Sunday, July 26, 2015

29. Kombeya Melana Markatadamte - Basavanna


కన్నడ వచనం 

ಕೊಂಬೆಯ ಮೇಲಣ ಮರ್ಕಟನಂತೆ ಲಂಘಿಸುವುದೆನ್ನ ಮನವು
ನಿಂದಲ್ಲಿ ನಿಲಲೀಯದೆನ್ನ ಮನವು
ಹೊಂದಿದಲ್ಲಿ ಹೊಂದಲೀಯದೆನ್ನ ಮನವು
ಕೂಡಲಸಂಗಮದೇವಾ, ನಿಮ್ಮ ಚರಣ ಕಮಲದಲ್ಲಿ ಭ್ರಮರನಾಗಿರಿಸು ನಿಮ್ಮ ಧರ್ಮ

తెలుగు లిపిలో 

కొంబెయ మేలణ మర్కటదంతె లంఘిసువుదెన్న మనవు 
నిందల్లి నిలలీయదెన్న మనవు 
హొందిదల్లి హొందలీయదెన్న మనవు 
కూడలసంగమ దేవా, నిమ్మ చరణ కమలదల్లి భ్రమరనాగిరిసు నిమ్మ ధర్మ 
  
తెలుగు వచనం 

కొమ్మ మీద మర్కటమువలె లంఘించు నా మనసు 
నిలువగ నిలువనీయదు నా మనసు 
పొందుగ పొందికతోనుండదు నా మనసు 
కూడలసంగమ దేవా, నీ చరణ కమలమందు భ్రమరముగామార్చు, అది నీ ధర్మము!! 

వచనకర్త ఆంతర్యం 
మనస్సుని అదుపులో పెట్టడం నాచే కానిపని. నీవే నీ ధర్మంగా స్వీకరించి నీ చుట్టూ తిప్పుకోవయ్యా!


విశ్లేషణ 

ఈ వచనం బాగా అర్థం చేసుకోవాలంటే కొద్దిగా యోగ శాస్త్రంలో వివరించిన కొన్నితత్వాలను తెలుసు కోవాలి. మన శరీరం ఎలా పని చేస్తుందో ఎవరి అదుపులో ఉంటుందో ఆలోచించవలసి ఉంటుంది. 
 
మనందరికీ పంచ జ్ఞానేంద్రియాలు (అంటే త్వక్, శ్రోత్ర, రసన, ఘ్రాణ, నేత్రములు వాడుక భాషలో చెప్పాలంటే చెవులు, చర్మము, నాలుక, కళ్ళు, ముక్కు అన్నమాట)  ఉన్నాయి. వీటి వల్ల పంచ తన్మాత్రలను అనుభవిస్తాము ( అంటే శబ్ద స్పర్శ రస రూప గంధములు లేదా వాడుక భాషలో  వినికిడి, స్పర్శ, రుచి, రూపము, వాసనలు).ఈ  విషయాలను జ్ఞానేంద్రియాలు బయటి విషయాలను గ్రహించి లోపలికి చేరుస్తుంటాయి (అంటే Inputs అన్నమాట) వీటివల్ల తప్ప మనకి బయట ప్రపంచం నుండి ఏ విషయాలు తెలుసుకొనే మార్గం లేదు.  

అలాగే  పంచ కర్మేంద్రియాలు  (అంటే వాక్కు, పాణి, పాదం, ఉపాస్త, పాయువుల వాడుక భాషలో కంఠము, చేతులు, కాల్లు, జననాంగములు, విసర్జనాంగములు) ఉన్నాయి. వీటితో మాట్లాడడము, పని చేయడము, అటు ఇటు వెళ్ళగలగడము, సంతానం కనడము, మలమూత్ర విసర్జనము జరుగుతాయి. ఈ కర్మేంద్రియముల ద్వారా మనము లోని భావాలను బయటకి వ్యక్తపరుస్తుంటాము (అంటే Outputs అన్నమాట). వీటివల్ల  తప్ప ఇంకే విధంగా మనలని మనం వ్యక్త పరచలేము. 

అయితే వీటన్నిటి వెనక ఉండేవి, మనకు కనబడనివి అంతఃకరణములు - ఇవి మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అనే నాలుగు. 
- నేనున్నాననే చైతన్యమే 'చిత్తము'. 
- నేను, నాది అని తలపించేదే 'అహంకారము'.  
- తప్పొప్పులను ఆలోచింపజేసేదే 'బుద్ధి'. 
- సంకల్ప వికల్పములకు ఆలవాలము 'మనస్సు'. 

ఈ వచనమ్లో ప్రధానము మనస్సు గురించిన చర్చ. మనసెప్పుడు ఎదో చెయ్యాలి (సంకల్పం), ఏదో చేయకూడదు (వికల్పం) అని తలుస్తూ ఉంటుంది. ఉదాహరణకు, ఉన్నట్టుంది మొన్న వంకాయ కూర బావుండింది, మళ్ళి తినాలి అనిపిస్తుంది; కొనడానికి వెళ్ళారు. వెంటనే దానికన్నా ఈ దుకాణంలో బెండకాయలు ఇంకా బాగున్నాయి, వంకాయరేపు చెయ్యొచ్చులే అని ఇంకో అలోచన. 
ఎప్పుడూ ఇది ఇష్టం, ఇది అయిష్టం అని చెబుతూ ఉంటుంది. చిన్న పిల్లలనుండి, ముసలివారి వరకు అందరిలోనూ మనసు చేసే పని ఇదే. 

ఈ మనస్సు మనకి బహిరంగంగా కనబడకపోయినా ఎప్పుడూ పైన చెప్పిన జ్ఞానేంద్రియాల నుండి ప్రతిక్షణం సమాచారం స్వీకరిస్తూ, కర్మేంద్రియాలకు ఏమి చేయాలో సూచిస్తూ, ఇంద్రియాలనన్నింటిని ఈ మనస్సు పూర్తిగా తన అదుపాజ్ఞలలో ఉంచుకుంటుంది. 

ఉదాహరణకు ఇంట్లో అంతా సంతోషంగా ఏదో మాట్లాడు తున్నారు. నా మనస్సు చికాకుగా ఉంది. వెంటనే ఎదో ఆలోచించకుండా అరిచేసాను - అంటే వాక్కు మనస్సు అధీనంలోకి వెళ్లి పోయింది. అక్కడ వాతావరణం మార్చేసాను; అది పరిణామాల తీవ్రతని ఆలోచించే విచక్షణ నా మనసుకి ఉండదు. ప్రతీ చోటా ఉండే పరిస్థితికి కారణం అక్కడ ఉండే వాళ్ళ మనస్సు యొక్క స్థితి మాత్రమే - అది సుఖమైన, దుఃఖమైనా, సంతోషమైన, ఏడుపైనా, భయమైనా, భ్రాంతైనా ఏదైనా సరే.   
   
