Showing posts with label మూఢనమ్మకము. Show all posts
Showing posts with label మూఢనమ్మకము. Show all posts

Sunday, September 11, 2016

43. Shakunavemdembe Apashakunavemdembe - Basavanna

కన్నడ వచనం 

 ಶಕುನವೆಂದೆಂಬೆ ಅಪಶಕುನವೆಂದೆಂಬೆ,
 ನಿಮ್ಮವರು ಅಳಲಿಕಂದೇಕೆ ಬಂದೆ ?
 ನಿಮ್ಮವರು ಅಳಲಿಕಿಂದೇಕೆ ಹೋದೆ ?
 ನೀ ಹೋಹಾಗಳಕ್ಕೆ!
 ನೀ ಬಾಹಾಗಳಕ್ಕೆ!
 ಅಕ್ಕೆ ಬಾರದ ಮುನ್ನ ಪೂಜಿಸು ಕೂಡಲಸಂಗಮದೇವನ.


తెలుగు లిపిలో 


శకునవెందెంబె, అపశకునవెందెంబె
నిమ్మవరు అళలికందేకె బందె?
నిమ్మవరు అళలికందేకె హోదె?
నీ హోహాగళక్కె! నీ బాహాగళక్కె!
అక్కె బారాద మున్న పూజిసు కూడల సంగమ దేవన


తెలుగు వచనం

శకునమనేవు , అపశకునమనేవు
మీవారినేడిపించుటకు ఆనాడెందు కొచ్చావు?
మీవారినేడిపించుటకు ఈనాడెందుకు పోయావు?
నీవచ్చుట యేడఁచుటకే, నీవు పోవుట యేడఁచుటకే
ఆ దుఃఖము రాకమునుపే పూజించు కూడల సంగమ దేవుని!

అర్థం 
శకునములు, అపశకునములు ఎంచుతూ జీవితమంతా గడుపుతూ ఉంటే, జనన మరణ చక్రములో పడి ఇరుక్కు పోతావు. అటువంటి సంసార దుఃఖమును నివారించు కోవాలంటే కూడల సంగమ దేవుని శరణు వేడుకొని పూజించు. 

విశ్లేషణ 

మన సమాజంలో శకునముల ప్రభావం తరతరాలుగా నాటుకు పోయి ఉంది.  పిల్లి ఎదురైతే మంచిది కాదని, ముత్తైదువ ఎదురైతే మంచిదని, విధవ ఎదురైతే మంచిది కాదని, తుమ్మితే పని జరగదని, దంపతులు ఎదురొస్తే మంచిదని, కాకి కూస్తే చుట్టాలొస్తారని, మగవాళ్ళకి కుడికన్ను అదిరితే మంచిదని, ఆడవాళ్లకు కుడికన్ను అదిరితే మంచిది కాదని రకరకాల నమ్మకాలతో పెద్ద శకున శాస్త్రమే పాటిస్తూ ఉండే వాళ్ళని చూస్తూ ఉంటాము. వీటిపై నమ్మకంతో పనులు మానుకునే వారినీ చూస్తాము. అయితే వీరశైవులు వీటిని ఎలా తీసుకోవాలో తెలిపే వచనం ఇది.

వీరశైవ వచన సాహిత్యము శకునములను వీరశైవులు పాటించ కూడదని చెబుతున్నాయి. శివున్ని నమ్మకంతో కొలిచే వారు శకునములు వదిలి పెట్టాలి; వాటి ప్రభావము నిత్య శివపూజ నిష్ఠులై, లింగంగ సంయోగముతో నుండే వారిపై ఉండదు. శుభ శకునములన్న ఉత్సాహము, అపశకునముల ఆవేదన రెండూ కూడా శివభక్తిపై అపనమ్మకమును సూచనలే. 

