కన్నడ వచనం
ಕೊಂಬೆಯ ಮೇಲಣ ಮರ್ಕಟನಂತೆ ಲಂಘಿಸುವುದೆನ್ನ ಮನವು
ನಿಂದಲ್ಲಿ ನಿಲಲೀಯದೆನ್ನ ಮನವು
ಹೊಂದಿದಲ್ಲಿ ಹೊಂದಲೀಯದೆನ್ನ ಮನವು
ಕೂಡಲಸಂಗಮದೇವಾ, ನಿಮ್ಮ ಚರಣ ಕಮಲದಲ್ಲಿ ಭ್ರಮರನಾಗಿರಿಸು ನಿಮ್ಮ ಧರ್ಮ
తెలుగు లిపిలో
కొంబెయ మేలణ మర్కటదంతె లంఘిసువుదెన్న మనవు
నిందల్లి నిలలీయదెన్న మనవు
హొందిదల్లి హొందలీయదెన్న మనవు
కూడలసంగమ దేవా, నిమ్మ చరణ కమలదల్లి భ్రమరనాగిరిసు నిమ్మ ధర్మ
తెలుగు వచనం
కొమ్మ మీద మర్కటమువలె లంఘించు నా మనసు
నిలువగ నిలువనీయదు నా మనసు
పొందుగ పొందికతోనుండదు నా మనసు
కూడలసంగమ దేవా, నీ చరణ కమలమందు భ్రమరముగామార్చు, అది నీ ధర్మము!!
వచనకర్త ఆంతర్యం
మనస్సుని అదుపులో పెట్టడం నాచే కానిపని. నీవే నీ ధర్మంగా స్వీకరించి నీ చుట్టూ తిప్పుకోవయ్యా!
విశ్లేషణ
ఈ వచనం బాగా అర్థం చేసుకోవాలంటే కొద్దిగా యోగ శాస్త్రంలో వివరించిన కొన్నితత్వాలను తెలుసు కోవాలి. మన శరీరం ఎలా పని చేస్తుందో ఎవరి అదుపులో ఉంటుందో ఆలోచించవలసి ఉంటుంది.
మనందరికీ పంచ జ్ఞానేంద్రియాలు (అంటే త్వక్, శ్రోత్ర, రసన, ఘ్రాణ, నేత్రములు వాడుక భాషలో చెప్పాలంటే చెవులు, చర్మము, నాలుక, కళ్ళు, ముక్కు అన్నమాట) ఉన్నాయి. వీటి వల్ల పంచ తన్మాత్రలను అనుభవిస్తాము ( అంటే శబ్ద స్పర్శ రస రూప గంధములు లేదా వాడుక భాషలో వినికిడి, స్పర్శ, రుచి, రూపము, వాసనలు).ఈ విషయాలను జ్ఞానేంద్రియాలు బయటి విషయాలను గ్రహించి లోపలికి చేరుస్తుంటాయి (అంటే Inputs అన్నమాట). వీటివల్ల తప్ప మనకి బయట ప్రపంచం నుండి ఏ విషయాలు తెలుసుకొనే మార్గం లేదు.
అలాగే పంచ కర్మేంద్రియాలు (అంటే వాక్కు, పాణి, పాదం, ఉపాస్త, పాయువుల వాడుక భాషలో కంఠము, చేతులు, కాల్లు, జననాంగములు, విసర్జనాంగములు) ఉన్నాయి. వీటితో మాట్లాడడము, పని చేయడము, అటు ఇటు వెళ్ళగలగడము, సంతానం కనడము, మలమూత్ర విసర్జనము జరుగుతాయి. ఈ కర్మేంద్రియముల ద్వారా మనము లోని భావాలను బయటకి వ్యక్తపరుస్తుంటాము (అంటే Outputs అన్నమాట). వీటివల్ల తప్ప ఇంకే విధంగా మనలని మనం వ్యక్త పరచలేము.
అయితే వీటన్నిటి వెనక ఉండేవి, మనకు కనబడనివి అంతఃకరణములు - ఇవి మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అనే నాలుగు.
- నేనున్నాననే చైతన్యమే 'చిత్తము'.
- నేను, నాది అని తలపించేదే 'అహంకారము'.
- తప్పొప్పులను ఆలోచింపజేసేదే 'బుద్ధి'.
- సంకల్ప వికల్పములకు ఆలవాలము 'మనస్సు'.
ఈ వచనమ్లో ప్రధానము మనస్సు గురించిన చర్చ. మనసెప్పుడు ఎదో చెయ్యాలి (సంకల్పం), ఏదో చేయకూడదు (వికల్పం) అని తలుస్తూ ఉంటుంది. ఉదాహరణకు, ఉన్నట్టుంది మొన్న వంకాయ కూర బావుండింది, మళ్ళి తినాలి అనిపిస్తుంది; కొనడానికి వెళ్ళారు. వెంటనే దానికన్నా ఈ దుకాణంలో బెండకాయలు ఇంకా బాగున్నాయి, వంకాయరేపు చెయ్యొచ్చులే అని ఇంకో అలోచన.
ఎప్పుడూ ఇది ఇష్టం, ఇది అయిష్టం అని చెబుతూ ఉంటుంది. చిన్న పిల్లలనుండి, ముసలివారి వరకు అందరిలోనూ మనసు చేసే పని ఇదే.