మనస్సు కొత్తకొత్త విషయాలను ఇంద్రియాల ద్వారా నేర్చుకుని, వాటిలో తనకు నచ్చిన వాటిని మళ్లి మళ్ళి కావాలని అడుగుతుంది. ఉదాహరణకు ఒక కొత్త వంట తిన్నారనుకోండి. ఇదివరకెప్పుడూ తినలేదు. కానీ నచ్చింది. మళ్లీ అది తినిపించమని మనస్సు ఇంద్రియాలను ఉత్సాహపరుస్తుంది. ఇలాంటి మనస్సుకు వశులమై మనము నిత్యం జీవితం గడుపుతున్నాము. 

ఈ మనస్సుకి ఒక్క క్షణం కూడా తీరిక ఉండదు. నడుస్తున్నా, కూర్చున్నా, నిలబడ్డా, పడుకున్నా మనస్సుకు మాత్రం తీరిక ఉండదు.  ఎపుడూ ఒకదాని తరువాత ఒకటి ఆలోచనలు, కోరికలే! అరే పది నిముషాలు శివ పూజకు కూచుంటే అప్పుడు కూడా ఏవో ఆలోచనలు - ఉద్యోగమని, పిల్లలకు ఎదో మరిచామని, ఇంకేదో చేయాలని. ఒక చోట నిలువదే?!

అందుకే మనస్సుని కోతితో పోల్చారు బసవన్న. ఇలాంటి చపలమైన కోతిలాంటి మనస్సు నా అదుపులో ఉండట్లేదు. దీన్ని పట్టడం నావల్ల కావట్లేదు. నీకే ఇస్తున్నాను, నీ పాదాలనే పువ్వులచుట్టు తుమ్మెదవలే తిప్పుకోవయ్యా అని అడిగారు. అంతే కాదు ఇది నీ ధర్మం అని శివుని ముందలి కాళ్ళకు బంధాలు వేసేసారు. 

ఈ పోలిక కేవలం బసవన్నే కాదు. దిశంకరులు కూడా అదే కోరారు, శివానందలహరిలో -

సదా మొహాటంవ్యా చరతి యువతీనాం కుచగిరౌ
నటత్యాశాశాఖాస్వటతి ఝటితి స్వైరమభితః । 
కపాలిన్భిక్షో మే హృదయకపిమత్యంత చపలం
ధృడ భక్త్యా భంద్వా శివ భవదధీన కురు విభో॥   

ఎప్పుడూ యువతి మోహంలో వారి హృదయ స్థానాన్నిఆశిస్తూ తిరుగుతూ ఉంటుంది నామనస్సు. ఆశలనే కొమ్మలపై ఇష్టం వచ్చినట్లు అటు ఇటు దూకుతూ చంచలగా ఉంటుంది. అలాంటి అత్యంత చపలమైన ఈ మనస్సనే కోతిని నీ కపాలపు భిక్ష పాత్రలో వేస్తున్నాను. నువ్వు ధృఢభక్తి అనే తాడుతో కట్టి నీ అధీనంలో ఉంచుకోవయ్య శివా!!  

ఒక నిజభక్తునికి భగవంతున్ని ఏమి కోరాలో తెలియాలి. అందుకే గురువులంతా మన స్థానంలో తమని పెట్టుకొని బోధించారు. ఒంకొకరి దౌర్బల్యాలను ఎత్తి చూపడంకన్నా బసవన్న ఇది తన దౌర్బల్యమని తనమీద వేసుకొని ఈ వచనంలో వేరొకరిని నొప్పించకుండా బోధిస్తున్నారు- మనస్సనే కోతిని శివునికి అర్పించుకోమని.
    
ఒక్కసారి మనస్సుని నిగ్రహించగల్గితే, ఇంద్రియాలన్నీ అదుపులో ఉంటాయి. చుట్టూ వాతావరణమంతా శివమయమవుతుంది. కాని అది మనతరం కాదు - చాలా కష్టం. కాబట్టి ఈ విషయాన్నీ గ్రహించి ఆ శివున్నే వేడుకుందాం.   

శరణు శరణార్థి!!


   





 

Sunday, July 19, 2015

28. Kalali Kattida Gundu, Koralali Kattida Bendu - Basavanna



కన్నడ వచనం 
ಕಾಲಲಿ ಕಟ್ಟಿದ ಗುಂಡು, ಕೊರಳಲಿ ಕಟ್ಟಿದ ಬೆಂಡು!
ತೇಲಲೀಯದು ಗುಂಡು, ಮುಳುಗಲೀಯದು ಬೆಂಡು!
ಇಂತಪ್ಪ ಸಂಸಾರಶರಧಿಯ ದಾಂಟಿಸಿ
ಕಾಲಾಂತಕನೇ ಕಾಯೋ, ಕೂಡಲಸಂಗಯ್ಯ!

తెలుగు లిపిలో 

కాలలి కట్టిద గుండు,  కొరళలి కట్టిద బెండు
తేలలీయదు గుండు, ముళుగలీయదు బెండు 
ఇంతప్ప సంసారశరధియ దాంటిసి 
కాలాంతకనే కాయో కూడలసంగయ్య!


తెలుగు వచనం 

కాలికి కట్టిన గుండు, మెడకు కట్టిన బెండు 
తేలనీయదు గుండు, మునుగనీయదు బెండు
ఇంటువంటి సంసారశరధి దాటించు 
కాలాంతకా కావుమా కూడలసంగయ్య!

వచనకర్త ఆంతర్యం 

కష్టసుఖాలతో కూడిన సంసారం మభ్యపెడుతూ ఉంటుంది. ఆ పరమేశ్వరుని కృప లేనిదే ఈ సంసారసాగరాన్ని దాటడం సాధ్యం కాదు. 

విశ్లేషణ 

పూర్వము తప్పులు చేసిన వారికి రాజులు శిక్షలు వేసేవారు. మరణ శిక్షలలో కూడా కొన్ని భయంకరంగా ఉండేవి. నీటిలో ముంచడం వంటివి. మాములుగా నీటీలో పడేస్తే తిరిగి ఈదుకుంటూ వస్తారని, ఒక బరువైన రాతి గుండుని కట్టి విడిచేవారు. వాడు నీట మునిగి, బయటకి రాలేక మరణించేవాడు. 

ఈత నేర్పాలంటే ఊళ్ళల్లో బెండు కట్టి నీటిలోకి తోసేస్తారు. అలా విడువబడిన వాడు నీటిలో మునుగకుండా బెండు చూసుకుంటుంది, తేలుస్తుంది . అలా అతడు ఈత నేర్చుకుంటాడు. 