మనిషి పుట్టేటప్పుడు తన కుటుంబీకులకి, ముఖ్యంగా తల్లికి తీవ్రమైన ఆవేదన కలిగిస్తాడు.  తానేడుస్తూ నే వస్తాడు. ఏడిపిస్తూ నే (బాధ కలిగిస్తూనే) పుడతాడు. ఈ పుట్టేటప్పుడు శకునాలు, అపశకునాలు చూసుకొని పుట్టడు. 
అదే విధంగా వెళ్లిపోయేటప్పుడు కూడా తనవారందరి ఏడుపుకు, బాధకు కారణమవుతాడు. అక్కడ కూడా శకునములు, అపశకునములు చూసుకొని పోయే అవకాశము ఉండదు. 

ఈ మధ్యలో ఉన్నకాలము శకునములు, అపశకునములు ఎంచుతూ, కాలం వృధా చేసుకోవడం చూస్తూ ఉంటాము. నిత్యం ఇప్పుడెందుకు వచ్చావని, అప్పుడెందుకు పోయవని విపరీతయమైన ఆలోచనలు - ఇతరులను వేధించడం.

కర్మ మార్గములో ఉంటూ, కర్మ ఫలాలను అనుభవిస్తూ  ఉండేవారికి  శకున శాస్త్రం పాటించడం పరిపాటి. ఇటువంటి వారు సంసార చక్రంలో ఇరుక్కొని పుడుతూచస్తూ  ఉంటారు.  ఇటువంటి వారు  "పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం" అన్నట్లు సంసార చక్రంలో ఇరుక్కొని పుడుతూచస్తూ  ఉంటారు. 

భక్తి-జ్ఞానమార్గ నిష్ఠాపరులు, ముముక్షువులైన వీరశైవులు ఎరుకతో శివున్ని పూజిస్తారు. శివునిపై అపారమైన నమ్మకంతో ఉంటూ ఏ విధంగానైతే  పాపపుణ్యముల ఫలములను త్యజిస్తారో, అదే విధంగా శుభాశుభ శకునములను కూడా పట్టించుకోరు, పాటించరు. ఇలా తిరస్కరిస్తారు కాబట్టి ఈ జన్మలోనే జీవన్ముక్తులై, జరామరణ దుఃఖమునకు దూరమవుతారు. అటువంటి మార్గంలో ఉంటూ సంసారదుఃఖం దరిజేరక ముందే శివున్ని పూజించమని బసవన్న సలహా. 

శరణు శరణార్థి!! 









Sunday, September 4, 2016

42. Andu Indu Mattondena Beda - Basavanna

కన్నడ వచనం

ಅಂದು ಇಂದು ಮತ್ತೊಂದೆನಬೇಡ,
ದಿನವಿಂದೇ ಶಿವ ಶರಣೆಂಬವಂಗೆ,
ದಿನವಿಂದೇ ಹರ ಶರಣೆಂಬವಂಗೆ,
ದಿನವಿಂದೇ ನಮ್ಮ ಕೂಡಲಸಂಗನ ಮಾಣದೆ ನೆನೆವಂಗೆ!
తెలుగు లిపిలో 

అందు ఇందు మత్తొందెన బేడ
దినవిందే శివ శరణంబవంగె
దినవిందే హరశరణంబవంగె
దినవిందే నమ్మ కూడలసంగన మాణదె నెనెవంగె! 


తెలుగు వచనం 

అప్పుడు ఇప్పుడు మరోదినమనకు
దినమిదే శివశరణంబనువానికి 
దినమిదే హరశరణంబనువానికి  
దినమిదే మన కూడలసంగని నమ్మి తలచిన వానికి!

అర్థము 

శివుని నమ్మిన వాడు శుభాశుభ దినములను లెక్కించడు. తలచిన దినమే కార్యాన్ని నిర్వహిస్తాడు 

విశ్లేషణ 

లగ్నవెల్లియదొ విఘ్నవెల్లియదొ ,ఎమ్మవరు బెసగొండరె శుభలగ్నవన్నిరయ్యా అనే గత రెండు వచనాలలో వీరశైవులు సమయాసమయముల విషయంలో ఎలాంటి వ్యవహారం కలిగి ఉండాలో చర్చించుకున్నాము. ఆ కోవకు చెందిందే ఈ వచనం కూడా.

