Sunday, September 4, 2016

42. Andu Indu Mattondena Beda - Basavanna

కన్నడ వచనం

ಅಂದು ಇಂದು ಮತ್ತೊಂದೆನಬೇಡ,
ದಿನವಿಂದೇ ಶಿವ ಶರಣೆಂಬವಂಗೆ,
ದಿನವಿಂದೇ ಹರ ಶರಣೆಂಬವಂಗೆ,
ದಿನವಿಂದೇ ನಮ್ಮ ಕೂಡಲಸಂಗನ ಮಾಣದೆ ನೆನೆವಂಗೆ!
తెలుగు లిపిలో 

అందు ఇందు మత్తొందెన బేడ
దినవిందే శివ శరణంబవంగె
దినవిందే హరశరణంబవంగె
దినవిందే నమ్మ కూడలసంగన మాణదె నెనెవంగె! 


తెలుగు వచనం 

అప్పుడు ఇప్పుడు మరోదినమనకు
దినమిదే శివశరణంబనువానికి 
దినమిదే హరశరణంబనువానికి  
దినమిదే మన కూడలసంగని నమ్మి తలచిన వానికి!

అర్థము 

శివుని నమ్మిన వాడు శుభాశుభ దినములను లెక్కించడు. తలచిన దినమే కార్యాన్ని నిర్వహిస్తాడు 

విశ్లేషణ 

లగ్నవెల్లియదొ విఘ్నవెల్లియదొ ,ఎమ్మవరు బెసగొండరె శుభలగ్నవన్నిరయ్యా అనే గత రెండు వచనాలలో వీరశైవులు సమయాసమయముల విషయంలో ఎలాంటి వ్యవహారం కలిగి ఉండాలో చర్చించుకున్నాము. ఆ కోవకు చెందిందే ఈ వచనం కూడా.

మూఢ నమ్మకములకు వీరశైవులు సదా వ్యతిరేకులు. కేవలము శివునిపై మాత్రమే విశ్వాసము కలిగినవారు. దినములను లెక్కిస్తూ శుభఘడియలకోసం వేచి ఉండేవాడు ప్రయత్నం చేయకుండానే అవకాశాన్ని పోగొట్టుకునే పరిస్థితి కలుగవచ్చు. కొన్ని వందల సంవత్సరాల తరువాత వ్రాసిన కబీరుదాసు దోహా కూడా ఈ ప్రాతిపదికను అనుసరించేదే -

काल करे सो आज कर आज करे सो अब
पल में परलै होयगी बहुरि करेगा कब   

దినములు లెక్కించక, రేపు చేయవలసింది నేడు చేయి. నేడు చేయవలసింది ఇప్పుడే చెయ్యి. క్షణంలో ప్రళయం రావాచ్చు, మరి ఎప్పుడు చేస్తావు?   

ఇక్కడ వీరశైవులకు తమ శివభక్తిపైనుండవలసిన నమ్మకాన్ని పునరుద్ఘాటిస్తున్నారు. ఒక్కసారి శివున్ని శరణన్న వానికి ఏ దినమైన శుభదినమేనని. కాలకాలుడైన హరుని శరణన్న వాడు కర్తవ్యమును నిర్వహించునప్పుడు మరో దినముకై వేచియుండవలసిన పనిలేదు. ఇక ఇంత చెప్పిన తరువాత కూడా శుభదినము కొరకు వేచి ఉంటే, వానికి  కూడలసంగనిపై బలమైన నమ్మకము లేదనే కదా తెలియవలసింది?

శరణు శరణార్థి!!



    






Sunday, August 21, 2016

41. Emmavaru Besagondare Shubhalagnavannirayya - Basavanna

కన్నడ వచనం 
ಎಮ್ಮವರು ಬೆಸಗೊಂಡರೆ ಶುಭಲಗ್ನವೆನ್ನಿರಯ್ಯಾ,
ರಾಶಿಕೂಟ, ಋಣಸಂಬಂಧವುಂಟೆಂದು ಹೇಳಿರಯ್ಯಾ,
ಚಂದ್ರಬಲ ತಾರಾಬಲವುಂಟೆಂದು ಹೇಳಿರಯ್ಯಾ,
ನಾಳಿನ ದಿನಕಿಂದಿನ ದಿನ ಲೇಸೆಂದು ಹೇಳಿರಯ್ಯಾ,
ಕೂಡಲಸಂಗಮ ದೇವನ ಪೂಜಿಸಿದ ಫಲ ನಿಮ್ಮದಯ್ಯಾ

తెలుగు లిపిలో 
ఎమ్మవరు బెసగొండరె  శుభలగ్నవన్నిరయ్యా  
రాశి కూట ఋణ సంబంధవుంటిందు  హేళిరయ్యా 
చంద్రబల తారాబలవుంటిందు  హేళిరయ్యా
నాళిన దినికిందిన దిన లేసెందు  హేళిరయ్యా 
కూడలసంగమ దేవన పూజిసిద ఫల నిమ్మదయ్యా 

తెలుగు వచనం 
నీవాళ్ళు ఒప్పిననాడే శుభలగ్నమనవయ్యా 
రాశికూటములు, ఋణ సంబంధములు కలిసొచ్చెననవయ్యా 
తారాబలము చంద్రబలము కుదిరేననవయ్యా 
 రేపటి కన్నా నేడే లెస్సయననవయ్యా 
కూడలసంగమ దేవుని పూజించిన ఫలము నీదయ్యా !!

అర్థం 
శివశరణులతో సంప్రదించి నిశ్చయించిన తరువాత శుభలగ్నము వెంటనే వచ్చెనని తలవాలి. మంచిదినము అనేది మరల వెదకక్కర లేదు. శరణుడనెడి వాడు తమవారి మాటను వెంటనే నెరవేర్చాలి. పరమేశ్వరుని పూజించిన ప్రతిదినము శుభదినమే అవుతుందని, ఆ పూజ ఫలముగా దైవబలము, తారాబలము, చంద్రబలం, రాశులు, తిథివార నక్షత్రములన్ని అనుకూలముగా ఉంటాయని గట్టి నమ్మకంతో ఉండెడి వాడే నిజమైన వీరశైవుడు.      

విశ్లేషణ 

గతములో లగ్నవెల్లియదొ విఘ్నవెల్లియదొ అనే వచనంలో వీరశైవులు వర్జ్యకాలము, తిథివార నక్షత్రములను పట్టించుకోరని ప్రస్తావించుకున్నాము. అదే విషయాన్న బసవన్న ఈ వచనంలో చెబుతున్నారు. 

ఇక్కడ నీవాళ్లంటే "శివశరణుల"ని అర్థం చేసుకోవాలి. శరణులు నిర్ణయించిన పనిని నిర్వహించడానికి ఉత్సాహముతో, ఆతృతతో ఉంటాడు. మరుదినము కొరకు, శుభఘడియ కొరకు  వేచియుండక  ఈ రోజే శుభమని వెంటనే పనిని ప్రారంభిస్తాడు. ఒక్కసారి నిర్ణయించిన తరువాత తిథివారములు గాని, తారాబలము, చంద్ర బలములతో కూడిన ముహూర్తమునుగాని మరల లెక్కించ వలసిన పనిలేదు. నిత్యమూ శివారాధనతో నుండెడి వారాల మాటకు విఘ్నము కలిగించగల శక్తి ఏ గ్రహములోగని, ఏ రాశిలో గాని ఉండదు. "అన్నీ వీరశైవునికి అనుకూలంగా మారుతాయి" అనేది బసవన్న ప్రతిపాదన.  