సంసారమనేది మన గత జన్మల ప్రారబ్దాల కారణంచేత, పాపపుణ్యాల ఫలాలతో కూడి, కొన్నిసార్లు కష్టాలలో గుండువలే ముంచుతూ, మరికొన్ని సార్లు బెండువలే సుఖాలలో తేలుస్తూ ఉంటుంది. అటు మునగదు, ఇటు తేలదు. మనిషి జన్మలో అనునిత్యం కష్టాలు, సుఖాలు అనుభవిస్తూనే ఉంటాడు. పెద్ద పెద్ద కష్టాలు, సుఖాలు అలోచించవలసిన పని లేదు, రోజు చిన్న చిన్నవీ కల్గుతూనే ఉంటాయి. ఉదాహరణకు మండుటెండలో నడవాల్సి వస్తే కష్టమైతే, వెంటనే చల్లని మంచినీళ్ళు త్రాగడం సుఖమవుతుంది. ఇటువంటి కష్టసుఖాల కలయికతో గడిచే జీవతం సముద్రంలాగా విశాలమైనది, అంతు చిక్కడం చాలా కష్టం. చాలామంది అంతుగురించి తెలియక, అలోచించడం మాని ఆ సంసారం సాగర  ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటారు. ఈ ప్రవాహమే కాలం (time). 

జగత్తులోని ప్రతీ వస్తువు కాలం యొక్క అధీనంలో ఉంటుంది. కాలము ఎవ్వరూ ఆపలేని ప్రవాహము. నిరంతరం సాగిపోతూనే ఉంటుంది. అనుక్షణం ఇలా గడిచి పోతున్న కాలం జగత్తులో మార్పులు తెస్తూ ఉంటుంది. ఉదాహరణకు పొద్దున్న కాచిన పువ్వు మధ్యాన్నానికి వాడిపోతుంది. మరుదినానికి మట్టయి పోతుంది. పువ్వుకి ఒక్క రోజైతే మనకి వందేళ్ళు, అంతే తేడా. ఎలాగైతే కాలం పువ్వుని భక్షించిందో, అలాగే మననీ తినేస్తుంది. అందుకే కాలము జగత్తుని భక్షిస్తుందని అంటారు. బ్రహ్మాదిపిపీలికాంతము (బ్రహ్మ నుండి మొదలుకొని చీమ వరకు) అందరూ కాలానికి లోబడే ఉంటారు. ఎంతో మంది వీరులు, అవతార పురుషులు, దేవతలు, రాక్షసులు కాలంలో వచ్చారు, పొయ్యారు. రాముడని, కృష్ణుడని పూర్వపు అవతారాలతో పాటు, నేడు గొప్పగా పూజించే సాయిబాబా వరకూ రకరకాల అవతారాలు వచ్చినా కాలానికి లోబడి, ఏదో విధంగా నిర్యాణం చెందిన వారే.  
ఇలా జగత్తుని నిదానంగా మింగే కాలాన్ని చుట్టుకున్న సర్పంతో పోలుస్తారు. చుట్టుకున్న పాము నెమ్మదిగా కదులుతూ కదలిక తెలియకుండా ఒకే ఆకారంతో ఉంటుందో, కాలం కూడా తన ఉనికి తెలియకుండా గడచి పోతూ ఉంటుంది. 

మరి ఇన్ని సంఘటనలకు, జగత్తులోని విషయాలను తనకు తాను వశపరచుకొని శాసించే కాలానికి అదుపులేదా? కాలమ్లో భాగమైన సంసారమనే సముద్రంలో జీవులంతా కొట్టుకు పోవలసిందేనా? ఇటువంటి కాలాన్ని శాసించే వారెవరైనా ఉన్నారా? అంటే ఆ ప్రశ్నకు సమాధానమే కాలకాలుడు, కాలాంతకుడు అయిన పరమేశ్వరుడు. కాలమైన ఆ మహాసర్పాన్ని తన మెడలో వేసుకొని చిరునవ్వుతో, అభయ హస్తంతో చెబుతున్నాడు, ఈ కాలము నన్నేమీ చేయలేదు, నా అధీనంలో ఉంది భయపడకండి అని. నటరాజ స్వరూపంలో కాలాన్ని తనవశం చేసుకొని, అభయమిస్తూ తన ఎడమ పాదము వైపు చూపే మూర్తే చెబుతుంది, ఈ ఎడమ పాదాన్ని ఆశ్రయిస్తే (కుంచితాంఘ్రిం భజేహం) నువ్వు కాలాతీతుడవుతావు అని. 

నిజంగానా? అవును.. 
మార్కండేయ చరిత్ర చూడండి. కాలానికి లోబడి ఈ ప్రపంచంలో ప్రతీ జీవి అంతమొందేలా శాసించే సమవర్తి యముడు. అది అతని ధర్మం. అందుకే అతనికి మరో పేరు కాలుడు. తన పాదాలను ఆశ్రయించిన చిన్ని వాన్ని కాపాడడానికి ఆ ఎడమపాదమే లేచి, కాలుడైన యమ్మున్ని ఛాతిపై తన్ని చంపింది. కాలాన్ని హతమార్చింది. అప్పుడే కాలాంతకుడైనాడు రుద్రుడు.  

వేదం పలుసార్లు ఈ రుద్రున్ని"క్షయద్వీరాయ" అని పొగిడింది - అంటే "నశించుచున్న వీరులు/భ్హృత్యులు కలవాడా" అని. అంటే ఏంతో మంది గొప్పవాల్లనుకునే వీరులు నీ ముందు పడిపోతూ ఉంటారు, నువ్వు మాత్రం కాలానికి అతీతుడవై అలా నిలిచుండి పోతావు అని. అదే కాలకాలున్ని ఇంకో చోట నమస్తారాయ (నమః + తారాయ) అని పొగిడింది. అంటే కాలాతీతమైన సంసారమనే సాగరం నుండి తరింపజేసేవాడు, దరిజేర్చేవాడు అని.  అందుకే బసవన్న ఈ వచనంలో ఆ కాలాంతకున్ని పిలిచాడు, సంసారసాగరాన్ని దాటించవయ్యా అని. ఇక ఆ కాలకలుడైన కూడల సంగమేశ్వరున్ని వినా ఇతరాత్రులని వేడితే చిన్న చిన్న కోరికలు తీరుతాయేమో గాని సంసారం బంధం విడుతుందా? ప్రాజ్ఞులు ఆలోచించండి.  

శరణు శరణార్థి!!



     




Sunday, July 12, 2015

27. Saganiya Benakana Madi - Basavanna

కన్నడ వచనం 

ಸಗಣಿಯ ಬೆನಕನ ಮಾಡಿ ಸಂಪಿಗೆಯರಳಲ್ಲಿ ಪೂಜಿಸಿದರೆ
ರಂಜನೆಯಹುದಲ್ಲದೆ, ಅದರ ಗಂಜಳ ಬಿಡದಣ್ಣ!
ಮಣ್ಣ ಪ್ರತಿಮೆಯ ಮಾಡಿ ಮಜ್ಜನಕ್ಕೆರೆದರೆ
ನಿಚ್ಚ ಕೆಸರಹುದಲ್ಲದೆ ಅದರಚ್ಚಿಗ ಬಿಡದಣ್ಣ!!
ಲೋಕದ ಮಾನವಂಗೆ ಶಿವದೀಕ್ಷೆಯ ಕೊಟ್ಟರೆ
ಆ ಕೆಟ್ಟವನೇಕೆ ಸದ್ಭಕ್ತನಹನು ಕೂಡಲಸಂಗಮದೇವಾ ?

