కన్నడ వచనం
ದೇವಲೋಕ ಮರ್ತ್ಯಲೋಕವೆಂಬುದು ಬೇರಿಲ್ಲ ಕಾಣಿರೋ !
ದೇವಲೋಕ ಮರ್ತ್ಯಲೋಕವೆಂಬುದು ಬೇರಿಲ್ಲ ಕಾಣಿರೋ !
ಸತ್ಯವ ನುಡಿವಿದೇ ದೇವಲೋಕ, ಮಿಥ್ಯವ ನುಡಿವುದೇ ಮರ್ತ್ಯಲೋಕ.
ಆಚಾರವೇ ಸ್ವರ್ಗ, ಅನಾಚಾರವೇ ನರಕ.
ಕೂಡಲಸಂಗಮದೇವಾ, ನೀವೆ ಪ್ರಮಾಣ.
తెలుగు లిపిలో
దేవలోక మర్త్యలోకవెంబుదు బేరిల్ల కాణిరో!
సత్యవ నుడివుదే దేవలోక, మిథ్యవ నుడివుదే మర్త్యలోక
ఆచారవే స్వర్గ, అనాచారవే నరక
కూడలసంగమదేవా, నీవే ప్రమాణ!
తెలుగు వచనం
దేవలోకము మర్త్యలోకములనునవి వెరెక్కడలేవు చూడరో!
సత్యము పలుకుటే దేవలోకము, మిథ్యము పలుకుటే మర్త్యలోకము
ఆచారమే స్వర్గము, అనాచారమే నరకము
కూడలసంగమ దేవా, నీవే ప్రమాణము!
వచనకర్త ఆంతర్యము
అసత్యము, అన్యాయములు ఉండు చోట నరకము ఉంటుంది. వేరే వెతకక్కరలేదు.
విశ్లేషణ
మనిషి తన ప్రవర్తన ద్వారా తన పరిసరాలను స్వర్గంగానో, నరకంగానో మార్చుకోగలడని బసవన్న ఉవాచ.
దేవలోకంలో దేవతలు ఉంటారని, మర్త్యలోకంలో మానవులు ఉంటారని, పుణ్యములు చేస్తే స్వర్గానికి వెళ్తామని, పాపములు చేస్తే నరకమునకు వెళతామని నమ్ముతాము. స్వర్గంలో అంతా సుఖమే. నరకంలో సూదులతో పొడుస్తారు, పురుగులతో, పాములతో కరిపిస్తారు, నూనెలో దేవుతారు వగైరా. కర్మకాండలను ఆచరించే వారైతే స్వర్గప్రాప్తికై తపనతో యజ్ఞయాగాదులు నిర్వహిస్తుంటారు. నూరు యజ్ఞములకు యజమాని అయినవాడు ఇంద్రపదవిని పొందుతాడని అంటారు. కేవలం పరలోక సుఖముల కోసం ఇలాంటి కర్మలను చేసేవారు చాలామంది ఉంటారు. అయితే ఈ కర్మలలో మునిగి, ఈనాటి పరిస్థితులను విస్మరిస్తూ ఉంటారు. ఇక కొన్ని మతాలవారైతే చచ్చింతరువాత వారికి లభించే సుఖాలను ఆశించి, అపోహతో ఇక్కడ తీవ్రవాదాన్ని, మారణ హోమాన్ని సృష్టిస్తున్నారు. దేవలోకమనేది చచ్చిన తరువాత చూసేది కాదు ఇక్కడే సృష్టించవచ్చు అంటున్నారు బసవన్న.