ఒకవేళ విఘ్నము కలిగినా, శివార్పణా భావముతో కార్యాన్ని చేసే వీరశైవుడు అది శివేచ్ఛగా స్వీకరిస్తాడు తప్ప, ఇతర శక్తుల ప్రభావాన్ని ఎంచడు, వాటి జోలికిపోడు.    

పై వచనంలో "కూడలసంగమ దేవుని పూజించిన ఫలము నీదయ్యా!" అనే వాక్యము ముఖ్యము, "శివశరణుల నిర్ణయము" ముఖ్యము. నిత్య ఇష్టలింగ పూజ చేసే వారలకు మాత్రమే వర్తించే పద్ధతులివి - ఇతరులకు కాదు.  పైమూడు వాక్యాలు చదివి, తమకు అనుకూలముగా శివారాధను మరచి, తమ స్వప్రయోజనాలకై బసవన్న వచనాన్ని వాడుకునే నాస్తికులు కూడా ఉన్నారు..  జాగ్రత్త!! 

ముహుర్తాది విషయములు సామాన్య ధర్మమును పాటించు భవులకు సంబంధించినవి. కర్మకాండలను,సామాన్య ధర్మమును పాటించే వారికి అవి అవసరము- వారు పాటించుటలో తప్పులేదు. అత్యాశ్రమ ధర్మైన వీరశైవాన్ని స్వీకరించిన వారు తమ పూర్వకర్మలను త్యజించాలని ఖండితంగా చెప్పబడింది. 

అయితే ఈనాటి వీరశైవులము మన ధర్మమార్గము తెలియక, తెలిసినా వాటిపై సంపూర్ణవిశ్వాసములేక, లేదా ఏదైనా జరిగిపోతుందని భయముతో సామాన్య భవులవలే వ్యవహరిస్తున్నాము. మనకు మార్గ నిర్ధేశకులైన జంగమలను కూడా ముహూర్తాలను నిర్ణయించమని అడుగుతున్నాము. పూర్వకర్మలను కొనసాగించడం వలన శివపూజ వ్యర్థమని తెలియాలి. 

మన ధర్మము గురించి తెలియనివారు ఒక వేళ భయపెట్టినా , లేదా ఇటువంటి వాటిని ప్రోత్సహించినా, నిర్మొహమాటంగా అలాంటి సలహాలను పక్కన బెట్టవచ్చు. మనము ఇతరులను మన మార్గాన్ని పాటించమని ప్రాధేయపడడంలేదు; అలానే వారి మార్గాన్ని మన జీవనశైలిపై రుద్దు కోవలసిన అవసరంలేదు. 

సిద్ధాంత శిఖామణి (నవమ పరిచ్ఛేదం - 39వ శ్లోకము) ప్రకారము  

శివపూజాపరో భూత్వా పూర్వకర్మ విసర్జయేత్ 
అథవా పూర్వకర్మస్యాత్ సా పూజా నిష్ఫలా భవేత్ || 

శివపూజాపరుడైన వాడు తన పూర్వకర్మలను వదిలిపెట్టవలెను. అట్లుకాక పూర్వకర్మలను కొనసాగించినట్లయితే ఆ శివపూజ నిష్ఫలమవుతుంది. 

నిత్యశివారాధనలో ఉంటూ శివేతరశక్తులేవో శివసంకల్పానికి అడ్డు పడతాయేమోననుకోవడము అవివేకము, తానుచేసే పనిలో విశ్వాసము  లేకపోవడమే అవుతుంది. అటువంటి విశ్వసములేని పూజ వ్యర్థమే కదా? అసలు ప్రపంచములో శివేతరశక్తులే లేనప్పుడు ఏ శక్తి శివకార్యమునకు అడ్డుపడగలదు? అనే ఆత్మవిశ్వాసముతో  సాగేవాడే నిజమైన వీరశైవుడవుతాడు. 

శరణు శరణార్థి!!

 


   

Sunday, August 14, 2016

40. Lagnavelliyado Vighavelliyado Sangayya? - Basavanna

కన్నడ వచనం
ಲಗ್ನವೆಲ್ಲಿಯದೊ  ವಿಘ್ನವೆಲ್ಲಿಯದೊ ಸಂಗಯ್ಯ?
ದೋಷವೆಲ್ಲಿಯದೊ ದುರಿತವೆಲ್ಲಿಯದೊ ಸಂಗಯ್ಯ?
ನಿಮ್ಮ ಮಾಣದೆ ನೆನೆವವಂಗೆ ಭವಕರ್ಮವೆಲ್ಲಿಯದೊ ಕೂಡಲ ಸಂಗಯ್ಯ?

తెలుగు లిపిలో 
లగ్నవెల్లియదొ విఘ్నవెల్లియదొ సంగయ్య?
దోషవేల్లియదొ దురితవెల్లియదొ సంగయ్య?
నిమ్మ మణదె నేనెవవంగె భావకర్మవెల్లియదొ కూడల సంగయ్య?   

తెలుగు వచనం
లగ్నమెక్కడిదో విఘ్నమెక్కడిదో సంగయ్య?
దోషమెక్కడిదో దురితమెక్కడిదో సంగయ్య?
మిమ్ములను మానక తలచువానికి భవకర్మమెక్కడిదో కూడల సంగయ్య?


వచనకర్త ఆంతర్యం 

పరమేశ్వరుని నిత్యమూ తలుస్తూ మైమరచి వర్తించే వీరశైవ శరణునకు శుభాశుభములు గాని, దోషములు, పాపములు గాని అంటవు. 

విశ్లేషణ 

వీరశైవధర్మానువర్తనులైన వారు కర్మపాశములు తమకు అంటవనే  ప్రగాఢవిశ్వాసముతో ఉంటారు. 
జగత్తులోని సమస్తము పరమేశ్వరుడైన శివుని సంకల్పము వల్ల జరిగే నిర్మాణమని, శివుని వల్లే నడుస్తుందని, శివునిలోనే పుట్టి శివునిలోనే లయమవుతూ ఉందని, శివేతరమైనదేది ప్రపంచములో లేదని గట్టిగా నమ్ముతారు. 

సృష్టికి పూర్వము ఎలాంటి వికారములు లేని నిర్గుణ బ్రహ్మమైన శివుడు మాత్రమే ఉండే వాడు. ఆతను తన స్వతంత్రమైన ఇచ్ఛతో తనలోనుంచే శక్తిని ప్రకటించుకొని  సృష్ట్యారంభం చేసాడని వీరశైవ సిద్ధాంత శిఖామణి వివరిస్తోంది. 

ఈ శక్తి వైశిష్టుడైన శివుడే విశ్వంలో మూడు రూపాలలో మారిపోతాడు. 
1. భోజ్యము - అనుభవించబడే జడ పదార్థము. ఉదాహరణకు మట్టి, రాళ్ళూ, నీరు, చెట్లు వంటివి అన్న మాట, 
2. జీవుడు - ఇతడు చైతన్యము కలిగిఉన్నా తాను శివుడననే నన్న విషయము మరచి, విషయ ప్రపంచములో మునిగి, అవిద్య అనే మాయతో కప్పబడిన జంతువు 
3.  మహేశ్వరుడు - మహామాయని తన వశములో ఉంచుకొని దానివల్ల ఏ విధంగానూ ప్రభావితము కాకుండా జీవులను ప్రపంచాన్ని నడిపించే వాడు. 
దీని ప్రకారము కాబట్టి ప్రపంచములోని ఏ పదార్థమైనా శివుడే అయి ఉన్నది!! 