తెలుగు లిపిలో 
సగణియ బెనకన మాడి సంపిగెయరళల్లి పూజిసిదెరె 
రంజెనెయహుదల్లెదె, అదర గంజల బిడదణ్ణ!
మణ్ణ ప్రతిమెయ మాడి మజ్జనక్కెరెదరె 
నిచ్చ కెసరహుదల్లదె ఆదరచ్చిగ బిడదణ్ణ!
లోకద మానవంగె శివదీక్షయ కొట్టరె 
ఆ కెట్టవనేకె సద్భక్తనహను కూడలసంగమదేవా ?


తెలుగు వచనం 

పెండ గణపతి చేసి సంపెంగపూలతో పూజించిన 
రంజనమగునేమోగాని, దాని పేడకంపు విడదన్న!
మన్ను ప్రతిమను జేసి మంచినీట్లోముంచిన
బురదముద్దగ మారునేగాక తననైజం విడదన్న!
లోకపు మానవునికి శివదీక్షను ఇచ్చిన 
ఆ చెడ్డవాడెందుకు సద్భక్తుడగును కూడలసంగమదేవా?

వచనకర్త ఆంతర్యం 

శివదీక్షను ఇచ్చే ముందు దీక్షార్హతను పరికించి ఇవ్వాలి. చెడ్డవారికి ఇస్తే వాడు మంచి వాడయిపోడు. 

విశ్లేషణ 

శివదీక్ష తీసుకోవడం ఒక గంభీరమైన విషయమని, గురువు దీక్ష ఇచ్చే ముందు పరికించి ఇవ్వాలని, దీక్షాగ్రాహి నియమనిష్టలతో ఉండవలసి ఉంటుందని ఇదివరకు మనము "కుంబళకాయిగెఉంటే  కట్ట కొట్టడె" అనే వచనంలో చర్చించుకున్నాము. అదే విషయాన్ని ఇంకో కోణంలో వేరే ఉదాహరణలతో చెబుతుంది ఈ వచనం.

పేడతో విగ్రహం చేసి సువాసనగల పూలతో పూజించినా కూడా మనకి చూడడానికి సంతోషదాయకంగా కనబడుతుందేమోగాని పేడ కంపుపోదు. ఈ ఉదాహరణ చెప్పుకోడానికి సులువుగా ఉన్నా, ఆలోచిస్తే ఒక మర్మం కనబడుతుంది. గణపతి విగ్రహం పుట్టమన్నుతో చేస్తారుగాని పేడతో చెయ్యరు. ఎదైనా చేసే ముందు సరియైన పదార్థాన్ని వాడడం ముఖ్యం. లేకపోతే ఎన్ని సుగంధ భరితమైన పుష్పాలతో అలంకరించినా కంపుపోనట్లు, దీక్ష తీసుకునే వానికి లోకంలో స్వార్థాలతో సాంగత్యం ఉంటే ధరించిన లింగాన్ని అలంకారం కోసమో, సంఘంలో పదవికోసమో, వేరే ప్రయోజనాలకోసమో వాడుకుంటాడు. అంటే వీరశైవులమనే పేరుతో ఇంట్లో నిత్య శివార్చన విషయం ఎట్లున్నా, బైట మాత్రం ఆ మిషతో రాజకీయాలు చేసి పదవులు పొందడానికి, గొప్పలు చెప్పుకోడానికి వాడుకోవడం వంటివి. అక్కడ వారికి పదవివల్ల వచ్చే ధనప్రయోజనాలు తప్ప ఆత్మప్రయోజనం ఏమీ ఉండదు. 

మన్నుతో చేసిన విగ్రహాన్ని అభిషేకం చేస్తే మట్టి ముద్దే అవుతుంది, బురదగా మారటం దాని నైజం. ఒక విగ్రహం చేసినప్పుడు దాన్ని వాడే విధానం కూడా అలోచించుకోవాలి. అభిషేకం చేయాలంటే ఏ రాతి విగ్రహమో, కంచు విగ్రహమో వాడాలి కాని మట్టి విగ్రహం వాడితే అది బురద ముద్దగా మారుతుంది. అలానే వీరశైవదీక్ష ఇవ్వాలంటే వాడికి కావలసిన భక్తి ఉంటే, దీక్షలో నిలబడే పట్టుదల ఉంటే, మనో స్థైర్యము ఉంటే, అటువంటి వానివల్ల ప్రయోజనం ఉంటుంది. లేకపోతే దీక్షను దురుపయోగపరచి చెడతాడు. పేరుకు వీరశైవులమని చెప్పుకుంటూ చేయకూడని విషయాలను చేసే వారిని చూస్తే అర్థమవుతుంది. లింగావంతులై ఉండి, సంప్రదాయమైన కుటుంబాలలో నుండి వచ్చి మాంసాహారము, మద్యపానము వంటివి నిషిద్ధమని తెలిసికూడా వాటిని చేసేవారిని చూస్తున్నాము - ఇదే బురదగా మారడమనడానికి  ఉదాహరణ. 

మాములు మనుష్యులకు శివదీక్షను ఇవ్వటంవల్ల  వాడు సద్భక్తుడు కాజాలడు. మరి మా ఇంట్లో పుట్టిన వారికి శివదీక్ష ఇవ్వాలా?వద్దా? అనే అలోచనలో, వెంటనే ఎందుకొచ్చిన బాధలే ఇవ్వకపోతే సరిపోతుందిగదా అని సరిపెట్టు కొనేరు! 
తల్లిదండ్రులైన వారికి పిల్లలకు తమ ఇంటి సంప్రదాయాలు నేర్పడం, వారికి స్వధర్మ బోధచేయడం తప్పించుకోలేని కర్తవ్యం. కాబట్టి ఎలాగైతే వారి చదువుకోసమని, పెళ్ళికోసమని, ఎప్పుడు ఏది కొనివ్వాలో దానికోసమని ఎలాగైతే భవిష్యత్ ప్రణాళికలు వేసుకొంటామో,అదే విధంగా అత్యంత ముఖ్యంగా చేయవలసింది వారిని శివదీక్షకు అర్హులుగా తీర్చిదిద్దే ప్రణాళిక. ఈ ప్రణాళిక ఏ ఖర్చు లేనిది, ధనం కూడబెట్టవలసిన అవసరం లేనిది, సులువుగా చేయగలిగేది - "ఏది మంచిదో, ఏది చెడో విడమరచి చెప్పడం, శివభక్తిని పెంపొందించడం, వారు భవిషత్తులో బురదగా మారకుండా నిలబెట్టడం" అంతే! అలా ముందు నుండి మలచబడినవాడు దీక్షకు సత్పాత్రుడవుతాడు.    

శరణు శరణార్థి.. 