ఈనాటి సమాజంలో ఏ సమస్యలను పరిశీలించినా అసత్యము, మోసములు స్వార్థముతో కూడడంవల్ల కల్గుతున్నయనడంలో సందేహం లేదు. ఇవి చిన్న చిన్న అవినీతితో మొదలుకొని పెద్ద కుంభకోణాలు, కుట్రలు వరకు రకరకాల రూపాలలో ఉంటాయి. వీటికి జాతి మతములతో ప్రమేయం లేదు. అందరూ భాగస్వాములే. చేసేవి చిన్న చిన్న తప్పులైనా అన్నీ కలసిననాడు వాటి ప్రభావం సంఘటితంగా చాలా పెద్దదై నరకప్రాయమే అవుతుంది. ఉదాహరణకు స్వార్థంతో నియమాలను అతిక్రమించి కట్టడాలకు అనుమతులు ఇచ్చేస్తారు. నీరు సరిపోతుందో లేదో ఆలోచించకుండా అనుమతులు. రహదారులు వేయడంలో మోసంతో పద్దతులను అతిక్రమించి వేస్తారు. అనుమతులు ఉల్లంఘించి చేసే చిన్న చిన్న తప్పులు ఇంకొన్ని. దాంతో దారుల్లో రద్దీ పెరిగి నడవడానికి కూడా వీలులేనంత నరకప్రాయమైపోతాయి, కావలసిన నీరు లేక, పరిశుభ్రత లోపించి, కాలుష్యం పెరిగి, రోగాలు వంటివాటితో స్వర్గంలా ఉండవలసిన నగరాలు, నరకాలవుతాయి. అంటే నరకాన్ని మనం చుట్టూ సృష్టించుకున్నామా లేదా? అదే విధంగా అసత్యము, మోసము పాళ్ళు తక్కువ ఉండే చోట ఇలాంటి సమస్యలు లేక స్వర్గంలా ఉండే నగరులను కూడా చూస్తున్నాము. అంటే మన ప్రవర్తన, నియమావళిని బట్టి పరిసరాలు మారిపోతాయి.
ఇంకో ఉదాహరణ. ప్రయాణంలో ఉన్నాము. ఆకలేస్తోంది. చూసిచూసి మంచి శుభ్రంగా కనబడే చోట ఆగాము. మంచి పరిసరాలు. ప్రక్కన్నే ఒక కొలను. చల్లనిగాలి, పచ్చని చెట్ల సువాసన. పిల్లలకు బాగా నచ్చింది. చక్కగా గడ్డిలో దొర్లి మరీ ఆడుకున్నారు. దుప్పటి పరచి కూర్చొని తిన్నాము. మిగిలిపోయిన పొట్లాలను, తిను పదార్థాలను అక్కడే పారేసి వెళ్ళిపోయాము. మరి మనపని అయిపోయింది కదా! అలానే ఇంకొంతమంది చేసుంటారు ఆరోజు! మరునాడు తిరుగు ప్రయాణంలో అక్కడే ఆగాలని చూసాము. ఈసారి చక్కగా ఉన్నచోట ఇప్పుడు కుక్కలు చేరాయి. కుళ్ళిపోయిన వాసన. తిని పారేసిన ప్లాస్టిక్ కాగితాలు, పేపరు గిన్నలు. ఎక్కడ చూసినా చీమలు కుడుతున్నాయి. పిల్లలు ఏడుస్తున్నారు. దోమలు, పురుగులు, వాటిని తినడానికి వచ్చిన పామొకటి కనబడింది. ఛఛ.. అంటూ వెళ్ళిపోయాము.
ఒకే చోటు నిన్న స్వర్గమైతే, ఈరోజు నరకమైంది. అలా మార్చింది ఎవరో కాదు మన ప్రవర్తన.
అంతే గాదు. అసత్యాన్ని చాలా తేలికగా తీసుకోవడం అలవాటైపాయింది. చాలా మందికి తప్పనిపించడం లేదు. ఈనాడు సంకేతిక విద్యను, విజ్ఞానాన్నికూడా దురుపయోగపరచి అసత్యాలను ప్రసారంచేస్తున్నారు. హనుమంతుని గద దొరికిందని, ఘటోత్కచుని కళేబరం దొరికిందని రకరకాల అసత్యాలను చిత్ర వక్రీకరణతో (morphing) సృష్టించి తామేదో మతావిశ్వాసాలకు పాటుపడుతున్నట్లు భావిస్తారు. అసత్యంవల్ల కేవలం దుష్ప్రయోజనమే ఉంటుందని గ్రహించాలి; అసత్యంవల్ల రాబోయే తరాలవారికి ఇంకా నమ్మకాలు తగ్గుతాయి - ఉన్న నమ్మకలను కూడా పాడు చేస్తారు.