మూఢ నమ్మకములకు వీరశైవులు సదా వ్యతిరేకులు. కేవలము శివునిపై మాత్రమే విశ్వాసము కలిగినవారు. దినములను లెక్కిస్తూ శుభఘడియలకోసం వేచి ఉండేవాడు ప్రయత్నం చేయకుండానే అవకాశాన్ని పోగొట్టుకునే పరిస్థితి కలుగవచ్చు. కొన్ని వందల సంవత్సరాల తరువాత వ్రాసిన కబీరుదాసు దోహా కూడా ఈ ప్రాతిపదికను అనుసరించేదే -

काल करे सो आज कर आज करे सो अब
पल में परलै होयगी बहुरि करेगा कब   

దినములు లెక్కించక, రేపు చేయవలసింది నేడు చేయి. నేడు చేయవలసింది ఇప్పుడే చెయ్యి. క్షణంలో ప్రళయం రావాచ్చు, మరి ఎప్పుడు చేస్తావు?   

ఇక్కడ వీరశైవులకు తమ శివభక్తిపైనుండవలసిన నమ్మకాన్ని పునరుద్ఘాటిస్తున్నారు. ఒక్కసారి శివున్ని శరణన్న వానికి ఏ దినమైన శుభదినమేనని. కాలకాలుడైన హరుని శరణన్న వాడు కర్తవ్యమును నిర్వహించునప్పుడు మరో దినముకై వేచియుండవలసిన పనిలేదు. ఇక ఇంత చెప్పిన తరువాత కూడా శుభదినము కొరకు వేచి ఉంటే, వానికి  కూడలసంగనిపై బలమైన నమ్మకము లేదనే కదా తెలియవలసింది?

శరణు శరణార్థి!!



    






Saturday, April 11, 2015

18. Neera Kandalli Muluguvarayya - Basavanna

కన్నడ వచనం 

ನೀರ ಕಂಡಲ್ಲಿ ಮುಳುಗುವರಯ್ಯ!
ಮರನ ಕಂಡಲ್ಲಿ ಸುತ್ತುವರಯ್ಯ!
ಬತ್ತುವ ಜಲವನೊಣಗುವ ಮರನ
ಮೆಚ್ಚಿದವರು ನಿಮ್ಮನೆತ್ತ ಬಲ್ಲರು
ಕೂಡಲಸಂಗಮದೇವ



తెలుగు లిపిలో 

నీర కండల్లి ముళుగువరయ్య!
మరన కండల్లి సుత్తువరయ్య!
బత్తువ జలవనూణగువ మరన  
మెచ్చిదవరు నిమ్మనెత్త బల్లరు
కూడలసంగమ దేవ 

తెలుగు వచనం 

నీరు కనబడిన మునిగెదరయ్య! 
చెట్టు కనబడిన చుట్టెదరయ్య !
ఎండెడు జలమును, వాడెడు చెట్లను మెచ్చువారు, 
మిమ్ములనెట్లుజొచ్చెదరు  కూడలసంగమదేవ?

వచనకర్త ఆంతర్యం 
తరిగే అశాశ్వత వస్తువులపై నమ్మకముంచి, శాశ్వతుడైన పరమేశ్వరుని మరిచెడివారు ఆ శివున్ని చేరలేరు, తెలుసుకోలేరు.   