 

       
   

     
     
     
  

Sunday, June 28, 2015

26. Ura Sirege Asaga Badivadedante - Basavanna



కన్నడ వచనం

ಊರ ಸೀರೆಗೆ ಅಸಗ ಬಡಿವಡೆದಂತೆ
ಹೊನ್ನೆನ್ನದು, ಹೆಣ್ಣೆನ್ನದು, ಮಣ್ಣೆನ್ನದು, ಎಂದು ಮರುಳಾದೆ
ನಿಮ್ಮನರಿಯದ ಕಾರಣ, ಕೆಮ್ಮನೆ ಕೆಟ್ಟೆ ಕೂಡಲಸಂಗಮದೇವ.

తెలుగు లిపిలో 

ఊర సీరెగె అసగ బడివడెదంతె 
హొన్నన్నదు, హెణ్ణెన్నదు, మణ్ణెన్నదు, ఎందు మరుళాద 
నిమ్మ నరియద కారణ, కెమ్మనె కెట్టె కూడలసంగమదేవ 

తెలుగు వచనం 

ఊరి చీరలు చాకలుతికిన తీరు 
నగలనుచు, మగువనుచు, మన్ననుచు, మరులుగొని మూఢున్నైతి
నిన్ను తెలియని కారణమున చెల్లక చెడితి కూడలసంగమ దేవ

వచనకర్త ఆంతర్యం
 శివా, నిన్ను తెలుసుకోవలసిన పనిని మరచి ఇతర విషయాలపై మనసు నిలిపి చెడిపోతున్నాను. నా ఆత్మనుశుద్ధి పై ఉండవలసిన ధ్యాసను నాకుపయోగ పడని విషయాలపై బెట్టి ఇతరుల బట్టలుతికే చాకలివలే మారిపోయాను.  

విశ్లేషణ 

మనిషిగా జన్మనెత్తినవాడు భాగవత్భక్తి అనే మార్గాన్ని పట్టుకొని ఆత్మజ్ఞానాన్ని సాధించే ప్రయత్నం చేయాలని పెద్దలంటారు. శివశివా అని పలుక వలసిన వాక్కు, ధ్యానంతో శివ జ్ఞానాన్ని అలోచించగలిగే బుద్ధి,  కుండళినిశక్తిని  ప్రేరేపించి సహస్రారంలో శివున్ని చేర్చగలిగే శరీరములోని మేరుదండము (వెన్నెముక) వంటివి మనిషి స్వంతము. ఇతర జీవులకు లేని ఈ సదుపాయాలు, అలోచనా శక్తి మనుషికి ఉన్నాయి. 

అయితే అజ్ఞానము సరైన మార్గదర్శనము లేని వాళ్ళు ధనార్జన, ఆస్తులని, బంగారమని, కామవాంఛని, పదవని, దేశవిదేశ సంచారమని రకరకాలైన విషయవాసనలకు అలవాటై పోతారు. అవే తమ లోకంగా మారిపోతాయి. జీవితమంతా వీటిని సాధించడానికే చచ్చేవరకూ విపరీత ప్రయత్నాలు చేస్తారు. వీటిలో ఏ ఒక్కటీ కూడా తనతో రాదని, తనకి (అంటే ఆత్మకి) ఉపయోగపడదని తెలుసుకోజాలరు. ఆర్జించిన సంపద అంతా పిల్లలు పంచుకుంటారేమో - దానికోసం వారిలో వారికి తగవులు!  అనుకూలించకపోతే దొంగల పాలు. అంతే గాని తనతో పాటు రాదు. అలాంటి మన పరిస్థితిని తన స్వవిషయాన్ని పట్టించుకోక ఇతరుల బట్టలుతికే చాకలితో పోల్చారు బసవన్న. 
ఉదాహరణకు ఒక సంఘటన. ఈ మధ్య కొంత మంది స్నేహితులతో మాట్లాడుతున్నపుడు కాకతాళీయంగా ఒక ప్రశ్న వచ్చింది - పదివీవిరమణ (retirement) తరువాత ఏమిచేయాలి దానికి ముందునుంచే ప్రణాళిక చేసుకోవాలని. అందరి ఆలోచనలన్ని ఏ ఏ దేశాలు తిరగవచ్చు, ఏ ఆటలు (sports/games) అలవాటు చేసుకోవాలి మొదలైన భౌతికవాద(materialistic) కోరికలేగాని ఆత్మవిచారణ గురించి ఎవ్వరు సూచించలేదు. 

ఆత్మవిచారణ ("నేను ఎవరు? నా లక్ష్యం ఏమిటి?" అనే ఆలోచన) కలగాలంటే ముఖ్యంగా నిత్యపూజ, లేదా ధ్యానము అవసరమని అర్థమైంది. అది లేనివారికి కనీసం పది నిముషాలు కూడా ఏ భౌతికపరమైన ఆలోచనలు చేయకుండా మనస్సును నిలిపే అవకాశం చాలా తక్కువ. ఇక వారు తమ సమయాన్నాంతా కోర్కెలు తీర్చుకునే ప్రయత్నంలోనే ఉంచుతారు - ఇతరత్రా లక్ష్యమేమి ఉండదు. దీనినే ఆధ్యాత్మిక భాషలో పశుప్రవుత్తి అంటారు. అంటే కోరికలు తీర్చుకునే లంపటంలో కూరుకు పోయి పాశాలలో లేదా బంధాలలో చిక్కడం అన్నమాట. ఈ స్థితి నుండి విడగొట్టడానికే వీరశైవులకు అష్టావరణాలు, పంచాచారాలున్నూ! ఈ అచారాలన్ని నిత్యఇష్టలింగపూజ చుట్టూ కట్టబడి ఉన్నాయి. వీటిని పాటించేవారికి జీవిత లక్ష్యాన్ని ప్రశ్నించుకొనే అవకాశం, ఆలోచన ఆ శివుడే కలిగిస్తూ ఉంటాడు. అందుకే ఈ పశు బంధాలను తృంచే శివుడు "పశుపతి" అనబడ్డాడు; ఆ పాశుపత దీక్షే వీరశైవమైంది.            

ముఖ్యంగా వీరశైవ దీక్షలో ఉండేవారు, ఆత్మపరిశోధనను మరచి, శివ ధ్యాసను మరచి ఇతర విషయాలపై అపేక్ష ఉంచడం వల్ల సాధించ గలిగేది ఏమీ ఉండదని, చెడిపోతామని బసవన్న ఒక భక్తుని స్థానంలో తనని ఉంచుకొని చెబుతున్నారు. 

శరణు శరణార్థి!! 