ఇక రెండవది ఆచారము. మంచి నడవడిక నేర్పేది ఆచారం. ఆచారంవల్ల మనకేగాక చుట్టూ ఉండే వారికి కూడా ఇబ్బందులు కలగకుండా ఉంటుంది. "ఆచార హీనః పురుషౌ, లోకే భవతి నిందితః" - ఆచారము పాటించని వారు లోకంలో నిందకు గురవుతారు అని అన్నారు. ఉదాహరణకు ప్రొద్దున్నే లేచి, దంతాలను శుభ్రపరచుకొని స్నానం చేయడం ఆచారం. బడికి వెళ్ళినా, పనికి వెళ్ళినా శుభ్రంగా వెళ్ళడం ఆచారం. అలా కాకుండా నిద్రలేచి ముఖం కూడా కడుక్కోకుండా వెళితే, వాళ్ళ పక్కన కూర్చునే వారు ఇబ్బంది పడతారు. అప్పుడు అక్కడే నరకమౌతుంది.
ఆచారాలు రకరకాలుగా ఉంటాయి. తినేముందు, తిన్న తరువాత చేయి కడుక్కోవడం, ఇంట్లో చెప్పులు వేసుకోకపోవడం, గుడిలోకి వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కోవడం వంటి సామాన్య ఆచారాలు అందరూ పాటిస్తారు. తమ విశ్వాసాలను బట్టి ధర్మపరమైన ఆచారాలు ఇంకో రకం. లింగాచార, సదాచార, శివాచార, గణాచార, భృత్యాచారములనే పంచాచారములను వీరశైవులు పాటిస్తారు. వీటిని విస్తృతంగా తెలుసుకుంటే మనము నిత్యమూ ఆచరించే నిత్య లింగార్చన, సత్ప్రవర్తన, కష్టపడి సంపాదించడం, వంచనకు దూరంగా ఉండడం, అభక్ష్య భక్షణాలకు (అంటే మాంసము వంటివి), అపేయ పానాలకు (అంటే మద్యము వంటివి) దూరంగా ఉండడం, మంచి వారితో- శివశరణులతో స్నేహం, భక్తులను నిత్యం సేవించుకోవడం మొదలైన లక్షణాలు ఉంటాయి. కొన్ని మాత్రమే ఇక్కడ ఉదాహరించాను. వీటివల్ల తమధర్మపాలనే కాకుండా సమాజంలో సమతుల్యత, కీర్తి కలుగుతాయి. అదే బసవన్న చెప్పే"ఆచారమే స్వర్గం" అంటే .
ఆచారములను మరచి చరించే వారు, కావాలని వాటిని అతిక్రమించే వారు తమ జీవితంలోనే కష్టాలు తెచ్చుకుంటారు. సమాజంలోనూ సమతుల్యం చెడుపుతారు. ఉదాహరణకు మద్యానికి దూరంగా ఉండటం సదాచారాలలో ఒకటి. కొందరు ఈ దురలవాటును ఈ మధ్య నేర్చుకుంటున్నారు. ముందు ఇటువంటి వాటివల్ల తమ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటారు. పైగా తప్పని ఒప్పుకోరు - ఆ దేశంలోనోఅధ్యయనం చేసారంట రోజు త్రాగితే ఆరోగ్యకరమని. ఈ ధర్మాతిక్రమణకు ఏవో కుంటిసాకులు చెబుతారు. ఇంట్లో వాతావరణం చెడగొడతారు. భావి తరాలైన తమపిల్లలకు ఈ చెడు అలవాట్లను వాళ్ళకి తెలియకుండానే నేర్పుతారు. ఉపాసనకు దూరమై భ్రష్టులవుతారు - తమ చుట్టూ ఉండే వారిని కూడా భ్రష్టులను చేస్తారు. వారికి ఇక శివసాయుజ్యము, శివజ్ఞానము వంటివి ఎక్కడినుండి కల్గుతాయి? ఎలా అర్థమవుతాయి? ఇదే బసవన్న చెప్పే "అనాచారమే నరకం" అంటే.
అయితే ఇలాంటి తప్పొప్పులకు ప్రమాణం ఎవరు? ప్రతీ విషయాన్నీ ప్రభుత్వమో, రక్షణ వ్యవస్థో, లేక పక్కనున్న వారో నిత్యం పరిశీలిస్తూ చెప్పడం కుదరదు. మనలో ఉంటూ మనకి నిత్యం ఇది తప్పు అని చెబుతూ అంతరంగంలో ఉండే ఆ కూడల సంగమేశ్వరుడు హెచ్చరిస్తూ ఉంటాడు. కనుక అతడే ప్రమాణము!
No comments:
Post a Comment