అయితే ఇలా ప్రారంభమైన సృష్టి తదనంతరము రకరకాలుగా మారిపోయింది - ఆకాశము, నక్షత్రాలు, గ్రహాలు, భూమి, నీరు, చెట్లు -చేమలు వంటి జడ ప్రపంచము ఒకటైతే, దేవ, దానవ, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష, పశు, పక్షి, జంతు, మానవాది జీవులుగా మరో విధంగా క్రమంగా పరిణామము చెందింది. 

వీరశైవేతరులు, ఈ విధంగా పరిణమించిన ప్రపంచాన్ని విడివిడిగా రకరకాలైన రూపంలో దర్శించి వాటిలో తమకు నచ్చిన చిన్న చిన్న శక్తులను తమ కోరికలను తీరుచుకోవడానికి ఆరాధిస్తారు. తాము చేసే కార్యము ఏదైనా కూడా స్వప్రయోజనమును ఆకాంక్షించి చేస్తారు. ఉదాహరణకు ఒక పూజ చేస్తే ఎదో ఒక "కార్య" సిధ్యర్థం అని సంకల్పంతో చేస్తారు. ఫలము ఆకాంక్షిస్తున్నాడు కాబట్టి అట్టి కర్మల ఫలితము పాపమైనా, పుణ్యమైనా ఆ జీవునికి అంటుకుంటుంది. ఈ కర్మ చక్రములో జీవుడు మరణించిన తరువాత కూడా ఈ పుణ్యపాపముల ఫలితములు అనుభవించడానికి మళ్ళీ ఇంకో జీవునిగా పుట్టవలసి వస్తుంది. కొన్ని సార్లు మానవ జన్మ కూడా లభిస్తుంది.  ఆత్మజ్ఞాన మార్గదర్శనం లేని మానవులు తమ కర్మలను అలానే కొనసాగిస్తూ  జీవన్మరణ/కర్మ చక్రంలో తిరుగుతూ ఉంటారు. అటువంటి వారిని "భవులు" అంటారు.  భవులు తమకు పరిస్థితులు సానుకూలంగా ఉండడానికి, విషయ వాంఛలు తీర్చుకోడానికి యజ్ఞయాగాది కర్మలు, గ్రహ శాంతి, దోష నివారణ, పాప పరిహరణకు వ్రతాలూ, పూజలు, శుభ ముహూర్థం, వర్జ్యము వంటి సమయాసమయ భేదములు, అంటూ, శౌచము వంటి పద్ధతులను సంప్రదాయంగా పాటిస్తారు.  ఎందుకంటే వారిది  కర్మ మార్గజీవనశైలి ; ఇది తప్పు అని అనడం లేదు  - వారికి  అవి అవసరం.  

ఇక  ఆత్మజ్ఞాన విచారణ, గురులింగజంగమ సంబంధముతో ముముక్షువులైన  వీరశైవులు మాత్రం ప్రపంచాన్ని విడివిడిగా గాక శివుడనే భావనతో చూడడం నేర్చుకుంటారు. ఏ కర్మ చేసిన ఎదో ఫలితం పొందాలనే ఆశతో కాక శివార్పణ భావంతో చేస్తారు- దీనివల్ల వీరికి కర్మ ఫలాలు అంటవు. నిత్య శివపూజ తప్ప ఏ వ్రతాలూ పాటించరు; అగ్నిష్టోమాది క్రతువులకు దూరంగా ఉంటారు. ప్రాపంచిక సుఖప్రయోజన ఫలాలను పొందే ప్రయోజనాధ్యేయంతో ఏ పూజలు చేయరు.  వీరికి సర్వశక్తిమంతుడైన శివుడు తప్ప ఇతరాత్ర దేవతలు ఎవ్వరు రుచించరు.
ఇటువంటి ఆచారముతో ఉంటూ భవి మార్గములకు దూరంగా ఉండే వీరశైవులకు -
- సర్వము శివస్వరూపమైనప్పుడు ఇక అంటు-ముట్టు లెటువంటివి? అయితే దీనర్థం పరిశుభ్రతతో ముడిబెట్టేరు సుమా! - నిత్యం త్రిసంధ్యలలో స్నానముతో కూడిన శివ పూజా విధానము వీరశైవులకు నియమంగా ఉంది. ఇంట్లో మరణంగాని , పిల్లలు పుట్టినప్పుడు గాని, నెలలు మొదలైన అంటులను వీరశైవులు పాటించడం కూడదని, అందరు అన్ని పరిస్థితులలోను ఇష్టలింగారాధన విడువరాదని ఖచ్చితంగా చెప్పబడింది. 
- కాలము కాలకాలుడైన శివుని సృష్టి అయినప్పుడు, శుభలగ్నము,వర్జ్యము ఎక్కడిది? అందుకే వీరశైవులు పంచాగం, వర్జ్యాలను పాటించరు.  
- అన్ని దిక్కులు శివుని ముఖములైనప్పుడు, వాస్తుదోషమెక్కడిది? ప్రాపంచిక సుఖదుఃఖములు శివ ప్రసాదంగా భావించి అనుభవించే వీరశైవులను గ్రహదోషాలు ఎలా బాధిస్తాయి?  కాబట్టి తిథి, వార, నక్షత్ర, వర్జ్యమూల వంటి కాలదోషములను వీరశైవులు పట్టించుకోరు. గ్రహశాంతి, వాస్తుదోషము, శుభాశుభ శకునములు వంటి భవ సంప్రదాయములను వీరశైవులు పాటించరు. 

నిత్య శివమార్గములో నిమగ్నులై, శివానుభవులై కర్మలకు దూరమై పాపపుణ్యములను త్యజించి జీవన్ముక్తులయ్యెడి వారు వీరశైవ శరణులు. బసవన్న ఈ విషయాన్నే ఈ వచనంలో ప్రస్తావించారు.  

శరణు శరణార్థి !!  



Tuesday, April 12, 2016

39. Nelavonde Holageri Shivalayakke - Basavanna



కన్నడ వచనం 

ನೆಲವೊಂದೆ ಹೊಲೆಗೇರಿ ಶಿವಾಲಯಕ್ಕೆ
ಜಲವೊಂದೆ ಶೌಚಾಚಮನಕ್ಕೆ
ಕುಲವೊಂದೆ ತನ್ನ ತಾನರಿದವಂಗೆ
ಫಲವೊಂದೆ ಷಡುದರುಶನ ಮುಕ್ತಿಗೆ
ನಿಲವೊಂದೆ ಕೂಡಲಸಂಗಮದೇವಾ ನಿಮ್ಮನರಿದವಂಗೆ !!


 తెలుగు లిపిలో 
నెలవొందె హొలగేరి శివాలయక్కె 
జలవొందె శౌచాచమనక్కె   
కులవొందె తన్న తానరిదవంగె 
ఫలవొందె షడుదరుశన ముక్తిగె 
నిలవొందె కూడలసంగమదేవా నిమ్మనరిదవంగె !!