  




  

Saturday, June 20, 2015

25. Vachanadalli Naamaamruta Tumbi - Basavanna

కన్నడ వచనం 

ವಚನದಲ್ಲಿ ನಾಮಾಮೃತ ತುಮ್ಬಿ 
ನಯನದಲ್ಲಿ ನಿಮ್ಮ ಮೂರುತಿ ತುಮ್ಬಿ 
ಮನದಲ್ಲಿ ನಿಮ್ಮ ನೆನಹು ತುಮ್ಬಿ 
ಕಿವಿಯಲ್ಲಿ ನಿಮ್ಮ ಕೀರುತಿ ತುಮ್ಬಿ 
ಕೂಡಲ ಸಂಗಮ ದೆವಾ ನಿಮ್ಮ ಚರಣಕಮಲದೊಳಗಾನು ತುಮ್ಬಿ

తెలుగు లిపిలో 

వచనదల్లి నామామృత తుంబి 
నయనదల్లి నిమ్మ మూరుతి తుంబి 
మనదల్లి నిమ్మ నెనహు తుంబి 
కివియల్లి నిమ్మ కీరుతి తుంబి 
కూడలసంగమ దేవా నిమ్మ చరణకమలదొళగాను తుంబి

తెలుగు వచనం 

వచనమందు నామామృతము నింపి 
నయనములందు నీ మూర్తిని నింపి 
మనమందు నీ తలపు నింపి 
చెవులందు నీ కీర్తిని నింపి 
కూడలసంగమ దేవా నీ చరణకమలములలో తుమ్మెదనై నిండెద 

వచనకర్త ఆంతర్యం 

పరమేశ్వరా, ఎప్పుడూ నీకు సంబందించిన పలుకులు మాత్రమే పలుకుతాను, నీ మూర్తిని దర్శించుటకే ఇష్టపడతాను, నీ తలపులే మనస్సులో నింపుకుంటాను, నీ కీర్తినే చెవులతో వినుటకు తహతహలాడతాను, నీ పాదముల చుట్టూ పద్మము చుట్టూ తుమ్మెద తిరిగినట్టుగా ఎప్పుడూ తిరుగుతుంటాను. నీకు సంబందించిన విషయములు తప్ప ఇతరాత్రములేవీ నాకు సరిపడవు. 

విశ్లేషణ

కన్నడలో తుంబి అనే పదానికి రెండర్థాలున్నాయి - ఒకటి "నింపి" అని, ఇంకొంకటి "తుమ్మెద" అని. ఈ పదాలు కుదరక తెలుగు వచనమ్లో "నిండెద"ననే మరో పదం వాడాస్లి వచ్చింది. తెలుగు బాగా తెలిసిన వారు తెలుగు వచనాన్ని ఇంకో విధంగా ఇంకా చక్కగా చెప్పగలరు. పదాలలో మార్పులు తడితే సూచించండి. 

ఈ వచన ప్రభావం తెలుగు వాంగ్మయంపై కూడా ఉందనడానికి సాక్షమే పోతన వ్రాసిన "కమలాక్షునర్చించు కరములు కరములు" అనే పద్యం. ఇదే తాత్పర్యంతో తన పద్యంలో శివుని బదులు హరిని వాడారు పోతన. 

ఒక నిజభక్తుని మనో భావాన్ని ఆవిష్కరించే వచనమిది. తన్మయత్వము అనే పదానికి నిర్వచనము ఈ వచనం. తత్+మయ = తన్మయం, అంటే నేను-నీవవవడం. భక్తుని ఆలోచనలన్నీ శివుని చుట్టే. చూపులు శివలింగమో, విగ్రహమో కనిపిస్తే అక్కడే చూస్తూ నిలిచిపోతాయి. ఎవరైనా శివుని గురించి మాట్లాడుతుంటే అవే వింటూ ఉండిపోతాడు; మిగిలిన పనులు మరచి పోతాడు. దగ్గొచ్చినా, తుమ్మోచ్చినా, మంచి చూసినా, చెడు చూసినా, ఆశ్చర్యమైన, భయమైనా, సంతోషమైన, దుఃఖమైనా, కూర్చుంటూ, లేచి నిలబడుతూ ఏ పని చేసినా "శివ శివా" అంటూ నోటిలో నుంచి దొర్లేది శివనామమే. "మహాదేవేతి సంకీర్తనం సామీప్యే" అని శివానందలహరిలో అన్నట్టు, ప్రతీ చేష్టలో శివుడున్నప్పుడు అతడు శివునికి సమీపంగా ఉన్నట్టే - సామీప్యముక్తి పొందుతుంటాడు భక్తుడు! 

తుమ్మెద పువ్వు చుట్టూ తిరుగుతుంది. కొంచెం మధువు ఆస్వాదిస్తుంది. ఎందుకో పక్కకి వెళ్తుంది. మళ్లి మధువు గుర్తొచ్చి తిరిగి వస్తుంది. అలా దినమంతా పువ్వుచుట్టూ తిరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడూ మనసు చెదిరినా, తిరిగి వచ్చినట్టు భక్తుడుకూడా ఎన్ని పనులున్నా, కొన్నిసార్లు ధ్యాస వేరే వాటిపైకి పోయినా కూడా గుర్తు తెచ్చుకుంటూ శివుని పాదాలచుట్టూ ధ్యానంలో తిరిగుతూ ఉంటాడు. "భజమనః శివమేవ నిరంతరం" అని మనస్సెపూడూ శివున్నే తలచు కుంటూ ఉంటుంది. 
"ధ్యానే భవానీపతే సాయుజ్యం" అన్నట్టు, ఇక్కడ తత్ అయిన శివుడిని అనునిత్యం ధ్యానంలో అనుభవించే మయ (అంటే తానైన భక్తుడు), ఆ శివునిలోనే చేరిపోయి శివసాయుజ్యం పొందుతాడు. ఇదే "లింగైక్య స్థితి". వీరశైవులు లింగైక్యం పొందటం అంటే ఇలాంటి స్థితిలో ఉండటం.  
ఈ లింగైక్య స్థితిని చూపు, వినికిడి, పలుకు, మనస్సు ఎలా అనుభవిస్తాయో విడివిడిగా వివరించారు బసవన్న.    

మరి ఆ స్థితికి ఎలా చేరుకుంటారు అంటే - చూపులో శివున్ని ఉంచడానికి ఇష్ట లింగాన్ని, వినికిడిలో శివున్ని ప్రేరేపించడానికి గురుజంగమల బోధలను, పలుకు స్వచ్చత కోసం తీర్థ ప్రసాదాలను, మనస్సు-ధ్యానం కోసం మంత్రాన్ని మొత్తంగా మనిషిని శివునిగా మార్చడం కోసమే అష్టావరణాలను (గురులింగజంగమభస్మపాదోదకప్రసాదమంత్రరుద్రాక్షలను) ఏర్పాటు చేసారని నా అభిప్రాయము. కాబట్టి ఎత్తి పరిస్తితుల్లోను వీటిని వీడవద్దని ప్రార్థన.

శరణు శరణార్థి!!
  











Sunday, June 14, 2015

24. Ivanaarava Ivanaarava - Basavanna

కన్నడ వచనం 

ಇವನಾರವ ಇವನಾರವ ಇವನಾರವನೆಂದು ಎನಿಸದಿರಯ್ಯ. 
ಇವ ನಮ್ಮವ ಇವ ನಮ್ಮವ, ಇವ ನಮ್ಮವನೆಂದು ಎನಿಸಯ್ಯ. 
ಕೂಡಲ ಸಂಗಮದೇವಾ ನಿಮ್ಮ ಮನೆಯ ಮಗನೆಂದು ಎನಿಸಯ್ಯ.