ఈ మనస్సు మనకి బహిరంగంగా కనబడకపోయినా ఎప్పుడూ పైన చెప్పిన జ్ఞానేంద్రియాల నుండి ప్రతిక్షణం సమాచారం స్వీకరిస్తూ, కర్మేంద్రియాలకు ఏమి చేయాలో సూచిస్తూ, ఇంద్రియాలనన్నింటిని ఈ మనస్సు పూర్తిగా తన అదుపాజ్ఞలలో ఉంచుకుంటుంది.
ఉదాహరణకు ఇంట్లో అంతా సంతోషంగా ఏదో మాట్లాడు తున్నారు. నా మనస్సు చికాకుగా ఉంది. వెంటనే ఎదో ఆలోచించకుండా అరిచేసాను - అంటే వాక్కు మనస్సు అధీనంలోకి వెళ్లి పోయింది. అక్కడ వాతావరణం మార్చేసాను; అది పరిణామాల తీవ్రతని ఆలోచించే విచక్షణ నా మనసుకి ఉండదు. ప్రతీ చోటా ఉండే పరిస్థితికి కారణం అక్కడ ఉండే వాళ్ళ మనస్సు యొక్క స్థితి మాత్రమే - అది సుఖమైన, దుఃఖమైనా, సంతోషమైన, ఏడుపైనా, భయమైనా, భ్రాంతైనా ఏదైనా సరే.
మనస్సు కొత్తకొత్త విషయాలను ఇంద్రియాల ద్వారా నేర్చుకుని, వాటిలో తనకు నచ్చిన వాటిని మళ్లి మళ్ళి కావాలని అడుగుతుంది. ఉదాహరణకు ఒక కొత్త వంట తిన్నారనుకోండి. ఇదివరకెప్పుడూ తినలేదు. కానీ నచ్చింది. మళ్లీ అది తినిపించమని మనస్సు ఇంద్రియాలను ఉత్సాహపరుస్తుంది. ఇలాంటి మనస్సుకు వశులమై మనము నిత్యం జీవితం గడుపుతున్నాము.
ఈ మనస్సుకి ఒక్క క్షణం కూడా తీరిక ఉండదు. నడుస్తున్నా, కూర్చున్నా, నిలబడ్డా, పడుకున్నా మనస్సుకు మాత్రం తీరిక ఉండదు. ఎపుడూ ఒకదాని తరువాత ఒకటి ఆలోచనలు, కోరికలే! అరే పది నిముషాలు శివ పూజకు కూచుంటే అప్పుడు కూడా ఏవో ఆలోచనలు - ఉద్యోగమని, పిల్లలకు ఎదో మరిచామని, ఇంకేదో చేయాలని. ఒక చోట నిలువదే?!
అందుకే మనస్సుని కోతితో పోల్చారు బసవన్న. ఇలాంటి చపలమైన కోతిలాంటి మనస్సు నా అదుపులో ఉండట్లేదు. దీన్ని పట్టడం నావల్ల కావట్లేదు. నీకే ఇస్తున్నాను, నీ పాదాలనే పువ్వులచుట్టు తుమ్మెదవలే తిప్పుకోవయ్యా అని అడిగారు. అంతే కాదు ఇది నీ ధర్మం అని శివుని ముందలి కాళ్ళకు బంధాలు వేసేసారు.
ఈ పోలిక కేవలం బసవన్నే కాదు. ఆదిశంకరులు కూడా అదే కోరారు, శివానందలహరిలో -
సదా మొహాటంవ్యా చరతి యువతీనాం కుచగిరౌ
నటత్యాశాశాఖాస్వటతి ఝటితి స్వైరమభితః ।
కపాలిన్భిక్షో మే హృదయకపిమత్యంత చపలం
ధృడ భక్త్యా భంద్వా శివ భవదధీన కురు విభో॥
ఎప్పుడూ యువతి మోహంలో వారి హృదయ స్థానాన్నిఆశిస్తూ తిరుగుతూ ఉంటుంది నామనస్సు. ఆశలనే కొమ్మలపై ఇష్టం వచ్చినట్లు అటు ఇటు దూకుతూ చంచలగా ఉంటుంది. అలాంటి అత్యంత చపలమైన ఈ మనస్సనే కోతిని నీ కపాలపు భిక్ష పాత్రలో వేస్తున్నాను. నువ్వు ధృఢభక్తి అనే తాడుతో కట్టి నీ అధీనంలో ఉంచుకోవయ్య శివా!!
ఒక నిజభక్తునికి భగవంతున్ని ఏమి కోరాలో తెలియాలి. అందుకే గురువులంతా మన స్థానంలో తమని పెట్టుకొని బోధించారు. ఒంకొకరి దౌర్బల్యాలను ఎత్తి చూపడంకన్నా బసవన్న ఇది తన దౌర్బల్యమని తనమీద వేసుకొని ఈ వచనంలో వేరొకరిని నొప్పించకుండా బోధిస్తున్నారు- మనస్సనే కోతిని శివునికి అర్పించుకోమని.
ఒక్కసారి మనస్సుని నిగ్రహించగల్గితే, ఇంద్రియాలన్నీ అదుపులో ఉంటాయి. చుట్టూ వాతావరణమంతా శివమయమవుతుంది. కాని అది మనతరం కాదు - చాలా కష్టం. కాబట్టి ఈ విషయాన్నీ గ్రహించి ఆ శివున్నే వేడుకుందాం.
శరణు శరణార్థి!!