తెలుగు వచనం 
నెలవొక్కటే మాలవాడ శివాలయములకు 
జలమొక్కటే శౌచాచమనములకు
కులమొక్కటే తమ్ముతామెరిగిన వారలకు 
ఫలమొక్కటే షట్-దర్శన ముక్తికి 
నిలవొక్కటే కూడలసంగమదేవా, నిన్నెరిగిన వారలకు!!

వచనకర్త ఆంతర్యం  
జ్ఞానులైన వారలు జాతిమత బేధములను, ఉచ్చనీచములను ఎంచక అందరిని ఒకే దృష్టి కోణంలో చూస్తారు. కేవలం శివునెరుగుటకు మాత్రమే ప్రయత్నము చేస్తారు.  

విశ్లేషణ 

తెలుగునాట ఈ వచనం చదవగానే అన్నమయ్య కవిత గుర్తుకు రాక మానదు. 

నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియూ నొకటే 
మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి యొకటే, చండాలుడుండేటి సరిభూమి యొకటే 

అని అన్నమయ్య పదిహేనవ శతాబ్దంలో వ్రాసిన పదకవితకు, బసవన్న పన్నెండవ శతాబ్దములో చాటిన ఈ వచనమే ప్రేరణ అనుకోవడంలో అతిశయోక్తి ఏమీ ఉండదు. 

భారతావనిలో వర్ణవ్యవస్థ స్వార్థపరుల అహంకారాలవల్ల పెడదోవ పట్టి, సమాజంలో హెచ్చు తగ్గులు విపరీతంగా పెరిగి, జాతిని ముక్కలు చేసి, ధర్మాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉంటే ఇది తప్పని మొదటిసారి విప్పుకున్న గళం బసవన్నది. వీరశైవుల సామాజిక సమానత్వ ఉద్యమము చరిత్రలోనే మొదటి క్రాంతిగా పరిగణింపబడింది.  ఆ తరువాత ఎన్నో దేశాలలో క్రాంతి ఉద్యమాలు (French Revolution, Russian Revolution, American Revolution లాంటివి) జరిగాయి. 
అయితే ఈనాడు ఇటువంటి విషయాలను ఎవరు పడితే వాళ్ళు మాట్లాడడం సర్వసామాన్యం. కొందరు వర్ణవ్యవస్థను తిడుతూ బసవన్న పేరు వాడుకోవడం కూడా చూస్తుంటాము. కానీ పరిశీలిస్తే ఒక వ్యత్యాసం ఉంది. బసవన్న వర్ణవ్యవస్థను వ్యతిరేకించి అందరినీ ధర్మము వైపు, భక్తి వైపు మళ్ళించారు. ఈనాటి "సంఘ సంస్కర్తలు"గా పిలిపించుకునే వారు జనాలను భక్తికి, ధర్మానికి దూరంగా తరలిస్తున్నారు. కాబట్టి తస్మాత్-జాగ్రత్త!! భగవంతునికి, భక్తికి దూరంగా ఉంచే ఏ విషయమైన వీరశైవులకు పనికిమాలిన సిద్ధాంతమే. 

ఇక వచనంలోకి వస్తే -

నెలవొక్కటే మాలవాడ శివాలయములకు
శివాలయమైనా, మాలవాడైనా నెలవైనది ఒకే నేలపైన. నేలకు అంటూ లేదు. అది మానవ కల్పితము మాత్రమే. 

జలమొక్కటే శౌచాచమనములకు
శౌచానికి (అంటే శుభ్రపరచుకోడానికి) వాడే నీరు, ఆచమనము చేయడానికి వాడే నీరు ఒకటే. అంటే నీటికి అంటు లేదు. 

కులమొక్కటే తమ్ముతామెరిగిన వారలకు
తానేమిటో తెలుసుకున్న వానికి, అంటే ఆత్మజ్ఞానము  కలిగి "నేనూ" అనేది శివుడే అని  తెలుసుకొని "శివోహం "అనే భావంతో మెలిగే వానికి ప్రపంచమంతా శివుడే.  అంటే అన్ని ప్రాణులలో, అన్ని దిశలలో, దశలలో, స్థావర జంగమాలన్నింటిలో (అంటే కదలనివి, కదిలేవి) వాటి నిర్మాణానికి అవసరమైన ముడిపదార్థమైన శివుడే దరిశనమిస్తాడు. వీరశైవ ధర్మము ఈ ఆత్మజ్ఞానాన్ని , శివజ్ఞానాన్ని ఆర్జించడమనే ఏకైక ధ్యేయము కలది. ఈ జ్ఞానానికి దూరము చేసే ఏ పద్ధతినిగాని, ఏ శాస్త్రాన్ని గాని, ఏ కర్మను గానీ వీరశైవము పట్టించుకోదు. ఇక అంతటా శివుని చూసేవానికి కులమెక్కడిది?

ఫలమొక్కటే షట్-దర్శన ముక్తికి
ముందు షడ్డర్శనముల గురించి క్లుప్తంగా చర్చించుకుందాం.  ఋషులు ఆరు రకాలైన సిద్దాంతాలను దర్శించి రూపొందించారు. వారి (దివ్య) దృష్టికి అందాయి కాబట్టి అవి దర్శనాలు అనబడ్డాయి.  ఈ ఆరు కూడా ఆ కాలంలో ప్రాచుర్యంలో ఉండేవి. ఈనాటి హైందవ ధర్మములో అన్నీ కలగొలుపుగా కనబడతాయి. 

మొదటిది గౌతమ మునిచే దర్శించబడిన "న్యాయ", లేదా తర్క శాస్త్రము. ఇది ప్రత్యక్షము, ఉపమానము, అనుమానము, శబ్దము అనే నాలుగు "ప్రమాణాల"తో ఈశ్వర నిరూపణము చేస్తుంది. ప్రమాణంతో నిరూపించడమే న్యాయ శాస్త్రము. 

రెండవది కణాదుడు దర్శించబడిన "వైశేషిక" సూత్రము. ఇక్కడ పరమాణువుల సంయోగముతో మహేశ్వరుని ప్రేరణతో విశ్వములోని ఏ పదార్థమైనా ఏర్పడుతుందని నమ్మే శాస్త్రము. మహేశ్వరుని నుండి ఉద్భవించిన  బ్రహ్మ  సృష్టి కార్యము నెరవేరుస్తాడని, లయ చేయవలసి వచ్చినప్పుడు  బ్రహ్మ మహెశ్వరునిలో లయమై, ఆ తరువాత ఈశ్వరుడు ప్రతీపదార్థన్ని పరమాణువులుగా లయము చేస్తాడని విశ్వాసము. 
 
మూడవది కపిల మునిచే దర్శించబడిన "సాంఖ్య" శాస్త్రము. ప్రకృతి, పురుషులను ప్రతిపాదించే తత్వము ఇది. ప్రకృతిలోని సత్వ, రాజస్, తమో గుణముల సమతుల్యము చెదిరినప్పుడు పురుషుడు తన ఉనికిని కలిగి ఉంటాడని, పురుషుడు తన నిజ స్వరూపమైన శివ తత్వమును ఎరిగిననాడు, ప్రకృతిలో కలిగిన వికారము తాను కానని ఎరిగి కైవల్యము పొందుతాడని విశ్వాసము.  