తెలుగు లిపిలో 

ఇవనారవ? ఇవనారవ? ఇవనారవనెందు ఎనిసదిరయ్య 
ఇవ నమ్మవ,  ఇవ నమ్మవ,  ఇవ నమ్మవనెందు ఎనిసయ్య 
కూడల సంగమ దేవా నిమ్మ మానెయ మగనెందు ఎనిసయ్య!

తెలుగు వచనం 

ఇతనెవరో? ఇతనెవరో? ఇతనెవరోయని తలపింపకుమయ్య 
ఇతను మావాడే, ఇతను మావాడే, ఇతను మావాడేయని తలపింపుమయ్య 
కూడల సంగమదేవా, మీ ఇంటి పుత్రుడని తలపింపుమయ్య!

వచన కర్త ఆంతర్యం 
నా మనస్సులో పరులనే భావన కలుగకుండు గాక. అందరూ నావారే, శివుని సంతానమనే నెనుపు ఎల్లపుడు ఉండబడుగాక!

విశ్లేషణ
చిన్న వచనమైనా, చాలా గంభీరమైన విషయాన్ని ప్రతిపాదించే వచనమిది. 

"మనము" అన్న భావన మరచి "నేను" అనే స్వార్థం పెరుగుతున్న నేటి సమాజానికి ఈ వచనం చాలా అవసరమని నా అభిప్రాయము.  ఒక తరం క్రితం నుండి ఉమ్మడి కుటుంబాలు పోయి, చిన్న కుటుంబాలు వచ్చాయి - నేను, నా భార్యాపిల్లలు అని. ఈ తరంలో చిన్న కుటుంబ వ్యవస్థ కూడా  బీటలు వారుతుంది; నేను మాత్రమే మిగులుతోంది. ఇలాంటి సందర్భంలో ఈ వచనం చాలా దూరం ఆలోచింపజేస్తుంది.

మన మనస్సు ఎలా పనిచేస్తుందని కొంచెం పరిశీలిస్తే - ఎవరినైనా చూడగానే మనస్సు మొదటగా ప్రశ్నించుకుంటుంది. 'వీరు నావారా?' లేదా 'ఈ జీవి నాకు సంబందించిందా కాదా?' అని.  ఆ ప్రశ్నకి సమాధానం ప్రకారం ఇష్టాయిష్టాలను, వారితో ప్రవర్తించే స్వభావాన్ని మనసు నిర్ణయించుకుంటుంది. తనవారనిపిస్తే వారిని కులుపుకుపోయే విధంగా, తనవారు కారనిపిస్తే వెంటనే స్వార్థ పూరితమైన నిర్ణయాలు చేస్తుంది.  అంటే ఇతరులతో మన వ్యవహారమంతా మనకు తెలియకుండానే మనస్సు యొక్క "నా వారా, లేక పరులా?" అనే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఇది ప్రతీక్షణం లోలోన జరిగే వ్యవహారం. కానీ పరిణామాలు మాత్రం తీవ్రం. ఉదాహరణకు ఇంటికి వస్తున్నారు, ఒక పదేళ్ళ కుర్రాడు-బిచ్చగాడు వాహనం నిలిచిన చోటికి వచ్చాడు. కాళ్ళకి చెప్పులు లేవు ఎండలో అలానే నడుస్తున్నాడు. మీకు చూసి జాలేసింది. ఒక పది రూపాయలు ఇచ్చారు. ఇంటికొచ్చిన తరువాత పదేళ్ళ మీ స్వంత కొడుకు, రాయి తగిలి చెప్పు తెగింది. కాలికి చిన్న గాయమైంది. వెంటనే దుకాణానికి తెసుకుపోయి రెండువందల రూపాయలతో క్రొత్త చెప్పుల జతకొన్నారు. అంటే తనవాడని అనిపించినందుకు మీ పుత్రునికి కొత్త చెప్పులజత. తనవాడు కాడనిపించినందువల్ల ఇంకో కుర్రానికి పది రూపాయలు. ఇలా ఉంటుంది మనసు నిర్ణయం. తప్పని కాదు; కాని అలా ఆలోచిస్తుంది అని చెప్పడం.     

ఇక్కడ బసవన్న కోరుకుంటున్నది అలాంటి అనునిత్యం సాగే కీలకమైన నిర్ణయాన్ని మార్చమని, ఎవరిని చూసినా "తనవార"ని మనసు తలవాలని. అంటే అందరూ తనవారైతే, అందరూ ఆ పరమేశ్వరుని సంతానమని సతతం తలిస్తే, మనకు వారిపట్ల వ్యవహరించే ధృక్పదం సంపూర్ణంగా మారి స్వార్థం నశిస్తుంది అని. అందరూ శివుని వారమే, మనదంతా ఒకే కుటుంబం, శివభక్తులంతా నా బంధువులే, పరులెవ్వరూ లేరు, అనే భావనే ఏంతో ధైర్యాన్నిస్తుంది. నేను అనే భావన తగ్గి మనము అనే భావన పెరగుతుంది. ఇలా అందరూ ఆలోచిస్తే పరస్పరం సహకరించు కుంటూ వసుధైకకుటుంబమే ఏర్పడదా? 

మతాచ పార్వతీదేవి, పితా దేవో మహేశ్వరః 
భాందవం శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం॥ 

అన్న శ్లోకంలో ఉండే తాత్పర్యాన్నే ఇక్కడ బసవన్న మనకి మనోనిర్ణయాలతో జతజేసి చెప్పారు. 

అయితే ఇంకొరరికి భోదించడం కాకుండా ఎవరికి వారు తమ మనస్సుని చక్కబరచుకోవడం ఇక్కడ ప్రతిపాదన. చెప్పడమే కాదు బసవన్న అలా వ్యవహరించారు కూడా. చౌర్యానికి దొంగలు ఇంటికి వస్తే, వారిని సైనికులు పట్టుకున్నా కూడా వారికి కావలసినవి తీసిచ్చి వారిని మార్చారు బసవన్న. 

లోకంలో అందరూ ఆత్మ పరిశీలన చేసుకుంటూ తమ ప్రవర్తనను మార్చుకుంటే, ఈ మూడు భువనాలలో అందరూ మన చుట్టాలే!!
  
శరణు శరణార్థి!!
  

Saturday, June 6, 2015

23. Kumbalakayege Kabuunada Katta Kottade - Basavanna


కన్నడ వచనం 
ಕುಂಬಳಕಾಯಿಗೆ ಕಬ್ಬುನದ ಕಟ್ಟ ಕೊಟ್ಟಡೆ
ಕೊಳೆವುದಲ್ಲದೆ ಬಲುಹಾಗಬಲ್ಲುದೆ
ಅಳಿಮನದಂಗೆ ಶಿವ ದೀಕ್ಷೆಯ ಕೊಟ್ಟಡೆ
ಭಕ್ತಿಯಂತಹುದು? ಮುನ್ನಿನಂತೆ!
ಕೂಡಲ ಸಂಗಯ್ಯಾ,
ಮನಹೀನನ ಮೀಸಲ ಕಾಯ್ದಿರಿಸಿದಂತೆ!

