది. 
అందరికి మంచి జరగడం కోసం చేసేది పుణ్యమైతే, కర్మను పుణ్యం కోసమని కాక శివకార్యంగా చేసేది శరణుల పద్ధతి! ఇలా కోరికలు లేకుండా చేసే కర్మని నిష్కామకర్మ అంటారు.  
ఉదాహరణకు ఒక వెయ్యి రూపాయలు ఒక అనాథ శరణాలయానికి దానమిచ్కారనుకోండి. నేనిచ్చనని తలిస్తే అది పుణ్యం; నాదేముంది శివుడు చేయించాడు అని మనస్సు సంపూర్ణంగా భావిస్తే అది శివార్పితమవుతుంది. అప్పుడు ఆ పుణ్యం తనని అంటదు. ఇలా మానసిక పరివర్తన చెందాలంటే శరణ సాంగత్యం అవసరం. ఎప్పుడూ హితబోధ చేస్తూ మనల్ని తప్పులుచేయకుండా చూసుకుంటారు శరణులు - కనక పాపము అంటే ప్రసక్తే లేదు. కాబట్టి పుణ్య-పాపములు రెండూ శివ శరణ సాంగత్యంలో ఉండే వీరశైవులకు వర్తించవు. కనుక వారిని కర్మ ఫలం అంటదు. ఒకవేళ ప్రారబ్ధము వల్ల కష్టమో సుఖమో కల్గినా అది శివానుగ్రహ భావంతో స్వీకరిస్తారు. 

కనుక వీరశైవులు కర్మనే నమ్మరని కాదు-  వారికి గురువు, జంగమ, శివ శరణుల సాంగత్యము వల్ల కర్మ ఫలములు అంటవు - అనేది ఈ వచనం ద్వారా అర్థమవుతుంది. 

రెండవ వచనం-
మొదటి వచనము యొక్క సందర్భాన్ననుసరించి, శరణుల సాంగత్యంలో ఉన్న వారి మనో ప్రవర్తన, ధైర్యము ఎలా ఉంటాయో ఈ వచనం తెలియజేస్తుంది -  
సుఖము కలిగితే పుణ్యకర్మ ఫలమని నమ్మను. గొప్పలకు పోను. "మా తాతలు నేతులు తాగారు మా మీసాలు నాకండి" వంటి భావాలను దరిచేరనీయను. ఏ జన్మలో చేసిన పుణ్యమో అని సంబర పడ వలసిన పనిలేదు -నాకు గుర్తుకూడా లేదు. ఎందుకొచ్చిన ఆలోచనలు?
దుఃఖము కల్గితే పాప కర్మ ఫలమని నిరాశపడను. నన్ను నేను చిన్న చూపు చూసుకోను. ఇతరులను చిన్నచూపు చూడను.   
నీ కర్మ ఫలాన్నే అనుభావిస్తున్నవు అని కించపరిస్తే ఒప్పుకోను. నాకు రావలసిన కష్టసుఖాలను ఆనందంగా అనుభవించి శివునికి దెగ్గరవుతాను. 
'నీ కర్మకు నీవే కారణం - అనుభవించ వలసిందే' అంటే ఒప్పుకోను. అది నాస్తికుల వాదము. నా శివుడు, నా గురువు, నా శరణులు ఉండగా కర్మఫలములు నన్నేమి ఏడ్పిస్తాయి? అనే ధైర్యంతో ఉంటాను. మేము శివుని వారలము..  ఈ కష్టాలు మమ్ములనేం చేస్తాయి?
విషయాలను పట్టించుకోకుండా ఉంటాను. అంతే గాని ఉదాసీనమును విడిచి కష్టాలకు శరణని లొంగిపోను. 
మా శరణులద్వారా, గురువుద్వారా, శివా... , నీవు నేర్పిన ఉపదేశాన్ని పాటిస్తూ, పాప పుణ్యాలను త్యజిస్తూ శివార్పణ భావంతో సంసార చక్రాన్ని ఛేదించి శివసాయుజ్యాన్ని పొందుతాను. 
ఇటువంటి భావంతో వీరశైవులు నిత్య జీవనాన్ని సాగిస్తారు అని బసవన్న తనని మన స్థానంలో ఉంచుకొని చెప్పారు. 

ఈ రెండవ వచనాన్ని సరైన కోణంలో చదవకపోతే, అర్థం మారి, వీరశైవులు కర్మకాండలను, కర్మమీమాంసనే గాక,  కర్మసిద్దాంతాన్ని సంపూరణంగా నమ్మరనే ఉద్దేశ్యం కలుగుతుంది. కాబట్టి ఈ రెంటిని కలిపి చెప్పవలసి వచ్చింది. 

శరణు శరణార్థి !!






      

  

          
   




No comments:

Post a Comment