నాల్గవది పతంజలి మునిచే దర్శించబడిన "యోగ" శాస్త్రము. ప్రకృతి, పురుషుడు, ఈశ్వరుడు అనే మూడింటిని ప్రతిపాదించి యోగమార్గము చేత "ఆత్మయే ఈశ్వరుడ"ని తెలుసుకొని, దర్శించుకొని సమాధి స్థితి ద్వారా నిర్వాణము అనగా ముక్తి పొందటము ఇక్కడ ధ్యేయము. 

ఐదవది జైమినిచే దర్శించబడిన "పూర్వమీమాంస" లేదా కర్మమీమాంస. ఇక్కడ వైదిక కర్మలచేత ఆరాధన, అగ్నిష్టోమాది క్రతువులు చేయడం, మంత్రములచేత ఉపాసన వీరి నమ్మకము. వర్ణశ్రమాలు పాటిస్తారు. కర్మకాండను పూర్తిగా నమ్ముతారు. వీటిచేతనే తరించగలరని వీరి విశ్వాసము. 

ఆరవది బాదరాయణునిచే దర్శింపబడిన "ఉత్తరమీమాంస" లేదా  "వేదాంతము". వీరు వేదములోని కర్మకాండకు కాకుండా ఉపనిషత్తులకు ప్రాముఖ్యము ఇస్తారు. ఆత్మ, పరమాత్మ, మాయ వంటి విషయముల చుట్టూ చర్చ జరుగుతుంది.  "జ్ఞాన" మార్గాన్ని ప్రతిపాదిస్తారు. ఈనాటి ద్వైత, అద్వైత,విశిష్టాద్వైత, శక్తివిశిష్టాద్వైతములన్నీ వేదాంత ప్రతిపాద్యములే. ఇక్కడ కూడా అహం బ్రహ్మాస్మి, శివోహం, తత్వమసి అనే భావం జ్ఞానమార్గము ద్వారా ఎరిగి సచ్చిదానంద స్థితి పొందడము ఉద్దేశ్యము. 

ఈ ఆరు సిద్ధాంతాలలో కొన్ని పరస్పర వైరుధ్యాలు కనిపించినా, కొన్ని అంగీకారాలు కనిపించినా, వీటి ధ్యేయము మాత్రము ఒక్కటే - 1. పరమేశ్వరుని తత్వ ప్రతిపాదన, 2.జీవుని స్వరూపము, 3. జగత్తు యొక్క నిర్మాణము, 4. మోక్ష మార్గము. 
ఈ దర్శనాలలో ఏ మార్గాన్ని విశ్వసించినా అన్నింటి ఫలము మోక్షము మాత్రమే అని బసవన్న నాలుగవ వాక్యము. 

నిలవొక్కటే కూడలసంగమదేవా, నిన్నెరిగిన వారలకు
ఇది  అన్నిటికన్నా ముఖ్యమైన ప్రతిపాద్యము. ఎన్ని ఎరిగినా, ఎన్ని తెలుసుకున్నా, ఎంత గొప్పవారలైనా  నిలకడ కనిపించదు; ఎప్పుడూ ఏదో తాపత్రయము, అశాంతి. నిలకడ కలిగిన స్థానము శాంతి స్థానము కేవలం పరమేశ్వరుడు  ఆ కూడల సంగమున్ని తెలుసుకున్న వాని స్థానము మాత్రమే. అన్ని మార్గాలను, వైషమ్యాలను వదలి పరమేశ్వరుని తెలుసుకోవడమే పరమధ్యేయమై వీరశైవులు ఉండాలని బసవన్న బోధ. 

శరణు శరణార్థి!! 






    





Sunday, January 17, 2016

37. Sara Sajjanara Samgava Maduvudu & 38. Sara Sajjanara Lesu Kandayya


కన్నడ వచనాలు 
37
ಸಾರ ಸಜ್ಜನರ ಸಂಗವ ಮಾಡುವುದು
ದೂರ ದುರ್ಜನರ ಸಂಗ ಬೇಡವಯ್ಯಾ
ಆವ ಹಾವಾದಡೇನು ವಿಷವೊಂದೇ, ಅಂಥವರ ಸಂಗ ಬೇಡವಯ್ಯಾ
ಅಂತರಂಗಶುದ್ಧವಿಲ್ಲದವರ ಸಂಗ
ಸಿಂಗಿ ಕಾಳಕೂಟ ವಿಷವೋ
ಕೂಡಲ ಸಂಗಮದೇವಾ'

38 ಸಾರ ಸಜ್ಜನರ ಸಂಗ ಲೇಸು ಕಂಡಯ್ಯಾ,
ದೂರ ದುರ್ಜನರ ಸಂಗವದು ಭಂಗವಯ್ಯಾ.
ಸಂಗವೆರಡುಂಟು:ಒಂದ ಹಿಡಿ, ಒಂದ ಬಿಡು,
ಮಂಗಳಮೂರ್ತಿ ನಮ್ಮ ಕೂಡಲಸಂಗನ ಶರಣರ

తెలుగు లిపిలో 


సార సజ్జనర సంగవ మాడువుదు 
దూర దుర్జనర సంగ బేడవయ్యా 
ఆవ హావాదడేను విషవొందే, అంథవర సంగ బేడవయ్యా 
అంతరంగశుద్ధవిల్లదవర సంగ 
సింగి కాళకూట విషవో కూడలసంగమ దేవా 

సార సజ్జనర సంగ లేసు కండయ్యా 
దూర దుర్జనర సంగవదు భంగవయ్యా 
సంగవెరడుంటు: ఒంద హిడి, ఒంద బిడు,
మంగళమూర్తి నమ్మ కూడలసంగన శరణర 
  

తెలుగు వచనాలు 

సకల సజ్జనుల సంగము చేయుము 
దూరమెరిగి దుర్జనుల సంగము వలదయ్యా 
ఏ పామైననేమి విషమొక్కటే, అటువంటి సంగము వలదయ్యా
అంతరంగశుద్ధి లేనివారి సంగమున కల్గునది కాలకూట విషమే కూడలసంగమ దేవా!

సకల సజ్జనుల సంగము చేసుకొండయ్యా 
దూరమెరగు, దుర్జనుల సంగమది భంగమయ్యా 
సంగమిరువిధములైయుండు: ఒకటి పట్టు, మరియొకటి విడు
పట్టు మంగళమూర్తి మా కూడలసంగని శరణుల

వచనకర్త ఆంతర్యం  
మంచివారితో స్నేహము ప్రయత్నపూర్వకముగా చేయవలసినది. అంటే  ప్రయత్నపూర్వకంగా చెడు సహవాసము విడువవలసినది. చెడుస్నేహము వల్ల పుట్టునది కాలకూట విషమేనని తెలియవలెను. తెలిసి తెలిసి పాముతో ఆడుకోముగదా? కూడలసంగముని నిజమైన శరణులు అతని వలెనే పవిత్రులు, నిష్కల్మషులు, మంగళప్రదులు అయి ఉంటారు. అటువంటి వారితో సహవాసము చేయాలి. 


విశ్లేషణ 

ఒకే పరమార్థముతో ఉన్న ఈ రెండు వచనాలను ఇక్కడ కలిపి చర్చించుకుందాము. 