విశ్లేషణ 

వీరశైవధర్మము శివభక్తిని ఎంత గట్టిగా ప్రోత్సహించిందో అంటే గట్టిగా మూఢవిశ్వాసాలను నిరసించింది. యుగయుగాలలో పంచాచార్యులచే ప్రతీష్టింపబడి, పన్నెండవ శతాబ్దిలో బసవన్నచే పునర్వ్యవస్తీపరింపబడిన వీరశైవధర్మము మూఢవిశ్వాసాలను ఏనాడో ఖండించింది. కానీ మానసిక దౌర్బల్యాలవల్ల మనం ఇప్పటికీ కొన్ని పిచ్చినమ్మకాలను దూరం చేసుకోలేక పోతున్నాము. వీరశైవధర్మమును సరిగ్గా అర్థం చేసుకుంటే ఈనాటికి కూడా ఎంత ప్రగతిశీలదాయకమైనదో తెలుస్తుంది. ఒకవైపు భక్తిమార్గాన్ని ఆత్మజ్ఞానాన్ని నేర్పుతూ, ఇంకోవైపు మూఢవిశ్వాసాలతో జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా చూసుకునే ఉత్కృష్ట ధర్మమిది. హైందవ ధర్మములన్నింటిలో తలమాణికము.    

వీరశైవునికి భక్తి అనేది శాశ్వతుడు, నిత్యుడు, సర్వకారణుడు అయిన శివునిపై ఉంచుతారు; అల్ప ప్రయోజనాలను కలిగించే ఇతర వస్తువులపై, ఇతర దేవతలపై కాదు. శివదీక్షను పొందిన వారు ఇతర నమ్మకాలన్ని విడిచి కేవలం శివున్నే ఆశ్రయించాలి. తమ సంపూర్ణ నమ్మకాన్ని కేవలం శివభక్తిపై, గురుణాదత్తమైన ఇష్టలింగార్చనపైన మాత్రమే ఉంచాలి. ధరించిన శివలింగానికి పూజ మరిచి అల్పములైన వస్తువులపై నమ్మకములు, వంద గుళ్ళ చుట్టూ తిరిగినా, తీర్థాలలో మునిగినా, తమ స్వధర్మాన్ని విడిచి పరధర్మాన్ని ఆశ్రయించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.  

మనకు దీక్షాభంగము చేయడానికి సందుకో సన్యాసి దొరుకుతాడు. వాస్తు దోషాలని, గ్రహ దోషాలని, జాతక దోషాలని, దయ్యం పట్టిందని, రకరకాల కారణాలను చూపి భయపెడతారు. వాళ్ళు ధనాప్రయోజనాన్ని, పీడా విముక్తిని లేదా, ఇతర ప్రయోజనాలను చూపించి, ఏ చెట్టు చుట్టూ తిరగమనో, ఏ నదిలోనో, నీటిలో మునగమనో, ఏ తంత్ర పూజ చేయమనో, ఏ తాయత్తు ధరించమనో, ఏ జపం చేయమనో, ఏ రత్నం ధరించమనో ప్రోత్సహిస్తారు; చేయని పక్షంలో కలిగే నష్టాలను వివరిస్తూ భయపెడతారు. ఇలాంటివి ఆచరించడం ద్వారా కోరికలు, విషయవాంఛలు అల్పములైనవి తీరవచ్చునేమో! కానీ శివజ్ఞానం దూరమై వాటిచుట్టు తిరుగుతారు. సరైన గురువు సహాయం లేని వారు ఇలాంటి వాటికి  లోబడి నష్టపోతారు - ఆర్థికంగా కాదు, శివజ్ఞానపరంగా. ఇటువంటివి ఈ మధ్య మరీ ఎక్కువయ్యాయి. ఒక్కసారి దూరదర్శనాన్ని(TV) ప్రారంభిస్తే అందలో జ్ఞానసంబంధమైన విషయములకన్నా ఇటువంటి ముఢత్వాన్ని ప్రేరేపించే కార్యక్రమాలే ఎక్కువగా కనబడతాయి. అయితే కొందరు చదువుకున్న యువకులు కూడ ఇలాంటి మూఢవిశ్వాసాలకు దెగ్గరవుతున్నారు. మిగితావారు ధర్మమంటే  ఇలాంటి మూఢవిశ్వాసాలనే అపోహతో నాస్తికులై  భగవధ్భక్తి విశ్వాసాలకు దూరమవుతున్నారు.  ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేవారు భాగవత్భక్తి-శివజ్ఞానానికి, మూఢవిశ్వాసాలకు తేడా తెలియకుండా చేస్తారు. దానివల్ల అస్తికత్వమంటే ఇలాంటివి నమ్మడమని అపోహ కలిగుతుంది. దీనిని ఆసరాగా తీసుకొని నాస్తికులు కూడా చెలరేగిపోతారు - వారికి కూడ మూఢనమ్మకాలకు, భాగవత్భక్తికి మధ్య తేడా తెలియదు. ఇలా సగం తెలిసిన జ్ఞానంతో ఒకరితో ఒకరు వాదనలు -గందరగోళం!       