తెలుగు లిపిలో 
కుంబళకాయిగె కబ్బునద కట్ట కొట్టడె 
కొళెవుదల్లదె బలుహాగబల్లుదె 
అళిమనదంగె శివ దీక్షెయ కొట్టడె 
భక్తియంతహుదు? మున్నినంతె
కూడల సంగయ్య, మనహీనన మీసల కాయ్దిరిసిదంతె!   

తెలుగు వచనం 
గుమ్మడికాయకు ఇనప కట్ట కట్టిన
కుళ్ళకమానునే? బలమిపొందదుగదా?   
బలహీన మనునికి శివదీక్షనిచ్చిన 
భక్తియెట్లగును మునుపటివలె?
కూడలసంగయ్య, మనహీనుని నైవేద్యమునకు కాపుంచినట్లు!

వచనకర్త ఆంతర్యం 
శివదీక్ష అర్హత లేనివారికి ఇచ్చినా ఫలించదు! మనస్సులో శివభక్తిలేనివారికి శివదీక్షవల్ల  ఉపయోగముండదు. 

విశ్లేషణ 
గురువు దీక్ష ఇచ్చేముందు భక్తుణ్ణి పరికించి ఇవ్వాలన్నది ఇక్కడ ప్రస్తావన. 

వీరశైవమనేది ప్రయత్నపూర్వకంగా తపించి భక్తితో తీసుకోవలసిన శివదీక్ష. ఇతరులను మతమార్పిడి చేయడానికి చేసే తంతు కాదు. ఈనాడు కొన్ని మతాలవారు తమ బలగం పెంచుకోవడానికి ఇతరులని తమ మతంలో కలుపుకుంటున్నారు. వాళ్ళ మార్పిడివల్ల  జీవుడు ఉద్దరింపబడే అవకాశంలేదు; కేవలం స్వార్థ ప్రయోజనాలు మాత్రమే. ఇక మిగిలిన వారిలో చాలా మంది మతం పేరుతో సభలు, సమావేశాలు, రాజకీయాలు చేస్తారు కాని తనలోని జీవున్ని ఉద్దరించుకొనే ప్రయత్నం చేయడం గాని,  దీక్షలో నిలబడే వారు గాని చాలా తక్కువ. వాళ్ల ప్రయోజనం కేవలం ఒక సంఘానికి అధ్యక్షునిగానో, ఉపాధ్యక్షుని గానో పదవిని పొందడం, దానివల్ల ప్రయోజనాలేమైనా ఉంటే అనుభవించడం. ఇది భక్తి అనబడదు. 

వీరశైవదీక్ష జీవున్ని జననమరణచక్రమునుంచి ముక్తున్ని గావించి, మనిషిని శివునిగా మార్చే సర్వోత్క్రష్ట దీక్ష. ముక్తి కోసం కొందరు సన్యాసం తీసుకొని సంసారానికి, సంసారులకు దూరంగా ఉంటారు. కొందరు కాశిలో మరణించాలంటారు. కొందరు అరుణాచలం దర్శించాలంటారు. ఇలా సనాతన ధర్మంలో ఎన్నో మార్గాలను సూచించినా, ఉన్నచోటే ఉంటూ, నిత్య జీవనాన్ని గడుపుతూ, లింగాంగ సామరస్యమువల్ల  శివైక్యము, జీవన్ముక్తి  కలిగించగలిగే ఒకేఒక్క దీక్ష వీరశైవదీక్ష - ఇలాంటిది లోకంలో ఇంకొక్కటి లేదు.   

అయితే చిత్తచాంచల్యము గలవారు ఈ దీక్షలో నిలబడడం కష్టం. దీనర్థం 'మాతో కాదులే' అని వదిలి పెట్టుకోమని కాదు. దీక్షలోకి దిగే ముందు కొన్ని మౌళిక విషయాలను గ్రహించి అనుసరించడానికి సిద్దపడాలి. ఇది ఎంత సులువైనదైనా కూడా నిత్యసాధన, ఆచారపాలన, అన్నింటిని మించి శివభక్తి మూలముగా గలది.  భక్తిలేని వానికి దీక్ష ఎంత గొప్పదైనా దండగే. ఉదాహరణకి ఒక చిన్న పాపకి తను ఏంతో కాలం అడగగా, అడగగా ఒక చిలుక బొమ్మ కొనిచ్కామనుకోండి. ఆ బొమ్మని ఎంత ప్రేమగా చూసుకుంటుంది? ఎక్కడికి వెళ్ళినా ఆ బొమ్మ తనతో పాటే. తింటున్నపుడు బొమ్మ ప్రక్కనే ఉండాలి. దానికీ తినిపిస్తుంది. రాత్రి పడుకునేటప్పుడు కూడా పట్టుకొని పడుకుంటుంది. మధ్యలో నిద్ర లేస్తే అది కనబడాలి - లేకపోతే ఏడుపు. ఆ పాప ఉద్దేశ్యంలో అది బొమ్మ కాదు, చిలుకే. ఒక వీరశైవునికి శివుని గురించిన తపన ఇదే విధంగా ఉంటుంది. వీరశైవునికి ఇష్టలింగము ఒక వస్తువు కాదు, శివుడే. అలాంటి  భక్తి ఉన్న వానికి శివదీక్ష ఒప్పుతుంది. భక్తిలో ఉన్న వానికి లింగాధారణ వల్ల అది రెట్టింపవుతుంది. ఆ పాపలా తన దీక్షలో తన్మయముచెంది శివానందంలో మునిగి తేలుతూ తద్వారా శివైక్యాన్ని పొందుతాడు.  

ఇక బలహీన మనస్సు గలవానికి, కేవలం విషయ వాంఛలు (లౌకిక సుఖాల మీది ఆశ) కలవానికి, భక్తి కరువైనవానికి, ఈ ఆచారాలు, పూజాది కర్మలు తంతులుగా మారతాయి. ఇతరులకు తమ డంబచారం చూపించ వచ్చునేమో గాని అది భక్తిగాదు, శివైక్యము పొందనేరడు. ఇటువంటి వారికి లింగాధారణ చేయడంవల్ల  ప్రయోజనం ఉండదని బసవన్న ప్రస్తావన. గుమ్మడి కాయకు ఇనప కంచె (frame) కట్టిన ఉపయోగమేమిటి- అది కుళ్ళకుండా ఉంటుందా? మంచి రుచికరమైన నైవేద్యం వండి, బలహీన మనస్కున్ని కాపలాగా పెడితే తట్టుకోగలడా? 

శరణు శరణార్థి!!