ఆరు నెలల సహవాసముతో వీరు వారవుతారనే నానుడి తెలుగువారందరూ వాడుతారు. ఒక మనిషి యొక్క ప్రవర్తన తన చుట్టూ ఉండే వాతావరణాన్ని బట్టి మారే అవకాశం చాలా ఎక్కువ. ఉదాహరణకు ఒక ప్రాంతం వారు ఇంకో ప్రాంతానికి మారినప్పుడు ఇతరుల ప్రభావం వారు వాడే భాషపై, ఉపయోగించే పదాలలో కేవలం కొన్ని రోజుల్లో కలగడం గమనిస్తాము. పిల్లలయితే ఇంకా ఎక్కువ - వారి స్నేహితుల సమూహంలో కలిసి తిరగడానికి తమ ఇష్టాలను కూడా ఇతరుల ప్రభావంతో మార్చేసుకుంటారు - వారి నడవడి, వస్త్రధారణ, భాష వంటివి అన్నీ మార్చేసుకుంటారు. 
రాను రాను మనస్సుకు కూడా అదే అలవాటై పోతుంది. అయితే ఈ మార్పు రాను రాను సమాజం యొక్క పారంపరిక వ్యవస్థను నిత్యం ప్రభావితం చేస్తూ పద్ధతుల్ని సంపూర్ణంగా మార్చి, వారు చేసే మామూలు పనులుకూడా చేయడానికి జంకే పరిస్థితి కలిగిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. పంచ కట్టుకోవడం కొన్నివేల తరాలుగా మన సమాజంలో పాటించే పద్ధతి. మరి గత రెండు తరాలలో జరిగిన పరిణామాల వల్ల ఇప్పుడు మనలో ఎంతమందికి పంచ కట్టుకోవడం తెలుసు? పోనీ కట్టుకోవడానికి నామోషీ ఎందుకు? మన చుట్టూ ఉండే వ్యవస్థ ప్రభావమే కదా? ఒకవేళ కట్టుకుంటే వెంటనే ఎవరో ఒకరు 'ఒచ్చాడండి పూజారి' అని వెక్కిరిస్తారు; దీనికి భయపడి మనస్సు ముందుగానే వద్దని వ్యతిరేకిస్తుంది. ఈ ఉదాహరణలో ఎటువంటి మంచిచెడులు ప్రస్తావించడం లేదు. కేవలం మన మనస్సుపై మన చుట్టూ ఉండే వారి ప్రభావము యొక్క తీవ్రతను అలోచించడానికి మాత్రమే ఈ ఉదాహరణలు.
  
ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ రెండు వచనాలలో కూడా సజ్జనుల (అంటే మంచివారి) స్నేహం చేయాలనేది మొదటి ప్రస్తావన. దుర్జనుల (అంటే చెడ్డవారి) ను పసిగట్టి వారికి దూరముగా ఉండమని రెండవ ప్రస్తావన. రెండూ ముఖ్యమే. అయినా మొదటి వచనంలో చెడ్డవారికి ఎందుకు దూరంగా ఉండాలనేది కొంచం ఎక్కువగా చెప్పబడింది. చెడ్డవారి సంగము పాముతో ఆడినంత ప్రమాదకరము అని చెప్పబడింది. చెడు సహవాసంలో ఉన్నప్పుడు మనకు జ్ఞానేంద్రియాల (కన్ను, చెవులు, ముక్కు, చర్మము, నాలుకలు)  ద్వారా చెడు విషయాలే అంతరంగం లోపలికి పోతాయి. అంటే మనస్సు ఎప్పుడూ చెడు విషయాలు చూస్తూ, చెడు మాటలు వింటూ, చెడు వాతావరణంలో అవసరము లేకపోయినా స్పృశిస్తూ గడప వలసిన కర్మ. రానురాను ఇవి తప్పని అనిపించక పోవచ్చు. 
ఉదాహరణకు రోజూ మద్యం తాగే పది మందితో సహవాసంలో ఉన్నారనుకోండి. కొన్నాళ్ళకి వారితో గడపడానికి వారితో కలిసి తాగడం అలవాటు కావచ్చు. లేదు నిభాయించుకున్నా, పోను పోను వారు చేసేది తప్పనే భావన తరిగి పోతుంది. ఉదాహరణకు ఇదివరకు మద్యం తాగడం సినిమాలలో ఒక ప్రతినాయకుని(villian) అలవాటుగా చూపించే వారు. ఇప్పుడు సమాజంలో మద్యంపట్ల మారిన ధృక్పదాన్ని బట్టి నాయకుడు(hero) కూడా అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడు చూసినా   తాగడం చూపిస్తున్నారు; ప్రభుత్వం వారు పైనుండి హెచ్చరిక వేయాల్సి వస్తోంది. ఇలా చెడునితప్పు కాదని పొరబాటు పడడం చాలా సులభంగా తెలియకుండానే జరిగి పోతుంది, సమాజపరంగా కూడా.  కొంత మంది ధృడ మనస్కులు లేకపోలేరు. మేము ఎక్కడున్నా మా మంచి పద్ధతులపై ప్రభావము లేకుండా చూసుకుంటాము అనుకునే వారు, దాన్ని పాటించే వారు కూడా. మేము కలిసి తిరిగే వారు చెడ్డ వారైనా తప్పదు; వారితో ఉండాలి అనుకునేవారు. అయితే ఇలాంటి వారూ ఒక్కసారి ఆలోచించండి - చెడుని చూస్తూ, దానిలో పాలు పంచుకోకుండా మీరు తమాయించు కున్నంతగా మీ ఇతర కుటుంబ సభ్యులు, పిల్లలు తమాయించుకోగలరని నమ్మకముతో చెప్పగలరా? అందుకే దుర్జనులకు దూరముగా ఉండమనేది. "పాము ఎటువంటిదైన విషము ఒక్కటే" అంటే ఇదే. 
కర్ణుడు స్వతహాగా చాలా మంచివాడు. దాన గుణశీలుడు. మంచి చెడుల నిర్ణయం చేయగలిగిన వాడూనూ. అయితే ఇచ్చిన వాగ్దాననికి కట్టుబడి దుర్యోధనునితో స్నేహం చేయవలసి వచ్చింది. దాన్నే ధర్మంగా భావించి అతనికి తోడుగా నిలిచాడు. చెడు సహవాసంవల్ల మంచివాడైనా దుష్టచతుష్టయంలో ఒకడైనాడు. వారి కుతంత్రాలలో తనకు అవసరం లేకపోయినా పాల్గొన వలసి వచ్చింది. ఇదే "చెడు సహవాసంలో కాలకూటమే పుడుతుంద"నడంలో ఆంతర్యం.  ఈ చెడు సహవాసం వల్లనే ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో నోరు జారాడు. ఆ తప్పు వల్లనే శిక్షింప బడ్డాడు. 


ఇక రెండవ వచనంలో సంగము రెండు విధములుగా వర్ణించారు. ఒకటి పట్టవలసిన సంగము. రెండవది విడువవలసిన సంగము. విడువవలసిన సంగము గురించి పైన చర్చించాము. మరి పట్టవలసిన సంగము తెలుసుకోవడం ఎలా? అంటే, వీరశైవులకు చాలా సులువైన సమాధానం చెప్పారు బసవన్న. శివ శరణులు శివుని అనుసరిస్తారు కాబట్టి, వారిని పట్టండని. శివుడు మంగళమూర్తి. అతనిని అనుసరించే శరణులు నియమనిష్ఠలతో, భక్తి శ్రద్దలతో,  శివునికి నచ్చే విధంగా ప్రవర్తిస్తూ వీరశైవ ధర్మములైన పంచాచారములు, అష్టావరణములు పాటిస్తూ, షట్-స్థలములననుసరించి శివసాయుజ్యము చేరే ప్రయత్నంలో ఉంటారు. వారి సహవాసంలో మనము వారి మార్గమువల్ల ప్రభావితులమవుతూ, నిత్యమూ అటువంటి సంగమువల్ల వాటిని పాటిస్తూ మనస్సుకి మంచి పద్దతులను అలవాటు చేసుకుంటాము. అటువంటప్పుడు కలిగేది అందరికి శుభమే అవుతుంది. అందుకే శరణసాంగత్యము పట్టవలెనని బసవన్న ఉవాచ. 