వీరశైవదీక్షలో ఉండే వారికి ఇటువంటి అన్యవిశ్వాసాలు నిషిద్ధము. కేవలం శివజ్ఞానము, శివసాయుజ్యములు మాత్రమే వారి లక్ష్యములు. నిత్య శివలింగార్చన చేసేవారిని, అష్టావరణములచేత సంరక్షిపబడేవారికి ఎటువంటి అంటూ, ముట్టు, గ్రహదోష, వాస్తుదోష, జాతకదోషములు అంటవు. ఇష్టలింగాన్ని అనునిత్యం ధరించిన వారిని, నిత్య శివమయులైన వారిని ఎటువంటి దోషములు అంటుకోవని వీరశైవ ధర్మము నొక్కి చెబుతోంది. అంతేగాక వీరశైవులు జ్యోతిష్యము, అపశకునాలు, రాహుకాలములు వంటివి పాటించరు. కాలకాలుడైన శివుని వారలము మనము; మనని కాలదోషములు ఏంచేస్తాయి? వీరశైవులకు భూత, పిశాచ బాధలు కూడా ఉండవు; సకల భూతనాథున్ని తమ హృదయంపై ధరించే వానిని ఏ భూతాలు పీడిస్తాయి? కాబట్టి వాళ్ళు వాటి ఉపశమన మార్గాల జోలికి కూడా వెళ్ళరు. జీవితం అందించే కష్టసుఖాలను సమంగా, శివ ప్రసాదములుగా భావించి స్వీకరిస్తారే తప్పవాటిని తప్పించుకోడానికి చిల్లర దైవాలకు, కర్మకాండలకు దూరంగా ఉంటారు.                 

చెట్లచుట్టు తిరగడం, నీళ్ళల్లో మునగడంవల్ల చిన్న ప్రయోజనాలు ఉండవచ్చుగాక! కాని అలాంటి  
వాటివల్ల కలిగే చిన్న ప్రయోజనాలను ఆశించి వాటిని ఆశ్రయించడం వంటివి వీరశైవము వ్యతిరేకిస్తుంది. గురు పాదోదకమును, ఇష్టలింగార్చన చేసిన ఉదకమును మించిన తీర్థము ఏ నదీ, ఏ తీర్థము అందించలేదు. ఇష్టలింగార్పితమైన నైవేద్యమును మించిన ప్రసాదము ఈ గుడిలోను దొరకదు. శివస్మరణతో ధరించిన భస్మాన్ని మించిన రక్షణ ఏ రత్నమో, రాయో, ఏ చెట్టో కలిగించలేదు. రుద్రాక్షను మించిన తాయత్తు ఏ జగములలోనూ లేదు. అన్నీ మన నిత్య ఆచారములైన అష్టవరణాలలో నిక్షిప్తమై ఉండగా ఇతరుల మాటలు విశ్వసించి మన ధర్మానికి దూరమవ్వడం అవివేకం కాదా? చిన్న ప్రయోజనాలను ఆశిస్తే చిన్న ప్రతిఫలములు లభించవచ్చునేమో! కాని శాశ్వత శివసాయుజ్యమనే మన లక్ష్యానికి దూరమవుతామని, అంటే శివున్ని తెలియజాలమని, ఇక్కడ బసవన్న చెబుతున్నారు.