శరణు శరణార్థి !!






   

Sunday, December 13, 2015

37. Umba Battalu Bere Kanchalla, Noduva Kannadi Bere Kanchalla - Basavanna

కన్నడ వచనం 

ಉಂಬ ಬಟ್ಟಲು ಬೇರೆ ಕಂಚಲ್ಲ
ನೋಡುವ ಕನ್ನಡಿ ಬೇರೆ ಕಂಚಲ್ಲ
ಭಾಂಡ ಒಂದೇ ಭಾಜನ ಒಂದೇ
ಬೆಳಗೇ ಕನ್ನಡಿ ಎನಿಸಿತ್ತಯ್ಯಾ
ಅರಿದಡೆ ಶರಣ ಮರೆದಡೆ ಮಾನವ
ಮರೆಯದೆ ಪೂಜಿಸು ಕೂಡಲಸಂಗನ.

తెలుగు లిపిలో 

ఉంబ బట్టలు బేరె కంచల్ల 
నోడువ కన్నడి బేరె కంచల్ల 
భాండ ఒందే భాజన ఒందే 
బెళగే కన్నడి ఎనిసిత్తయ్య  
అరిదడె శరణ, మరెదడె మానవ 
మరెయదె పూజిసు కూడలసంగన

తెలుగు వచనం 

తినే కంచము వెరే కంచుగాదు, చూసే అద్దము వేరు కంచుగాదు 
భాండము ఒకటే, భాజనమూ ఒకటే - మెరిస్తే అద్దమనిపిస్తుంది 
తెలిసుకొన్నవాడు శరణుడు, మరచినవాడు మానవుడని 
మరువక పూజించు కూడలసంగముని 

వచనకర్త ఆంతర్యం 

లోకంలో మానవులందరూ ఒకటే అని గుర్తెరగి, భక్తితో శివుని పూజించు వాడే నిజమైన శరణుడు!!

విశ్లేషణ 

ప్రపంచములోని విషయములన్ని శివుని నుండే పుట్టాయని నమ్ముతారు వీరశైవులు. ప్రతీ జీవునిలో ప్రేరకుని రూపంలో ఉండేది మహేశ్వరుడని విశ్వసిస్తారు. మరి జీవునికి శివునికి తేడా లేదా?  నేను శివున్నైతే శివునిలా నాకు శక్తులు లేవే? వంటి ప్రశ్నలు వస్తాయి. వీటిని వీరశైవము ఈ విధంగా వివరిస్తుంది- 
ప్రతీ జీవుడు శివుని అంశే అయినా, జీవున్ని అవిద్య అనే మాయ కప్పి ఉంచుతుంది. ఈ మాయ ప్రభావమువల్ల నేను అల్పున్ని (చిన్నవాన్ని) అన్న అపోహలో జీవుడు ఎన్నోజన్మలుగా పుడుతూ చస్తూ అలవరచుకుంటాడు - చీమై పుడితే చీమనని, ఏనుగై పుడితే ఏనుగునని, మనిషై పుడితే మనిషినని భ్రమిస్తూ తన స్వస్వరూపమైన శివున్ని మరచిపోయి ఉంటాడు. ఈ అవిద్యను తొలగించు కోవాలంటే ముందు "నేనెవరిని?" అనే కుతూహలము కలగాలి. అది కలిగిననాడు మనిషి ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మజ్ఞానం వైపు ప్రయాణిస్తాడు. గురువు దానిని ప్రేరేపిస్తాడు, చేయి పట్టుకు నడిపిస్తాడు. అయితే ఈ జ్ఞానము కేవలము పుస్తకము చదివో, కేవలం ఎవరో చెబితే నేర్చుకొనేది కాదు. అనుభవ పూర్వకంగా కలగాలి. ఉదాహరణకు పుస్తకాలు చదివి పరీక్ష వ్రాస్తే వైదుని (doctor) పట్టా ఇచ్చెయ్యరుగా? ముందు ఐదారు సంవత్సరాలు ఒక్కొక్క తరగతిలో ఉంచి పొందవలసిన విద్య నీర్పుతారు.  అనుభవం కలగడానికి కొన్నాళ్ళు వైద్యశాలలో పనిచేయిస్తారు. ఆచరణాత్మకంగా నేర్పిస్తారు. సరిగ్గా వైద్యం చేస్తే అప్పుడు వైద్యునిగా గుర్తిస్తారు. పట్టా ఇస్తారు. ఈ మార్గంలో ఆ వ్యక్తికీ అనుభవముద్వారా వైద్యము యొక్క జ్ఞానము కల్గుతుంది. 
అదే విధంగా నేనే శివున్ననే లింగంగా సామరస్య భావము, ఐక్య భావము కలగాలంటే చాలా కష్టపడి ఆచరణయుక్తంగా అష్టావరణములు, పంచాచారములను పాటించి, షట్ స్థలములనే వివిధ తరగతులలో ఉంటూ క్రమంగా శివైక్య భావాన్ని అనుభవపూర్వకంగా (with experience) పొందవలసి ఉంటుంది. అలా పొందెడి వారు, లేదా ఎరిగి అటువంటి మార్గంలో ప్రయాణం చేస్తున్నవారు శరణులు అని పిలవ బడతారు. 

నిత్యమూ పదును పట్టి నున్నగా చేస్తే కంచు అద్దముగా మెరుస్తుంది.  (ఆ కాలంలో అద్దము కంచుతోనే తయారు చేసేవారు). తినే కంచాన్ని కంచుతో చేసినా అంతగా మెరవదు - కారణం దాని ఉపయోగము వేరు; కానీ దాన్ని నున్నగా చేస్తే అదికూడా అద్దముల మెరుస్తుంది కదా. కంచానికి, అద్దానికి  లక్షణాలు ఉపయోగాలు వేరైనా వాడే ముడి పదార్థము మాత్రము కంచే. 

మనుషులు కూడా ఏంతో మంది ఉంటారు. వారిలో శివభక్తిలో మునిగి, లింగాంగ సామరస్యమును పొంది, ప్రతీ జీవునిలో మహేశ్వరుడే ప్రేరకుడై ఉంటాడని తెలుసుకుని ఎరిగి ప్రవర్తించే జీవుడు శరణుడవుతాడు. ఇలాంటి శరణుడు రాయిని, వజ్రాన్ని సమానంగా చూస్తాడు. మట్టిని బంగారాన్ని ఒకే విధంగా చూస్తాడు.  అందరిని సమంగా ఆదరిస్తాడు, అందరితో సమంగా వ్యవహరిస్తాడు. రకరకాల పాత్రలరూపంలో ఉన్నా కుండలన్నింటికీ ముడి పదార్థం మట్టే, అలానే ప్రపంచానికి ముడిపదార్థం శివుడని అని గ్రహించి ప్రతి వస్తువులో శివున్ని చూడడం అనుభవపూర్వకంగా నేర్చుకుని, నిత్యం శివానందంలో మునిగి తేలుతూ, ఎరుకతో తిరిగే అవస్థ శరణులు పొందుతారు. ఇలా ఎరుగక తిరిగే వారు, సత్యాన్ని మరచి తిరిగేవారు అంటే మనలాంటి వారు, మామూలు మనుషులు.  

అద్దము మెరిసి స్వస్వభావాన్ని ప్రతిబింబింపజేస్తుంది. అదే విధంగా జ్ఞాని అయిన మనిషి శరణునిగా మెరుస్తూ, జ్ఞానాన్ని ప్రతిబింబింపజేస్తుంటాడు. ఈ జ్ఞానము ఇతరులకు ఉపయుక్తమై, మార్గదర్శకమై, శివుని ఆజ్ఞగా లోకాన్ని నడిపించే పథమవుతుంది. శివశరణుల అద్దము నుండి వెలువడిన వచనములే ఈనాటికీ మనకోసమై ప్రతిబింబించే జ్ఞానము. 

అయితే ఇంత జ్ఞానము ఉన్న శరణులు నిరాడంబరులై, ఎలాంటి అహంకారము లేక, ఇతరులనుండి ఎటువంటి ఆపేక్ష లేక అందరిపై సమాన భావం కలిగి ఉంటారు. మేము జ్ఞానాన్ని పంచుతున్నాము మా కళాశాలకు ఇంత రుసుం చెల్లించండన్నట్లు, ఆశ్రమాలను ఏర్పాటు చేసుకుని విరాళాలతో డంబాచారం చేసే నేటి సన్యాసులను శరణులని భ్రమ పాడేరు సుమా! 

శరణులుగా మారాలనుకునే మనుషులు, అన్ని జీవులలో అభేద్య భావముతోనే శివున్ని పూజించాలనేది బసవన్న ఉవాచ. 

శరణు శరణార్థి!!







Sunday, November 8, 2015

36. Chakorange Chandramana Belakina Chinte - Basavanna


కన్నడ వచనం 
ಚಕೋರಂಗೆ ಚಂದ್ರಮನ ಬೆಳಕಿನ ಚಿಂತೆ
ಅಂಬುಜಕೆ ಭಾನುವಿನ ಉದಯದ ಚಿಂತೆ
ಭ್ರಮರಂಗೆ ಪರಿಮಳದ ಬಂಡುಂಬ ಚಿಂತೆ
ಎನಗೆ ಎನ್ನ ಕೂಡಲಸಂಗಮದೇವನ ನೆನೆವುದೆ ಚಿಂತೆ!

తెలుగు లిపిలో 
చకోరంగె చంద్రమన బెళకిన చింతె 
అంబుజకె భానువిన ఉదయద చింతె
భ్రమరంగె పరిమళద బండుంబ చింతె 
ఎనగె ఎన్న కూడలసంగమదేవన నెనెవుదె చింతె!


తెలుగు వచనం 
చకోరమునకు చంద్రుని వెలుగుకై చింత 
అంబుజమునకు భానుని ఉదయమునకై చింత 
భ్రమరమునకు పరిమళముతో విచ్చుమొగ్గకై చింత 
నాకు మన కూడలసంగమ దేవుని నేనచు చింత!!

వచనకర్త ఆంతర్యం:
మనస్సు పరమేశ్వరుని సాక్షాత్కారముకై తపించాలి. 

విశ్లేషణ 

చకోర పక్షి చంద్రోదయముకై వేచి ఉంటుంది. చంద్రుడున్నంత సేపు అతనివైపే చూస్తూ గడుపుతుంది. లేనప్పుడు చంద్రునికై నిరీక్షణ. చంద్రునికై ఆలోచన. అందుకే దానిని అమితమైన ప్రేమకు సంకేతంగా వాడతారు. చంద్రునికి కూడ అందుకే చకోరబంధువని పేరు. 

అంబుజము (కమలము) సూర్యోదయముకై వేచి ఉంటుంది. సూర్యుని ఆగమనముతో వికసిస్తుంది. ఆనందంగా కనిపిస్తుంది. మరల సుర్యస్తమయముతో ముడుచుకుంటుంది. అంటే దాని ఆలోచన అంతా సూర్యుని కోసమే. అందుకే కమలమునకు సూర్యునిపై ప్రేమను ఆపాదించారు. సూర్యున్ని కూడా కమలాప్తుడన్నారు. 

భ్రమరము వికసించే పువ్వుకై వేచి ఉంటుంది - పరిమళముతో నిండిన మధువును ఆస్వాదించడానికి. ఇతరములు రుచించవు. పువ్వు పైనే ఆలోచన. మాటిమాటికి దానిచుట్టే తిరుగుతుంది. 

ఈ మూడు పోలికలలోనూ కొన్ని విషయాలు గ్రహించగల్గుతాము. 

మొదటిది నిరీక్షణ : ఎంతైనా వేచి ఉండ గలిగే సామర్ధ్యం. శివానుగ్రహానికి కూడా అలానే నిరీక్షించాల్సి ఉంటుంది. 

రెండవది నమ్మకం: చంద్రుడు తప్పకవస్తాడనే నమ్మకము చకోరానికి. సూర్యుడు వస్తాడనే నమ్మకము కమలమునకు, పువ్వు వికసిస్తుందనే నమ్మకము తుమ్మెదకూ కొంచము కూడా సన్నగిల్లదు. శివునిపైకూడా అటువంటి నమ్మకమే భక్తునికి ఉండాలి. 

మూడవది చెక్కు చెదరని ప్రేమ: మనస్సు వికలము కాకుండా అక్కడే ఉంచడం చకోరము చంద్రుని వైపే చూడడంలో నిదర్శనం. భ్రమరము మాటిమాటికి పువ్వు దెగ్గరకు రావడనికి కారణము దాని మనస్సు మాటిమాటికీ పువ్వు వైపు తోసుకెల్లడమే. ఒక భక్తుని మనస్సు కూడా ఎక్కడికి పోయినా మళ్ళి శివుని వైపే వచ్చి చేరుతుంది. అక్కడే లయమవుతుంది.  

ఇలా లయమైన మనస్సుకే శివసాక్షాత్కారము జరుగుతుంది. అటువంటి మనస్సులోనే శివజ్ఞానమనే సూర్యోదయము కలిగి "సత్యాన్ని" తెలుసుకొనేది. ఆ నిర్మలమైన "చిత్త"మనెడి మానససరోవరములోనే పరమేశ్వరుడనే పూర్ణచంద్రుని ప్రతిబింబము యొక్క దర్శనము కలిగేది. మనస్సులో ముప్పైఆరు తత్వములనే రేకులున్న పుష్పము వికసించి అందులో పరమాత్మ రూపములో వెలిగే శివదర్శనమను శాశ్వత "ఆనందము" అనే తేనెను ఆస్వాదిస్తాడు జీవుడనే భ్రమరము. ఈ సచ్చిదానంద శివస్వరూప దర్శనముకై చింతించేది తనమనసని బసవన్నఈ వచనంలో చెబుతున్నారు. 

అలాంటి శివచింతనే మనందరికీ కలగాలని ఆశిస్తూ .. శరణు శరణార్థి.